Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పల్లెపహాడ్‌కు వందనం

-భూములు ఇస్తామన్న గ్రామస్థులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా -గ్రామచావిడిలోనే అందరి సమ్మతితో రిజిస్ట్రేషన్లు: మంత్రి హరీశ్‌రావు -ప్రతిపక్షాల దుష్ప్రచారం గాలిబుడుగ.. పట్టించుకోవద్దని విజ్ఞప్తి -గజ్వేల్‌లో మంత్రిని కలిసి భూములు ఇచ్చేందుకు సిద్ధమన్న గ్రామస్థులు

Harish-Rao-interacts-with-Palle-Pahad-Villagers

మెదక్ జిల్లాలో నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోతున్నాయి. నిర్వాసిత గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించిన చోటనే, ప్రాజెక్టుకు భూములు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్న విషయం తెలిసిందే. అదే కోవలో బుధవారం మరో ముందడుగు పడింది. గజ్వేల్‌లోని మల్లారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మంత్రి హరీశ్‌రావుతో పల్లెపహాడ్ గ్రామ రైతులు, కుల పెద్దలు, యువజన సంఘాల ముఖ్యులు సమావేశమై భూములు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా పల్లెపహాడ్ గ్రామస్థులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ఇప్పటికే ఆరు గ్రామాల్లో భూసేకరణ ఓ కొలిక్కిరావడం, పల్లెపహాడ్ కూడా అదే కోవలో ప్రయాణించడంతో మరో మూడు గ్రామాల్లో మాత్రమే భూసేకరణ ముందుకు సాగాల్సి ఉన్నది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని సమకూర్చే మల్లన్నసాగర్‌పై కమ్ముకున్న మబ్బులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయన్నారు. భూములను ఇస్తామన్న పల్లెపహాడ్ గ్రామస్థుల నిర్ణయం మర్చిపోలేనిదన్నారు. పల్లెపహాడ్‌వాసులు భూములను అప్పగించడానికి ముందుకురావడం శుభసూచకమని, దీంతో రిజర్వాయర్ పనులు ప్రారంభానికి మరో అడుగు ముందుకు పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆరు గ్రామాలు మల్లన్నసాగర్ నిర్మాణం కోసం భూములను ఇవ్వడానికి స్వచ్ఛందంగా అంగీకరించగా మిగతా గ్రామాల ప్రజలతో కూడా చర్చించి వారి సమ్మతితోనే భూసేకరణ జరుపుతామన్నారు. బలవంతంగా భూములు ఎవరి నుంచి తీసుకోబోమన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నాయని, ప్రాజెక్ట్ నిర్మించకుండా ఆలస్యం చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్న ఆవేదన కూడా వారిలో లేదన్నారు.ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం గాలిబుడుగల వంటిదని, వారిని పట్టించుకోవద్దన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం లేని అవాస్తవాలను భూతద్దంలో చూపిస్తున్నారని విమర్శించారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ కోసమే ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఓటమి ఎరుగని నాయకుడని, ప్రజలకిచ్చిన మాట తప్పని మహానేతని కొనియాడారు. పల్లెపహాడ్‌వాసుల విజ్ఞప్తి మేరకు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పల్లెపహాడ్ గ్రామాన్ని పునర్నిర్మించి ఇవ్వడానికి సీఎం తప్పకుండా అంగీకరిస్తారని భరోసా ఇచ్చారు.

హామీలన్నీ నెరవేరుస్తాం మలన్నసాగర్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ముంపు గ్రామాల ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. చెప్పిన వాటికన్నా ఎక్కువ చేసి చూపిస్తామని, ప్రాజెక్టు వల్ల లబ్ధిపొందే లక్షలాది మంది రైతుల మెప్పుతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితుల మెప్పుకూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో పల్లెపహాడ్ నిర్మాణం కోసం భూమిని ఎంపిక చేసుకుంటే వెంటనే ఇండ్ల నిర్మాణం చేపడుతామన్నారు. దీంతో రిజర్వాయర్ నిర్మాణం కూడా వేగంగా కొనసాగేందుకు వీలు కలుగుతుందన్నారు. గ్రామస్థుల కోరిక మేరకే గ్రామ చావిడి వద్ద లేదా పంచాయతీ కార్యాలయం వద్ద భూమి రిజిస్ట్రేషన్లు జరిగేట్లు చర్యలు చేపడుతామన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు పల్లెపహాడ్ గ్రామస్థులతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేసీ వెంకట్రాంరెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, భూంరెడ్డి, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నంపెట్టేది మల్లన్నసాగరే మల్లన్నసాగర్ ప్రజలకు అన్నం పెట్టే దేవాలయం. ప్రాజెక్టు కోసం గ్రామస్థులమంతా సహకరిస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు మా సమస్యలను విని ఇచ్చిన హామీలు భరోసా కల్పించాయి. మంత్రిపై నమ్మకంతో భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నాం. గ్రామస్థులమంతా ఏకంగా తీసుకున్న నిర్ణయం ఇది. ప్రాజెక్టుల నిర్మాణం కోసమే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. దాన్ని నిజం చేసుకోవడానికి మా వంతు కృషి చేస్తాం. – పరిపూర్ణాచారి, జెడ్పీటీసీ సభ్యుడు

నేటి నుంచే రిజిస్ట్రేషన్లు చేస్తాం పల్లెపహాడ్ భూములివ్వడానికి గ్రామస్థులందరి అంగీకారంతో ముందుకొచ్చాం. మంత్రి హరీశ్‌రావుతో గ్రామ ప్రజల విన్నపాలను వివరించాం. మా గ్రామాన్ని సీఎం దత్తత తీసుకొవాలని కోరాం. సీఎం దృష్టికి మంత్రి హరీశ్‌రావు తీసుకెళ్తానన్నారు. త్వరలో కొత్త గ్రామం నిర్మాణం కోసం గజ్వేల్ నియోజకవర్గంలో స్థలాన్ని ఎంపిక చేసుకుంటాం. గురువారం నుంచే గ్రామంలో రిజిస్ట్రేషన్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. -సంతోష మల్లేశంగౌడ్, సర్పంచ్(పల్లెపహాడ్)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.