కరోనా వైరస్‌తో సకల జనజీవనం అతలాకుతలమైంది. ముఖ్యంగా నగర జీవితాలు, వలసకూలీల బతుకులు పిడుగుకు బుగ్గిపాలయ్యాయి. జీవనోపాధి కరువై పల్లె దిశగా అనూహ్యమైన సామూహిక తిరుగు ప్రయాణం మొదలైంది. ఇది మహమ్మారి సృష్టించిన మహా తిరోగమనం. గ్రామానికి పయనమైన వలస జీవుల భవిష్యత్ ఏమిటి? ఎన్నాళ్ళు ఆ పల్లెలు వారికి పట్టెడు అన్నం పెట్టగలవు? తమ కడుపున దాచుకోగలవు? ఇంతటి భారాన్ని పల్లె మోయగలదా..? అనేది అందరినీ వేధిస్తున్నది. కానీ మన పల్లెలు ఉపాధి కోల్పోయినవారందరికీ జలసిరులతో స్వాగతాలు పలుకుతున్న తీరు తెలంగాణ ప్రత్యేకత.
ఇప్పుడు ఎటుచూసినా పచ్చదనమే. కరోనా రక్కసి పడగలెత్తిన ఈ సమయంలోనే పంట చేతికందుతుంది. పుట్లకొద్దీ ధాన్యపు రాసులు ఇంటికి వస్తున్నాయి. ‘అర్ధ, గణాంక శాఖ’ (డీఈఎస్) నివేదిక ల ప్రకారం 2019-20లో పంటల సాగు విస్తీర్ణంలో అనూహ్య పెరుగుదల నమోదైంది.
రోహిణి కార్తె. ఎండ దంచికొడుతున్నది. నిండు వేసవితో పోటీపడి గోదావరి నీళ్లు పోటెత్తుతున్నాయి. సిరిసిల్ల జిల్లా అనంతసాగర్ మత్తడి దుంకింది. సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్ నిండింది. ఇది మూడు టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ సొరంగం దగ్గర బిగించిన మోటర్లకు నీళ్లందుతున్నాయి. హరీశ్‌రావు ఆహ్వానం మేరకు కేటీఆర్ వచ్చి మోటర్ పెట్టిం డు. నీళ్లు ఎగిరి దుంకినయ్. ఓ చరిత్ర ఆవిష్కృతమైంది. చిన్నకోడూరు మీదుగా బీడు వడ్డ మడిని తడుపుకుంటూ, నెర్రెబడ్డ చెరువులను నింపుకుంటూ కొండపోచమ్మతల్లి పాదాలను తాకటానికి పరుగు తీసినయ్. దారి వెం ట 1.10 లక్షల ఎకరాలను తడపనున్నది.
2016 జూలైలో కృష్ణానది మీది బీమా ఫేజ్-2 నుంచి గద్వాల జిల్లా నడిగడ్డ రైతాంగానికి అందిన తొలి జలఫలం మొదలుకొని రంగనాయకసాగర్ వరకు చిన్న, పెద్ద ఎత్తిపోతల పథకాలు ఒక్కొక్కటిగా పూర్తయి చెరువులను నింపుతున్నాయి. అటు కృష్ణా బేసిన్ ఇటు గోదావరి బేసిన్ పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకా శం ఉన్నదని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ సీజన్లో కాళేశ్వరం కూడా తోడైంది. మొత్తం 340 టీఎంసీలకు నీళ్లు తెలంగాణ బీడు భూములకు పారింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-1 కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లందాయి. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు 4 లక్షల ఎకరాలకు, దాంతోపాటుగా అలీసాగర్, గుత్ప ఇతర పథకాల కింద మరో లక్ష ఎకరాలు, ఎల్ఎండీ దిగువన 4.50 లక్షల ఎకరాలకు సాగునీరందింది. ఎస్సారెస్పీ స్టేజ్-2 కింద 2.50 లక్షల ఎకరాలకు, కడెం ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు కొమురంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల ప్రాజెక్టు ద్వారా మరో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 12,300 చెరువుల్లో పూర్తిస్థాయిలో నీటి లభ్యత ఉన్నది. మరో 4,350 చెరువుల్లో సగానికి పైగా జలాలున్నాయి. కృష్ణా బేసిన్ పరిధిలో పాత మహబూబ్‌నగర్ జిల్లాలో (నికర+మిగులు) జూరా ల, రాజోలిబండ భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, ప్రాజెక్టుల ద్వారా 142 టీఎంసీల వినియోగంతో సుమారు 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమకాలువ, మూసీ, డిండి, సీతారామ ప్రాజెక్టుల ద్వారా 135 టీఎంసీల కృష్ణా జలాల వినియోగానికి ఎనిమిది లక్షల ఎకరాలలో 80 శాతం భూమి సాగయ్యింది.
-సోలిపేట రామలింగారెడ్డి