-కేంద్రంలోని దుర్మార్గ పాలన అంతం కావాలి: సీఎం కేసీఆర్
-పచ్చవడ్డ పాలమూరు
-జిల్లాలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు
-పాలమూరు ఎంపీగానే రాష్ట్రం సాధించా
-జాగ ఉన్నోళ్లకు ఇంటి నిర్మాణానికి 3 లక్షలు
-జిల్లా అభివృద్ధికి 220 కోట్లు ఇస్తున్నా: సీఎం
-మహబూబ్‌నగర్‌లో కలెక్టరేట్ ప్రారంభం
-దేశ రాజకీయాల్లోకి పోదామా…?
-మీరిక్కడ గట్టిగా చూసుకుంటమంటే నేను అక్కడ గట్టిగా చూస్తా : కేసీఆర్
-కేసీఆర్ ప్రభుత్వాన్నే కూలుస్తారట!
-స్వయానా ప్రధానే ఈ మాట అనవచ్చునా?
-తెలంగాణ చేసినంత పని.. కేంద్రం చేయలే
-అదే మోదీ కండ్ల మంట.. అందుకే మనపై కక్ష
-రాష్ట్రానికి నిధులివ్వకుండా కేంద్రం కుట్రలు
-మా నీటి వాటా తేల్చేందుకు ఎనిమిదేండ్లా?
-దేశరాజధానిలో నేటికీ కరెంటు కోతలెందుకు?
-కులం, మతం పేరుతో చిల్లర రాజకీయం
-అద్భుత భారతానికి తెలంగాణే పునాది
-దేశాన్ని కూడా తెలంగాణలా అభివృద్ధి చేద్దాం
-భగవంతుడిచ్చిన సర్వశక్తులను ఒడ్డుదాం
-జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దాం
-పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్
తెలంగాణకు సహకరించాల్సిన కేంద్రం..మన ప్రగతిని చూసి కన్నెర్ర చేస్తున్నది. మన పరుగుకు కట్టెలు అడ్డంపెడుతున్నది. ఇది సబబేనా? ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంటే దానికి అడ్డం పడుతరా? ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాన్ని చూసి ఇంత కండ్లమంటనా? ఎదురుమాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతం అంటరు. ‘కేసీఆర్.. నీ ప్రభుత్వాన్ని కూలుస్తా’ అని స్వయంగా ప్రధానమంత్రే అంటే ఏందన్నట్టు? ఎట్ల అర్థం చేసుకోవాలె? మేం పనిచేయం.. మాకు చేతకాదు.. మిమ్ములను చేయనియ్యం అన్నట్టే కదా.
కేంద్రంలోని దుర్మార్గ, దౌర్జన్య పాలనకు అంతం పలకాల్సిన అవసరం వచ్చింది. తెగించకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా తయారు చేసేందుకు ఆ దేవుడిచ్చిన సర్వశక్తులను ఒడ్డి ముందుకు పోదాం. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దాం. అద్భుతమైన భారత నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులు వేసి చరిత్రలో మనపేరు సువర్ణాక్షరాలతో రాసేలా ఉద్యమిద్దాం
– ముఖ్యమంత్రి కేసీఆర్
కేంద్రంలో దుర్మార్గ, దౌర్జన్య పాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. దానికి అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాల్సిందేనని చెప్పారు. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులు వేద్దామని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కూడా తెలంగాణలా అభివృద్ధి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుదామని అన్నారు. బీఆర్‌ఎస్‌తో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దామని చెప్పారు. ‘నేను మీతో ఉంటా. మీరు నాతో ఉండాలె. ఆశీర్వదించాలె’ అని ప్రజలను కోరారు. దేశంలో కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాకెందుకులే అనుకొంటే బాధపడక తప్పదని హెచ్చరించారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
దేశ రాజకీయాల్లోకి పోదామా..?
‘దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిద్దామా..? బీఆర్‌ఎస్‌కు కచ్చితంగా పోదామా? ఇక్కడ మీరు గట్టిగ చూసుకుంటమంటే.. నేను అక్కడ గట్టిగ చూస్తా. పోదామా?’ అని సీఎం కేసీఆర్ ప్రజలను అడిగారు. దేశ రాజకీయాల్లోకి వెళ్దామని సభికులంతా ముక్తకంఠంతో పిడికిలి బిగించి చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘తెలంగాణ మాదిరిగా దేశాన్ని తయారు చేసేందుకు ఆ భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులను ఒడ్డి ముందుకు పోదాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులు వేసి, మన పేరు బంగారు అక్షరాలతో రాసుకుందాం’ అని పిలుపునిచ్చారు.
ఈ దుర్మార్గాలకు అంతం పాడాలే
ఎవరో చిల్లరగాళ్లు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలను అప్రమత్తంగా గమనించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. అది గమనించకపోతే, అర్థం అయి కూడా అర్థం కానట్టు ఉంటే అందరి బతుకులు అగమైపోతాయని హెచ్చరించారు. ‘భారత జాతి జీవనాడిని కొందరు కలుషితం చేస్తున్నారు. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రజల మధ్య చీలికలు తెచ్చి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, అబద్ధాల గోడలు సృష్టించి, ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తూ దుర్మార్గంగా, దౌర్జన్య పూరితంగా వ్యవహరిస్తున్న తీరును మనందరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర ఈ దుర్మార్గాలకు ముగింపు పలికేలా పంజా లెవ్వాలే, దెబ్బ కొట్టాలే’ అని పిలుపునిచ్చారు.
తెగించకపోతే తెలంగాణ వచ్చేదా?
కొందరు దొంగలు (ఎమ్మెల్యేల కొనుగోలుకు అంశానికి సంబంధించి) మొన్న హైదరాబాద్‌కు వచ్చి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని చూస్తే దొరకబట్టి జైల్లో వేశామని కేసీఆర్ తెలిపారు. మేం చేసింది కరెక్టే కదా? అని ప్రజలను అడిగారు. ‘దేశంలో ఎక్కడో ఒక దగ్గర తిరుగుబాటు మొదలవ్వాలి. తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే వాళ్ల అరాచకాలు ఇంకా పెరిగిపోతాయి. ఆనాడు మనం తెగించకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. నాకెందుకులే అనుకోవడం కరెక్ట్ కాదు’ అని సీఎం అన్నారు.
వాల్మీకి బోయలకు కేంద్రం అన్యాయం
కేంద్ర ప్రభుత్వం వాల్మీకి బోయలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని కేసీఆర్ విమర్శించారు. ‘పాలమూరు జిల్లాలో ఎంతో మంది వాల్మీకి బోయలున్నారు. వాళ్లు ఎప్పటి నుంచో తమను ఎస్టీ జాబితాలో కలుపాలని అడుగుతున్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రానికి ఏడేండ్లు చాలవా? రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ తీర్మానం చేసి పంపిస్తాం. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పాలమూరు దైవం కేసీఆర్: శ్రీనివాస్‌గౌడ్
పాలమూరును బాగుచేసిన దైవం సీఎం కేసీఆర్ అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. తమ దైవాన్ని ఎవరైనా ఏదైనా అంటే మహబూబ్‌నగర్ ప్రజలు సహించరని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఏది అడిగినా కాదనకుండా జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకారం అందిస్తున్నారని తెలిపారు. అంతటి మహోన్నత నేత, ప్రగతి ప్రదాతపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు చెప్పారు. నాడు పాలమూరు నుంచి వలసలు పోతుంటే పట్టించుకోని నాయకులు నేడు ప్రజల బాధలు తీర్చేందుకు వచ్చిన నాయకుడిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశం బాగుపడాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్న కేసీఆర్ వెంట ఉంటామని, ఎన్నిశక్తులు అడ్డొచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు.