గ్రామాల సమగ్ర అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా సమగ్ర పల్లె పౌరసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మహిళలు స్వయం సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, అందులో భాగంగానే సమగ్ర సేవా కేంద్రాల నిర్వహణను మహిళలకే కట్టబెడుతున్నదని పేర్కొన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని టీఎస్‌పార్డ్‌లో గ్రామస్థాయి పెట్టుబడిదారుల (వీఎల్‌ఈల) శిక్షణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
-సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
-కేంద్రాల ఏర్పాటుతో 10వేల మందికి ఉపాధి
-వీఎల్‌ఈల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన కార్యకర్తలతో ఆయన చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఏ కార్యక్రమం చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారని గత అనుభవాలు చెప్తున్నాయని, అదే క్రమంలో మహిళలు నిర్వహించబోయే పల్లె సమగ్ర కేంద్రాలు విజయవంతంగా నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అన్ని పౌరసేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పల్లె సమగ్ర కేంద్రాల నిర్వహణ ద్వారా సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కేంద్రాలను నిర్వహించే మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకొని మరిన్ని ఆదాయ వనరులు పెంచుకోవాలన్నదే తమ ఉద్దేశమని, అందుకోసమే వీరిని గ్రామస్థాయి పెట్టుబడిదారులుగా పిలుస్తున్నామని తెలిపారు. సమగ్ర పౌరసేవా కేంద్రాలు పూర్తి స్థాయిలో నిర్వహణలోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీ కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఉపాధి హామీ వేతనాలు, ఆసరా పింఛన్ల చెల్లింపులు వంటి ప్రభుత్వ పథకాల నగదు పంపిణీని అనుసంధానం చేస్తామన్నారు.
సాంకేతికను ప్రభుత్వ పాలన విధానాలతో అనుసంధానం చేసినప్పుడు అవినీతి తగ్గుతుందని, ప్రజలకు ప్రభుత్వ ప్రతిఫలాలు వందశాతం అందుతాయన్నారు. పలువురు వీఎల్‌ఈలతో మంత్రి శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని నల్లగొండకు చెందిన నజీమా తెలిపారు.
ప్రస్తుతం బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్‌గా నెలకు రూ.4 వేలు సంపాదిస్తున్నట్లు, ప్రభుత్వ పథకాల నగదు చెల్లింపులను అనుసంధానం చేసిన తర్వాత ఆదాయం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌కు చెందిన రజిత మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవలతో నెలకు రూ.10వేల ఆదాయం వస్తున్నదని, తమ సేవలను పింఛన్ లబ్ధిదారులు అభినందిస్తున్నారని తెలిపారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, స్త్రీనిధి ఎండీ ఎం విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.