Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లే

-సర్పంచ్‌ల కొనసాగింపు చట్టరీత్యా అసాధ్యం -ప్రభుత్వానికి స్పష్టంచేసిన సీనియర్ అధికారులు -ఇవీ అధికారుల సూచనలు -మున్సిపాలిటీలుగా మారిన, మున్సిపాలిటీలలో కలిసిన గ్రామాలు 300 వరకు ఉన్నాయి. -వాటికి సర్పంచ్‌లు పర్సన్ ఇంచార్జీలుగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. -గ్రామ పంచాయతీల్లో యథాతథంగా ఉన్నవి ఐదుశాతంలోపు మాత్రమే -కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం అసంబద్ధం. -చట్టం అమలుచేయకుంటే న్యాయపరమైన చిక్కులు కూడా వస్తాయి.

రాష్ట్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వారి స్థానంలో అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నేతృత్వంలోని సీనియర్ అధికారులు సూచించారు. ఇంతకుమించి మరో మార్గంలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం చట్టప్రకారం సాధ్యంకాదని, న్యాయస్థానాలు కూడా అంగీకరించబోవని వారు తేల్చిచెప్పారు. ఆగస్టు 1వ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల పాలనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జీలుగా నియమించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో దాదాపు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పంచాయతీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి చేస్తున్న కసరత్తును సీఎం కేసీఆర్‌కు అధికారులు తెలిపారు. అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా ఎందుకు నియమించాలో, చట్టం ఏం చెప్తున్నదో కూలంకషంగా వివరించారు. అధికారుల సూచనలను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఆగస్టు రెండు నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తున్నాయని, దీనిని అవకాశంగా తీసుకొని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులు గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలుచేయాలని చెప్పారు. గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా జిల్లాకు కోటి రూపాయల చొప్పున రూ.30 కోట్లు అందుబాటులో ఉంచుతామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసుకున్నామని, అయితే, కోర్టు కేసుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.

ఆలోగా అభివృద్ధి పనులు కుంటుపడకుండా ఉండేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నామని స్పష్టంచేశారు. అంతకుముందు కొత్త పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియమకం ఆవశ్యకతను తెలియజెప్పిన అధికారులు.. అందుకు కారణాలను సైతం వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది. కొత్త పంచాయతీల ఏర్పాటు అసెంబ్లీ చట్టంద్వారా జరిగింది. దీనిప్రకారం ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. ప్రస్తుత పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోతుంది. సర్పంచ్‌ల పరిధి కూడా మారుతుంది.

-ఎస్టీలకు ఇచ్చినమాట ప్రకారం గిరిజనతండాలు, ఆదివాసీగూడేలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసింది. 1500 గ్రామాల్లో ఎస్టీలే సర్పంచ్‌లు కానున్నారు. ఎస్టీలు ఎంతోకాలం నుంచి తమ తండా, తమ గూడెంలో తమ రాజ్యం కావాలని కోరుతున్నారు. ఇప్పుడున్న సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జీలుగా నియమిస్తే, ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలనే కొనసాగించినట్టు అవుతుంది. ఎస్టీలకోసం ఏర్పాటుచేసిన పంచాయతీలు మనుగడలోకి రావు. కొత్త పంచాయతీలు ఏర్పడినా తిరిగి పాత పద్ధతే అవలంబించడంవల్ల ఎస్టీలు కోరుకున్న మార్పు ఉండదు. చట్టం కూడా దీన్ని అంగీకరించదు.

-కొత్త పంచాయతీల ఏర్పాటుతో ప్రస్తుతమున్న గ్రామాల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. మున్సిపాలిటీలుగా మారిన, మున్సిపాలిటీలలో కలిసిన గ్రామాలు 300 వరకు ఉన్నాయి. వీటికి సర్పంచ్‌లు పర్సన్ ఇంచార్జీలుగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కొన్ని గ్రామాల శివారు పల్లెలు కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా అవతరించాయి. అవన్నీ ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామపంచాయతీలుగా మనుగడ సాగిస్తాయి. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు యథాతథంగా ఉన్నవి ఐదు శాతం లోపు మాత్రమే. కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్‌ల పరిధి ఇకముందు ఉండదు. కనుక వారిని పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం కూడా అసంబద్ధమే.

-ఇప్పుడున్న సర్పంచ్‌లు ఎన్నికైంది ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలకే. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు వారి అధికార పరిధిలో ఉండవు. వారు ఎన్నికైన గ్రామ స్వరూపానికి, ఇప్పుడున్న గ్రామ స్వరూపానికి సంబంధం లేదు. ఇప్పుడున్న సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా చేస్తే, వారు పాత పంచాయతీ పరిధి మొత్తానికి పర్సన్ ఇంచార్జి అవుతారు. అప్పుడు ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీలుగానీ, కొత్తగా ఏర్పడిన ఇతర పంచాయతీలుగానీ మనుగడలోకి రావు. ఇది చట్టానికి విరుద్ధం. అసెంబ్లీలో చేసిన చట్టం అమలుచేయకుంటే న్యాయపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఎవరైనా కోర్టుకు వెళితే అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ఎందుకు అమలుచేయడం లేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించజాలదు.

-తండాలు, గూడేలతోపాటు కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు మనుగడలోకి రావాలని, కొత్త పాలకవర్గం వచ్చి కొత్త పాలన ప్రారంభం కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడింది. అయితే కోర్టు కేసుల వల్ల సాధ్యంకాలేదు. కోర్టు తీర్పు వచ్చేలోపు కొత్త పంచాయతీలను మనుగడలోకి తేవడం ప్రభుత్వ బాధ్యత. ప్రస్తుతమున్న సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా నియమిస్తే కొత్త పంచాయతీలు మనుగడలోకి వచ్చినట్టు లెక్క కాదు. అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది.

-పై కారణాలవల్ల సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా నియమించలేని అసహాయ పరిస్థితి ప్రభుత్వానిదని, అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి, కొత్త పంచాయతీలను మనుగడలోకి తేవడమే ప్రభుత్వానికున్న మార్గమని అధికారులు స్పష్టంచేశారు.

గ్రామ సమస్యల పరిష్కారానికి జిల్లాకు కోటి -గ్రామాలను గొప్పగా అభివృద్ధి చేయాలి -అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం -గ్రామ సమస్యల పరిష్కారానికి జిల్లాకు కోటి -తక్కువ వేతనాలతో పనిచేసేవారి జీతాలు పెంచాలి -ప్రతి మండలానికి సీవరేజ్ ప్లాంట్ -ఆర్థికంగా బలోపేతానికి ప్రత్యేక బడ్జెట్ -కొత్త పంచాయతీలను గొప్పగా తీర్చిదిద్దాలి -సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ఆగస్టు రెండు నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తున్నాయని, దీనిని అవకాశంగా తీసుకొని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం, రాష్ట్రం బాగుపడుతాయని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు వస్తున్నారని, ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి కచ్చితంగా ఉండేలా కొత్తనియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులు గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలుచేయాలని చెప్పారు.

గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి విచక్షణాధికారాల ద్వారా వినియోగించడానికి జిల్లాకు కోటి రూపాయల చొప్పున రూ.30 కోట్లు అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా వచ్చే స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులకు ప్రస్తుతం గ్రామం ఎలా ఉంది? మూడేండ్ల తరువాత ఎలా ఉండాలి? ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి? అనే విషయంపై కార్యాచరణ ఇవ్వాలి. దాని అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కొత్తగా నియామకమయ్యే గ్రామ కార్యదర్శులకు మూడేండ్ల ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. వారికి ఏయే పనులు చేయాలనే విషయంలో మార్గదర్శనం చేయాలి. అప్పగించిన పనిని ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయాలి. పని బాగాచేసిన వారిని రెగ్యులరైజ్ చేయాలి. పనితీరు బాగోలేనివారిని తొలిగించాలి. గ్రామాల్లో చెట్లు పెంచడం, నర్సరీలు ఏర్పాటుచేయడం తదితర పనులకు సంబంధించి చార్ట్ రూపొందించాలి. ఆయా విభాగాల్లో వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని చెప్పారు.

అభివృద్ధి కుంటుపడొద్దనే స్పెషల్ ఆఫీసర్లు రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసుకున్నాం. చిన్న గ్రామ పంచాయతీలవల్ల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మరింత తేలికవుతుంది. కోర్టు కేసుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఆలోగా అభివృద్ధి పనులు కుంటుపడకుండా ఉండేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నాం. కోర్టు తీర్పువచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికైన సర్పంచ్‌లకు కూడా అసెంబ్లీలో చేసిన చట్టం ప్రకారం విధులు, బాధ్యతలు అప్పగించాలి. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్రను క్రియాశీలం చేయాలి అని సీఎం సూచించారు.

తక్కువ జీతాలున్నవారికి వేతనాలు పెంచాలి పంచాయతీల్లో తక్కువ జీతాలున్న వారికి వేతనాలు పెంచాలని, ప్రతి గ్రామాన్ని ఆకుపచ్చగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. పంచాయతీల ద్వారా గ్రామాభివృద్ధి పనులు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీలకు అవసరమైన నిధులు సమకూర్చడానికి మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మండలానికి ఒక సివరేజ్ ప్లాంటు ఏర్పాటుచేసి, మురికినీటిని శుభ్రం చేయాలని సూచించారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం ఎలా? గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పరిశుభ్రత పాటించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శుల సేవలను ఎలా వినియోగించుకోవాలి? గ్రామ పంచాయతీలకు ఉండే ఖర్చులేంటి? ఆదాయాలేంటి? తదితరాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామ సర్పంచ్ నర్సింహగౌడ్ సీఎంకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం, కరెంట్ బిల్లు, సిబ్బందికి చెల్లించే వేతనాలు తదితరాలపై వివరాలు సేకరించారు. పంచాయత్‌రాజ్ సంస్థలు ఏటా కట్టే విద్యుత్తు బిల్లులు ఎంత ఉంటాయో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని ఆరాతీశారు. ఏటా రూ.600 కోట్ల బిల్లులు కడుతారని ఆయన సీఎంకు తెలిపారు. పంచాయతీలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే ఉన్నతస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, వివేకానంద, కాలె యాదయ్య, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, బాలమల్లు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.