-రాష్ట్రవ్యాప్తంగా ఏఎన్‌ఎం సెంటర్ల అప్‌గ్రేడ్
-3 రోజుల్లో 58 టిఫా యంత్రాలు అందుబాటులోకి
-జనవరి నాటికి అన్ని జిల్లాల్లో టీ-డయాగ్నస్టిక్
-త్వరలో ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-బీజేపీది.. డబుల్ కాదు ట్రబుల్ ఇంజిన్ పాలన
-ఆరోగ్యసూచీలో చివరిస్థానం ఆ రాష్ట్రాలదే..
-ఏఎన్‌ఎంల మహాసభలో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుత ఏఎన్‌ఎం సెంటర్లను పల్లెదవాఖానలుగా అప్‌గ్రేడ్ చేస్తామని వివరించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన ఏఎన్‌ఎంల 2వ మహాసభల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. కరోనా సమయంలో ఏఎన్‌ఎంలు చేసిన సేవలు అమూల్యమని ప్రశంసించారు. ప్రాథమిక వైద్యం అందించి, రోగాలు ముదరకుండా కాపాడటంలో ఏఎన్‌ఎంలది కీలక పాత్ర అని చెప్పారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలు సూపర్‌హిట్ అయ్యాయనివివరించారు. అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వైద్యరంగం ప్రగతికి మీరే నిదర్శనం
‘2004లో ప్రభుత్వ వైద్యం ఎలా ఉన్నదో, ఇప్పుడు ఎలా ఉన్నదో దానికి మీరే సాక్ష్యం’ అని ఏఎన్‌ఎంలను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, వచ్చే ఏడాది మరో 9 అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గతంలో గాంధీ, ఉస్మానియాలో లభించిన వైద్యం ఇప్పుడు జిల్లాల్లోనే లభిస్తున్నదని తెలిపారు. రెండు మూడు రోజుల్లో 58 టిఫా స్కానింగ్ యంత్రాలు, జనవరి నాటికి అన్ని జిల్లాల్లో టీ-డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పా టు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం డయాలసిస్ సేవలను విస్తరిస్తున్నామని, రాబోయే రోజుల్లో కీమో, రెడీయోథెరపీ కూడా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందని, కరోనా సమయంలో పనిచేసినవారికి వెయిటేజీ ఉంటుందని స్పష్టంచేశారు. రెట్టించిన ఉత్సాహంతో అందరం కలిసి అరోగ్య తెలంగాణ నిర్మాణానికి శ్రమిద్దామని పిలుపునిచ్చారు.
డబుల్ కాదది ట్రబుల్ ఇంజిన్
బీజేపీ రాష్ట్రాల్లో నడుస్తున్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని.. ప్రజలను కష్టపెట్టే ట్రబుల్ ఇంజిన్ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనమూ లేదని విమర్శించారు. ఆరోగ్య సూచిలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంటే, డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు చివరి స్థానంలో ఉన్నాయని వివరించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు ఎంత బాగా పని చేస్తే.. రాష్ట్ర ర్యాంకింగ్ అంత మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, ఏఎన్‌ఎంల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ అనూరాధ, ప్రధాన కార్యదర్శి తారాదేవి, కోశాధికారి రాధ, టీఆర్‌ఎస్‌కేవీ కార్యదర్శులు నారాయణ, మారయ్య తదితరులు పాల్గొన్నారు.