Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో మనదే విజయబావుటా

-రానున్న ఏడునెలలు టీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకం
-క్షేత్రస్థాయిలో మంచి పునాది పడితే భవిష్యత్తులోతిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్‌ఎస్
-అందుకు స్థానిక ఎన్నికలే మంచి అవకాశం
-16 ఎంపీ సీట్లు గెలిచి దేశాన్ని శాసిస్తాం
-24 గంటలూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటా
-పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదు
-కార్యకర్తలకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలి
-పూర్వ వరంగల్ జిల్లా ఉద్యమానికి గుండెకాయ
-అందుకే ఇక్కడి నుంచి పర్యటన ప్రారంభం
-దేశానికే దిక్సూచిగా సీఎం కేసీఆర్ పాలన
-జనగామ, వరంగల్ కార్యకర్తల ఆశీర్వాదసభల్లో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

రాష్ట్రంలో త్వరలో జరుగబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి విజయబావుటా ఎగురవేస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. రానున్న ఏడు నెలలు పార్టీకి అత్యంత కీలకమైనవని.. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ ఎన్నికలదాకా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్శించిన పట్టుదలను సడలనివ్వకుండా పనిచేసి టీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలుపాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. జనగామ, హన్మకొండ పట్టణాల్లో వేర్వేరుగా జరిగిన కార్యకర్తల ఆశీర్వాదసభల్లో ప్రసంగించారు. వరంగల్ అంటేనే ఉద్వేగం. వరంగల్ అంటేనే ఉద్యమం. వరంగల్ అంటేనే చైతన్యం. అంతటి మహత్తరమైన నేలనుంచి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించాలన్న పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పర్యటనను ప్రారంభిస్తున్నానని కేటీఆర్ వేలమంది సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రసమితి పుట్టుకే ఒక చరిత్ర.. ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో నాపైన గురుతర బాధ్యతను పెట్టారు. ఆ బాధ్యతను త్రికరణశుద్ధిగా నిర్వహిస్తా అని కేటీఆర్ చెప్పారు. పద్నాలుగేండ్లపాటు సుదీర్ఘపోరాటంచేసి, చివరకు చావునోట్లో తలపెట్టడానికి కూడా భయపడకుండా ఆమరణదీక్ష చేసి తెలంగాణను సాధించుకొచ్చిన ధీరోదాత్తుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదడం లో ప్రముఖపాత్ర పోషించిన జనగామ, వరంగల్ జిల్లా స్ఫూ ర్తి మరువలేనిదని పేర్కొన్నారు.

కార్యకర్తలకు అండగా నిలుస్తా
ఆనాటి నుంచి ఈనాటి వరకు లక్షలమంది కార్యకర్తలే బాసటగా నిలిచారని, ఎత్తిన గులాబీ జెండాను దించకుండా పోరాటపటిమ కనబర్చిన కార్యకర్తలకు అండగా నిలువడమే తనముందున్న ఏకైక కర్తవ్యమని కేటీఆర్ చెప్పారు. ప్రజాప్రతినిధులైనా మంత్రులైనా కన్నతల్లిలాంటి పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి బలమైన పునాదులుంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై గురుతర బాధ్యత అప్పగించారని.. పార్టీ కేంద్ర కార్యాలయంలో తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానన్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ జిల్లాల పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశానని, ఇదే స్ఫూర్తి తో వచ్చే ఆర్నెళ్లలో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఆ తర్వాత అవసరమైతే నియోజకవర్గ కార్యాలయాలు ఏర్పాటుచేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కారం దొరుకుతుందనే భరోసా ఇచ్చేందుకే కార్యాలయాల నిర్మాణమన్నారు. ప్రజాప్రతినిధులైనా, మంత్రులైనా పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా, కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ తెలిపారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఓటమి కారణాలను విశ్లేషించుకుంటామని, మెజార్టీల్లో హెచ్చుతగ్గులపై కూడా సమీక్షిస్తామన్నా రు. కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యాక కార్యకర్తలకు శిక్షణ ఉంటుందన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట్టు ఎవరైనా నేల విడిచి సాము చేయొద్దని హెచ్చరించారు.

ప్రజల గుండెల్లో కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఓడించడానికి దేశంలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రధాని మోదీ, సోనియా, రాహుల్, చంద్రబాబు సహా ఆరుగురు ముఖ్యమంత్రులు, 11మంది కేంద్ర మంత్రులు వచ్చి కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసినా తెలంగాణ సమాజం తమకు తమ ఇంటిపార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్టీయే కావాలని, ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆరే కావాలని 88 సీట్లతో స్పష్టమైన తీర్పు ఇచ్చి కాపాడుకున్నారని తెలిపారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని, ప్రగతిపథంలో నడుస్తుందని ప్రజలు విశ్వసించారన్నారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారని, కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు.

దేశాన్ని శాసిస్తాం
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలను గెలుచుకొని ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో కేసీఆర్ శాసిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ఏ ఎన్నికలైనా మనం వ్యూహాన్ని రచించుకొని కార్యకర్తలను సైనికుల్లా తయారుచేసుకోవాలని నేతలకు సూచించారు. ఇటీవలి ఎన్నికల్లో మన గెలుపుకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకోసం మనం కష్టపడాల్సిన సమయం వచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠంగా నాయకత్వం ఉంటే దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతున్నందున మంచి అభ్యర్థులను బరిలో నిలిపి నాయకులు, ఇంచార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసికట్టుగా ఏడునెలలపాటు కష్టపడాలని సూచించారు. ఎంపీ ఎన్నికలనాటికి కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదని..అలా అని మనం అహంకారానికి పోకుండా ప్రణాళికాబద్ధంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కులవృత్తులను బలోపేతంచేసే దిశగా అనుబంధ కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు.

దేశానికి దిక్సూచిగా కేసీఆర్ పాలన
ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగున్నరేండ్ల పరిపాలనతోనే తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రత్యేకించి రైతు జీవితాన్ని మార్చేవిధంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఇవాళ దేశవ్యాప్తంగా అమలుచేయాలని రాజకీయ నాయకులే కాకుండా దేశానికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం వంటి ఆర్థికవేత్తలు కూడా కోరుకుంటున్నారని.. ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్తే ఈ పథకం గురించే ఇతర పార్టీల నేతలు ఆరా తీస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం కావడంతో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని పేర్కొన్నారు. మధ్యలో యాదాద్రిని అద్భుతమైన పర్యాటకక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేవాదుల ద్వారా ఆరునెలల్లో గోదావరి జలాలతో జనగామ జిల్లాలోని చెరువులన్నీ నింపుకొందామని కేటీఆర్ చెప్పారు. స్టేషన్ ఘనపూర్‌లో లెదర్‌పార్కుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఈ అంశాన్ని మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటుకు కృషిచేస్తానన్నా రు. వరంగల్ పట్టణానికి అతి సమీపంలో 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.

కొడకండ్లలో పద్మశాలీలు, నేతన్నల కోసం అక్కడ మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జనగామ, వరంగల్‌లలో జరిగిన సభల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, పసునూరి దయాకర్, బండాప్రకాశ్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సీతారాంనాయక్, మండలి విప్ బీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దాస్యంవినయభాస్కర్, టీ రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, వొడితల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ జీ పద్మ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, గాంధీనాయక్, నాగుర్లు వెంకన్న, గుండు సుధారాణి, బొల్లం సంపత్, లింగంపల్లి కిషన్‌రావు, కే వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాలోత్ కవిత, సత్యవతీ రాథోడ్, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మందుల సామేల్, శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఖాజాఆరీఫ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు, కొమురవెల్లి ఆలయ చైర్మన్ సేవెల్లి సంపత్, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయానికి భూమి పూజ
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కార్యాలయానికి ఒకేచోట హన్మకొండలోని బాలసముద్రంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం సాయంత్రం భూమిపూజ చేశారు. జనగామ సభ ముగించుకొని వరంగల్ చేరుకొన్న కేటీఆర్‌కు మడికొండ దగ్గర అపూర్వమైన స్వాగతం లభించింది. మడికొండ నుంచి కాకతీయ డిగ్రీ కళాశాల మైదానందాకా నాలుగుగంటలపాటు భారీ బైక్ ర్యాలీతో కేటీఆర్‌ను వరంగల్‌కు కార్యకర్తలు తీసుకెళ్లారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మలు, కోలాటాలు, గుస్సాడీ, కోయ నృత్యాలతో ర్యాలీ కోలాహలంగా సాగింది.

ఘట్‌కేసర్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ
టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జిల్లా పర్యటనలు ప్రారంభించిన కేటీఆర్ గురువారం జనగామ, వరంగల్ జిల్లాలకు వెళ్తూ మార్గమధ్యంలో నారపల్లి, పీర్జాదిగూడ, ఘట్‌కేసర్‌లలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మేడ్చల్ ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం జనగామ శివార్లకు చేరుకున్న కేటీఆర్‌కు జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన వేలమంది కార్యకర్తలు పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా సిద్ధంచేసిన వాహనంలో కార్యకర్తల ఆశీర్వాద సభావేదిక అయిన ప్రిస్టన్ మైదానం వరకు బైక్‌ర్యాలీతో తీసుకొచ్చారు.

మరిచిపోలేని అనుభూతి
వరంగల్ కార్యకర్తల ఆశీర్వాద సభలో కేటీఆర్ ఉద్యమ సమయంలో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. గత నాలుగున్నరేండ్లలో రాష్ట్ర మంత్రిగా తనకు ఎన్నో అవార్డులొచ్చాయని.. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో తాను వరంగల్ సెంట్రల్‌జైల్లో ఉన్నప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ జీవితకాలంలో తనకు మరిచిపోలేని అనుభూతి అని ఉద్విగ్నంగా చెప్పారు. ముఖ్యంగా 2009 నవంబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టయిన సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్‌తోపాటు ఆయన ఇంట్లో గృహనిర్బంధం అయిన రోజు తనకు ఎంతో గొప్పదని ఆయన తెలిపారు. ఉద్యమకాలంలో ఓరుగల్లు గడ్డ ఇచ్చిన స్ఫూర్తిని తానెన్నటికీ మరువలేనని కేటీఆర్ పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.