Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పంచాక్షరి ప్రతిధ్వని

– అభినవకైలాసం.. ఎర్రవల్లి యాగక్షేత్రం
– చండీ, రుద్ర, బగళ, నవగ్రహ హవనాలు
– పంచాక్షరి జపంతో మార్మోగిన యాగశాల
– నాలుగోరోజు పూర్తయిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం
– ప్రత్యేక పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు
– నేడు పూర్ణాహుతితో యాగం ముగింపు
– విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి హాజరు

శివశివ శంకర భూతపతే.. శంభో మహాదేవ అంటూ పవిత్ర పరమేశ్వరుడి ప్రార్థనలు ఒకవైపు.. జయజయ విమలే.. బగళే అంటూ.. దశమహావిద్యల్లో ప్రముఖమైన బగళాముఖి స్తోత్రాదులు ఇంకోవైపు.. అనంత పరమేశ్వరనాయకి అయిన చండీ సప్తశతి మరోవైపు ప్రతిధ్వనిస్తుంటే.. సిద్దిపేటలోని ఎర్రవల్లి యాగక్షేత్రం అభినవ కైలాసంగా మారిందా అనిపించింది. సర్వం సుభిక్షం.. సమస్తం సుసంపన్నం అన్న ఆకాంక్షతో.. ప్రజలందరు సంతోషంగా ఉండాలని, వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలన్న మహాసంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నాలుగోరోజు విజయవంతంగా కొనసాగింది. గురువారం ఉదయం యాగశాలలోకి సతీసమేతంగా ప్రవేశించిన సీఎం కేసీఆర్ మొదట రాజశ్యామల మాత మండపంలో పూజలు నిర్వహించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపిణిగా శ్రీరాజశ్యామలాదేవిని అర్చించారు.

అర్చనానంతరం శ్రీచక్రార్చన, శరభ శాలువ జపం, హోమపారాయణాదులు జరిగాయి. అనంతరం రుత్విక్కులు వేదోక్తంగా అమ్మవారికి సువర్ణ మంత్రపుష్పాంజలి ఘటించారు. రాజశ్యామల మండపంలో ముఖ్యమంత్రి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత మహారుద్ర మండపంలో జరిగిన పూజలో సీఎం దంపతులు పాల్గొన్నారు. మహారుద్రయాగంలో భాగంగా 44 మంది రుత్విక్కులతో 44 ఏకాదశ రుద్ర హోమా లు, ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి. పంచాక్షరి జపంతో యాగశాల కైలాసాన్ని తలపించింది. పంచోపనిషత్తులు, సుందరకాండ పారాయణం, మహామృత్యుంజయజపం వంటివి నిర్వహించారు. అనంతరం బ్రహ్మ స్వరూపిణి అయిన బగళాముఖి మండపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల సమక్షంలో వేదపండితులు, రుత్విక్కులు పూజలుచేశారు. వరుసగా నాలుగోరోజు కూడా బగళాముఖికి పదివేల జపము జరిగింది. హరిద్రాన్నముతో రెండు వేల మూలమంత్ర సహితంగా హవనంచేశారు.

ఆ తర్వాత సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. మరోవైపు నవగ్రహ మండపంలో ఆదిత్య హృదయం, సూర్యనమస్కారాలు నిర్వహించారు. ప్రధాన యాగశాల అయిన చండీ మండపంలో రాజరాజేశ్వరిదేవి ప్రార్థన చేశారు. 400సార్లు చండీ సప్తశతి పారాయణం జరిగింది. వేదపండితులు సుభాషితాలు వినిపించారు. భజన కార్యక్రమాలతో మధ్యాహ్న పూజలు పూర్తికాగా సాయంకాలం నాలుగు గంటలకు లక్ష నవార్ణజపం పూర్తిచేశారు. సాయంత్రం ప్రదోషకాల సమయంలో అన్ని మండపాల్లో వైభవంగా పూజలు జరిగాయి. పూజానంతరం జరిగిన భజనకార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకొన్నది. శుక్రవారం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం పూర్తికానున్నది. పూర్ణాహుతి కార్యక్రమాన్ని స్వయంగా జరిపించేందుకు విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఎర్రవల్లి క్షేత్రానికి గురువారం రాత్రి చేరుకొన్నారు. ప్రదోషకాల పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాలుగోరోజు పూజాకార్యక్రమాలను శృంగేరీ పీఠ ప్రతినిధి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతోపాటు ఎంపీలు కల్వకుంట్ల కవిత, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, బూర నర్సయ్యగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీబీపాటిల్, సీతారాంనాయక్, బండప్రకాశ్, పసునూరి దయాకర్, వివేక్ దంపతులు, మాజీమంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, ఎర్రబెల్లి దయాకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, నన్నపునేని నరేందర్, భూపాల్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, రైతుసమన్వయసమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, టీఎస్‌టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నేతలు చందర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు నర్సింగరావు, సోమేశ్‌కుమార్, భూపాల్‌రెడ్డి, శాంతకుమారి, యోగితారాణా తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.