-టీఎస్ఐపాస్ చట్టం అమలుతో పెరిగిన ఉపాధి అవకాశాలు -పర్యావరణహితంగా పారిశ్రామీకరణ.. ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం -ఎమ్మెస్ఎంఈతో ఎక్కువ ఉపాధి అవకాశాలు.. పార్కులో నైపుణ్య శిక్షణా కేంద్రం -పరిశ్రమల దగ్గరే కార్మికులకు ఇండ్లు దేశవ్యాప్తంగా టీఎస్ఐపాస్పై ఆసక్తి -తెలంగాణ ఈరోజు అమలుచేసింది.. రేపు ఇతర రాష్ట్రాలు ఆచరిస్తాయి -దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ -పార్కును రెండువేల ఎకరాలకు విస్తరిస్తామని వెల్లడి ఉమ్మడి నల్లగొండలో డ్రైపోర్టు ఏర్పాటుకు హామీ

రాష్ట్రంలో టీఎస్ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 12 లక్షలమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో పర్యావరణహితంగా పారిశ్రామీకరణ ఉంటుందని తెలిపారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. 435 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రెండువేల ఎకరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. విస్తరించే ప్రాంతంలోనూ గ్రీన్ క్యాటగిరీ పరిశ్రమలకే అవకాశం కల్పిస్తామని తెలిపారు. శుక్రవారం యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో టీఎస్ఐఐసీ- టీఐఎఫ్- ఎమ్మెస్ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. పార్కు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.
పారిశ్రామికవాడ అవసరాల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను, తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌గా సాగిందని, ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తూనే నూతన పరిశ్రమలను రాష్ర్టానికి ఆహ్వానించడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతున్నామని చెప్పారు. సులభ వాణిజ్య విధానంలోనూ తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నా రు. దేశంలో అన్నిరంగాలకు 24 గంటలపాటు విద్యు త్ సరఫరాచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పారిశ్రామిక విధానంలో విప్లవాత్మక సంస్కరణలు అమలుచేస్తున్నామని తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల పరిశ్రమలశాఖల మంత్రుల సమావేశంలో తాను టీఎస్ఐపాస్ గురించి వివరించినప్పుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు తమ రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారని పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కొంద రు, తెలంగాణ నుంచి సహకారం అందించాలని మరికొందరు కోరారని వెల్లడించారు. దేశమే అబ్బురపడే విధంగా టీఎస్ఐపాస్ను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ ఈరోజు అమలుచేసింది రేపు దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆచరిస్తున్నాయని అన్నారు.

పర్యావరణాన్ని పణంగా పెట్టలేం పారిశ్రామీకరణకోసం పర్యావరణాన్ని పణంగా పెట్టలేమని మంత్రి కేటీఆర్ చెప్పారు. పారిశ్రామీకరణ పర్యావరణహితంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. జీడీపీ, జీఎస్డీపీ అన్నీ అవసరమున్నా.. పర్యావరణం కూడా ముఖ్యమేనని స్పష్టంచేశారు. భారీ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉన్నా.. ఎమ్మెస్‌ఎంఈల ద్వారానే అధిక ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్ చైనాలో పర్యటించినప్పుడు అక్కడి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పరిశ్రమలకు సమీపంలో నివాసం ఉండటాన్ని చూశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే వాక్ టు వర్క్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించి, ఇక్కడ 194 ఎకరాలను టౌన్షిప్ కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. మరో 65 ఎకరాలు కావాలని అడుగుతున్నారని, దానిని కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
పారిశ్రామిక పార్కులో పచ్చదనం ఉట్టిపడాలి దండుమల్కాపూర్ పరిశ్రమల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోవాలని టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ పార్కు ఏర్పాటులో భూములు కోల్పోయినవారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పది ఎకరాల స్థలంలో నైపుణ్య శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, స్థానిక యువతకు శిక్షణనిచ్చి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందుకే ఇక్కడ స్వల్ప ధరలకే భూములు కేటాయించామని చెప్పారు. రూ.6 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించామని, పారిశ్రామిక ప్రాంతం విస్తరించనున్నందున 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించాల్సి ఉన్నదని చెప్పారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో డ్రైపోర్టు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో డ్రైపోర్టు కూడా ఏర్పాటుచేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెస్ఎంఈ పరిశ్రమలు ఖాయిలా పడకుండా చూసేందుకు, ఖాయిలాపడినవాటిని గుర్తించి, అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుచేశామని తెలిపారు. కేంద్రం ఎన్ని చెప్తున్నా… బ్యాంకులు వాటిని అమలుచేయడంలేదని తప్పుపట్టారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా కోటి రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలున్నా.. ఎక్కడా అమలుచేయడం లేదన్నారు. బ్యాంకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమ సమయంలోనే రోడ్‌మ్యాప్ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉండాలనే దానిపై నాటి ఉద్యమ నేతగా కేసీఆర్ ఒక రోడ్‌మ్యాప్ రూపొందించారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. మిషన్ భగీరథ, రూ.30వేల కోట్లతో నిర్మించే దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టు, యాదాద్రి దేవాలయ అభివృద్ధి పనులు, తాజాగా దండుమల్కాపూర్ పారిశ్రామికపార్కు.. ఇలా అన్నింటికీ నల్లగొండ జిల్లానే సీఎం కేసీఆర్ ఎంచుకున్నారని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జెడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, సుధీర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఏ నర్సిరెడ్డి, శంభీపూర్ రాజు, యెగ్గె మల్లేశం, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేల్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, స్థానిక ఎంపీపీ టీ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
తోపా సెంటర్‌కు శంకుస్థాపన దండుమల్కాపూర్ పార్కులో టీవోపీఏ (తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్- తోపా) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యాలయానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రింటింగ్, ప్యాకేజింగ్ రంగంలో మరింత ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తోపా ప్రెసిడెంట్ సీ రవీందర్‌రెడ్డి పలు ప్రాజెక్టుల కోసం విజ్ఞప్తిచేశారు.

మాధవరెడ్డి ప్రజల మనిషి -విగ్రహావిష్కరణలో మంత్రి కేటీఆర్ భూదాన్‌పోచంపల్లి: దివంగత మాధవరెడ్డి ప్రజల మనిషిగా, ప్రజానాయకునిగా పేరొందారని, ఆయనలేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులోని కొత్తగూడెం వద్ద మాధవరెడ్డి అభిమాని ముత్యాల మహిపాల్‌రెడ్డి ఏర్పాటుచేసిన మాధవరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాధవరెడ్డికి, తమ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా డైనమిక్ లీడర్‌గా ఎదిగిన మాధవరెడ్డి నేడు మన మధ్య లేకపోవం బాధాకరమని అన్నారు. ఆయన ఆశయ సాధనలో ఆయన వారసునిగా జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి సతీమణి మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, నాయకులు కొమిరెల్లి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
