Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పల్లె తల్లిని.. కాపాడుకొందాం

-ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ కాదు.. అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామాలు
-గ్రామాలు, పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టు
-కరోనా కష్టంలోనూ ప్రతినెలా 308 కోట్లు విడుదల
-ప్రతి ఏటా గ్రామాల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
-నాలుగేండ్లకు గ్రామాభివృద్ధి ప్రణాళికతో డిస్ట్రిక్ట్‌ కార్డు
-ఆకస్మిక తనిఖీలు చేస్తా.. శుభ్రత లేకపోతే కఠినచర్యలే
-పంచాయతీరాజ్‌శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేశాం
-మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

పల్లె తల్లిని కాపాడుకొంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంతమంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడితీరాలని స్పష్టంచేశారు. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధిహామీ పథకం, హరితహారం, అడవుల పునరుద్ధరణ, పల్లెప్రగతి, గ్రామాల్లో పచ్చదనం.. పరిశుభ్రత, రైతుబంధు, రైతువేదికల నిర్మాణం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌సెజ్‌ల ఏర్పాటు, కరోనా, అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.

వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులుచేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్ల్లాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం ప్రతిరోజు శుభ్రం కావాల్సిందేనని, ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరొకటిలేదని స్పష్టంచేశారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తికావాలన్నారు. రాబోయే నాలుగేండ్లలో ఏ గ్రామంలో ఏ పనిచేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులుచేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్‌ కార్డు తయారుచేయాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో జరుగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనం చేశారు. సమావేశంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

గ్రామం బాగుతో రాష్ట్రం బాగు
గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టే. ప్లానింగ్‌ ఆఫ్‌ టౌన్‌, ప్లానింగ్‌ ఆఫ్‌ విలేజ్‌ అంటే ప్లానింగ్‌ ఆఫ్‌ స్టేట్‌ అన్నట్టే. వనరులు, అవసరాలను బేరీజు వేసుకొని గ్రామాలవారీగా నాలుగేండ్ల ప్రణాళిక తయారుకావాలి. దాని ఆధారంగా జిల్లా ప్రగతి కార్డు రూపొందించాలి. దాని ప్రకారమే పనులు జరుగాలి. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకొని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్‌శాఖలో ఖాళీలు భర్తీచేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతి నెలా 308 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదలచేస్తున్నది. అసెంబ్లీలో ఇచ్చిన హామీమేరకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, గ్రామాల ఆదాయం ఐదు లక్షలకు చేరుకొనేట్టు చేస్తాం. గ్రామ పంచాయతీలకు రూ.3,694 కోట్ల ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ. 337 కోట్ల సొంత ఆదాయం ఉన్నాయి. అంతా కలిపితే ఏడాదికి రూ.9,916 కోట్లు సమకూరుతాయి. నాలుగేండ్లలో రూ.39,594 కోట్లు వస్తాయి. ఈ నిధులింకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఈ నిధులతో ఏయే పనులుచేసుకోవచ్చో గ్రామాలవారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రామ పంచాయతీలు కచ్చితంగా చార్జ్‌డ్‌ అకౌంట్‌ నిర్వహించాలి. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించాలి. ట్రాక్టర్ల లోన్‌ రీ పేమెంట్‌చేయాలి. కరెంటు బిల్లులు ప్రతి నెలా తప్పక కట్టాలి. 10% నిధులు హరితహారానికి కేటాయించాలి.

పల్లెల్లో వికాస విప్లవం
తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితిని పోల్చిచూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నది. పల్లెప్రగతి వల్ల గ్రామాల్లో పరిస్థితి మారింది. ఆశాజనకంగా ఉన్నది. మార్పునకు మనం శ్రీకారం చుట్టాం. ఈ స్ఫూర్తి కొనసాగాలి. ఇంకా ఎంతో జరుగాలి. అంతవరకు విశ్రమించకూడదు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, వైకుంఠధామం, నర్సరీ, డంప్‌యార్డు దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో మాత్రమే అవి సమకూరుతున్నాయి. ఇదొక అద్భుతం, ఇదొక విప్లవం. తెలంగాణ సాధించిన గొప్ప విజయం. తెలంగాణ ప్రజలకు గర్వకారణం. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు వచ్చాయి. వాటికి ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వస్తున్నాయి. ఈ నెలాఖరుకు అన్నీ సమకూరుతాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు నడుస్తున్నాయి. మొక్కలను సిద్ధంచేస్తున్నారు. డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు జరిగింది. అన్నీ నిర్మాణదశలో ఉన్నాయి. రెండు నెలల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తవుతుంది.

అందరిదీ ఒకే పని
పల్లె ప్రగతి పేరుతో అప్పుడప్పుడు కార్యక్రమం నిర్వహించడం కాదు. ప్రతిరోజు ప్రతిగ్రామం శుభ్రం కావాల్సిందే. ముఖ్యమంత్రి, సీఎస్‌ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరి ప్రాధాన్యం.. గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే. దానికి మించిన పని మరొకటిలేదు. గ్రామాలు శుభ్రంగా ఉంటే, ఆరోగ్య సమస్యలు రావు. రోగాలు దరిచేరవు. ఆరోగ్యం కోసం అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గుతుంది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు బాగా జరుగాలనే ఉద్దేశంతోనే కరోనా కష్ట సమయంలో కూడా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి నెలకు ఐదు వేల అదనపు వేతనం చెల్లిస్తున్నాం. గ్రామాల్లో గుంతలు తొలిగించాలి. పాడుబడిన బావులను పూడ్చాలి. ఉపయోగించని బోర్లను పూడ్చాలి. పిచ్చి చెట్లను, సర్కారు తుమ్మలను తొలిగించాలి. ప్రతి గ్రామంలో ఈ పనులు జరుగాలి. నేను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తా. రాష్ట్రంలో ఏమూలకు పోయి చూసినా అంతా శుభ్రంగా కనిపించాలి. అప్పుడు ఈ చెత్తాచెదారం, ముండ్ల పొదలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటాం. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలతోపాటు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ కూడా ఉన్నాయి. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల్లో పది శాతం మండల పరిషత్‌లకు, ఐదు శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో గానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలోగానీ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు.

ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ కావు
గ్రామ వికాసం కోసం చేపట్టే చర్యల్లో విస్తృత ప్రజాభాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటుచేసింది. గ్రామాల్లో నాలుగురకాల స్టాండింగ్‌ కమిటీలున్నాయి. వర్క్స్‌ కమిటీ, శానిటేషన్‌ కమిటీ, స్ట్రీట్‌లైట్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటీలలో 15 మంది చొప్పున సభ్యులున్నారు. మొత్తం 8,20,727 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులున్నారు. స్టాండింగ్‌ కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. వీరంతా కలిస్తే ఓ సైన్యం. వీరిని క్రియాశీలం చేస్తే పల్లెల అభివృద్ధి ఉద్యమంలా సాగుతుంది. ప్రజలతో ఎన్నికైన 1,32,973 మంది గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులున్నారు. 32 మంది జెడ్పీ చైర్మన్లు, 539 మంది ఎంపీపీలు, 539 మంది జెడ్పీటీసీలు, 5,758 మంది ఎంపీటీసీలు, 12,751 మంది సర్పంచులు, 1,13,354 మంది వార్డు సభ్యులున్నారు. వీరందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. గ్రామాభివృద్ధి పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పోస్టులను భర్తీచేసింది. మొత్తం 13,993 మంది అధికారులు కేవలం గ్రామాభివృద్ధి పనుల కోసమే ఉన్నారు.

32 మంది అడిషనల్‌ కలెక్టర్లు, 32 మంది సీఈవోలు, 32 మంది డీపీవోలు, 68 మంది డీఎల్పీవోలు, 539 మంది ఎంపీడీవోలు, 539 మంది ఎంపీవోలు, 12,751 గ్రామ కార్యదర్శులున్నారు. వీరంతా ప్రతిరోజు పర్యవేక్షిస్తే.. తమ విధులు సక్రమంగా నిర్వహిస్తే గ్రామ వికాసం చాలా వేగంగా, అనుకున్న విధంగా జరుగుతుంది. ఇప్పుడు గ్రామాలు కూడా చిన్నగా అయ్యాయి. గిరిజన తండాలు, గూడేలు, మారుమూల పల్లెలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేశాం. దీనివల్ల పనుల నిర్వహణ, పర్యవేక్షణ తేలికవుతుంది. ప్రతి ఏటా సుమారు రూ.10,000 కోట్ల నిధులు వస్తున్నాయి. 13,993 మంది అధికారులు, 1,32,973 మంది ప్రజా ప్రతినిధులు, 8,20,727 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులున్నారు. కలెక్టర్లకు విస్తృత అధికారాలున్నాయి. గ్రామాల వికాసాన్ని కాంక్షించే ప్రభుత్వం.. అది తీసుకొన్న విధానాలు గొప్పగా ఉన్నాయి. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత తరుణంలో మార్పు రాకుంటే, గ్రామాలు బాగుపడకుంటే ఇక ఎప్పటికీ మార్పురాదు. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధిచేసే కార్యక్రమాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకొని నడిపించాలి.

25 నుంచి హరితహారం
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనిని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రచారాలు చేపట్టాలి. ఉద్యమ స్ఫూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమం సాగాలి. కలెక్టర్లు, డీపీవోలు నాయకత్వం వహించాలి. వైకుంఠధామం, డంప్‌యార్డుల చుట్టూ ప్రహరీలు కాకుండా, చెట్లు పెంచాలి. వాటికి గ్రీన్‌ వాల్‌ (ఎత్తయిన చెట్లు పెంచడం) నిర్మించాలి.

రైతులందరికీ రైతుబంధు
కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వెంటనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించాం. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా పంటసాయం వచ్చేలా చూడాలి. ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకొనైనా పెట్టుబడి సాయం అందేలా చూడాలి.

నరేగాలో నంబర్‌వన్‌
ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నది. 2020-21లో రాష్ర్టానికి 13 కోట్ల పని దినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5%) పూర్తిచేసి లక్షల మందికి ఉపాధి కల్పించాం.

ప్రతి ఏటా సుమారు రూ.10,000 కోట్ల నిధులు
వస్తున్నాయి. గ్రామాల వికాసాన్ని కాంక్షించే ప్రభుత్వం.. అది తీసుకొన్న విధానాలు గొప్పగా ఉన్నాయి. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత తరుణంలో మార్పు రాకుంటే, గ్రామాలు బాగుపడకుంటే ఇక ఎప్పటికీ మార్పురాదు. ప్రజల్లో అవగాహన, స్ఫూర్తి కలిగించి ఉద్యమ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేయాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.