Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పనుల వేగం పెరగాలి..

గత ప్రభుత్వాల తరహాలో పనిచేస్తామంటే కుదరదని, పనిలో వేగం పెరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి వచ్చిన మూస పద్ధతులకు స్వస్తి పలకాలని, కొత్త పద్ధతులతో ముందుకు సాగాలని ఉద్బోధించారు. సాధించుకున్న తెలంగాణలో గెలిచి నిలవడంకోసం కృషి చేయాలని చెప్పారు. అధికారులు సత్ప్రవర్తనతో పనిచేయాలని, అనవసరమైన ఇగోలకు పోవద్దని సలహా ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మనమందరం జాతి నిర్మాణ ప్రక్రియలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోకూడదని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పారు. సమిష్టికృషితో ముందుకు సాగితేనే అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు. -మూసపద్ధతులు వద్దు.. సమిష్టి కృషితోనే అద్భుత ప్రగతి -కొత్త పద్ధతులతో ముందుకు సాగాలి -జాతినిర్మాణంలో భాగస్వాములమవుదాం -త్యాగాలతో రాష్ర్టాన్ని సాధించుకున్నాం -నిలిచి గెలిచేలా కృషి చేయాలి -ప్రధాని సైతం మనల్ని ప్రశంసిస్తున్నారు -నిజామాబాద్ జిల్లా సమీక్షలో సీఎం కేసీఆర్

CM-KCR-District-review-meeting-in-Nizamabad

నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ ప్రభుత్వం పనితీరు బాగుందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పలువురు కేంద్ర మంత్రులు కూడా అభినందిస్తున్నారని, ఇది మనకు గర్వకారణమని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎట్లాపడితే అట్లా మాట్లాడుకోవటం మానుకోవాలని, ఇద్దరు అధికారులపై గట్టిగా అరిచినంత మాత్రాన గొప్పవాళ్లమవుతామని ప్రజాప్రతినిధులు భావించుకోకూడదని సుతిమెత్తగా హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో 871 పథకాలు అమలులో ఉండేవన్న సీఎం.. వాటిలో పనికిరాని 450 పథకాలను రద్దు చేయటమే కొత్త పద్ధతిలో ముందుకు పోతుండటానికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లవద్ద రూ.10కోట్ల నిధి ఏర్పాటుచేస్తామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలవద్ద రూ.3కోట్లు పెడుతున్నామని, మంత్రులవద్ద రూ.25 కోట్లను అందుబాటులో ఉంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

త్యాగాలకోర్చి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణకోసం కొన్ని దశాబ్దాల పోరాటం జరిగింది. ఎన్నో త్యాగాలు, కష్టాలకు ఓర్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలకోసం కష్టపడి పనిచేయాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులుంటాయి. గతంలో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలతోకూడా నేను మాట్లాడిన. ఎప్పటికప్పుడు ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాలి. మనందరం జాతి నిర్మాణ ప్రక్రియలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. పనితీరులో స్పీడ్ పెరగాలి అని చెప్పారు. నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెస్తాం నిజాంసాగర్ జలాశయం బలోపేతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. నిజాంసాగర్‌కు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాలువల్లో నిజాంకాలంలో ఏర్పాటుచేసిన తూములే ఉన్నాయి. అవన్నీ తుప్పుపట్టి పోయాయి. కాళేశ్వరం వచ్చేలోపే కాలువలను ఆధునీకరించుకుని సిద్ధం చేసుకోవాలి అని జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టునుంచి ఒక్క రూపాయి ఖర్చులేకుండా నిజాంసాగర్‌లోకి నీళ్లొస్తాయన్నారు. గోదావరి, మంజీర నదులకు ఎగువనుంచి నీళ్లు వచ్చినా, రాకపోయినా.. ఏడాది మొత్తం నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాల్లో నీరు నిల్వ ఉండేలా చేయటమే లక్ష్యమని స్పష్టంచేశారు. కాళేశ్వరం ఎత్తిపోతలద్వారా ఈ కల సాకారం అవుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో కరువు ఎక్కువగా ఉందని, దీని నివారణకు రూ. 32 కోట్లు కేటాయించామని సీఎం చెప్పారు.

బృహత్తర పథకం మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ చాలా బృహత్తరమైన పథకమని సీఎం కేసీఆర్ అన్నారు. 2016-17 బడ్జెట్‌లో రూ.26,657 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సమైక్యరాష్ట్రంలో చెరువులన్నీ విధ్వంసానికి గురయ్యాయని, 46,300 చెరువులు మాత్రమే మిగిలాయని అన్నారు. మనకు అక్కరకు వచ్చినా రాకపోయినా ముందు తరాలకు చెరువుల సంపద పనికివచ్చేలా పునరుద్ధరించుకోవాలని చెప్పారు. దీని ఫలితం తక్షణమే ఉంటుందని, ఇరిగేషన్ అధికారులు, ఎమ్మెల్యేలు, జల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి మిషన్ కాకతీయను పరుగులు పెట్టించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులన్నింటినీ బలోపేతం చేయటంద్వారా 10లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని సీఎం అన్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా గొలుసుకట్టు చెరువులు 3,251 ఉన్నాయని, వీటిని విడతలవారీగా పునర్నిర్మాణం చేయటంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

తొమ్మిది గంటల విద్యుత్‌కు శ్రీకారం చుట్టాం వ్యవసాయానికి తొమ్మిది గంటల పగటిపూట విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్ష చేసే క్రమంలో అన్నారు. జిల్లాలోని సబ్‌స్టేషన్లు, వ్యవస్థ 9 గంటల సరఫరాకు సరిపోతాయా? అని ఎస్‌ఈని ప్రశ్నించారు. తాము ఇటీవల ప్రయోగాత్మకంగా రెండు విడతల్లో పగటిపూటే 9 గంటలు విద్యుత్ సరఫరా చేసినట్టు ఆయన బదులివ్వడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్‌గ్రిడ్‌కు విద్యుత్ సరఫరాకోసం మంజూరుచేసిన సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, విద్యుత్‌లైన్ల పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. తెలంగాణలో ఉన్నన్ని బోర్లు ఏ రాష్ట్రంలోనూ లేవని, భూమి మొత్తం డొల్లబారిపోయిందని కేసీఆర్ అన్నారు. పారే నీటిని వినియోగించుకుంటేనే ఈ సమస్య తీరుతుందని అన్నారు. బోర్ల అవసరం, విద్యుత్ వాడకం కూడా తగ్గుతుందని చెప్పారు.

వేసవిలో ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం సీజనల్ ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వైద్య- ఆరోగ్య శాఖ పనితీరును ముఖ్యమంత్రి సమీక్షిస్తూ.. డీఎంఅండ్‌హెచ్‌వో ఉన్నారా? వడదెబ్బలు ఎలా ఉన్నాయి? ఎండ దెబ్బతో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అని ఆరా తీశారు. వడదెబ్బ నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని డీఎంఅండ్‌హెచ్‌వో చెప్పారు. హాస్పిటళ్లలో పాత బెడ్లు, స్టాండ్లు అన్నీ తుప్పు పట్టిపోయినవి ఉన్నాయని, వాటిని చూస్తేనే జబ్బు మరింత పెరిగేలా ఉందని సీఎం అన్నారు. కొత్తవి కొనుగోలు చేయాలని, ఏరియా దవాఖానలేకాదు.. పీహెచ్‌సీల్లో కూడా మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు.

వర్షాకాలంలో, చలికాలంలో, వేసవి కాలంలో ఎలాంటి జబ్బులు వస్తాయి? అనే అంశాలపై ముందస్తుగా యాక్షన్‌ప్లాన్ తయారుచేయాలి. పత్రికలకు, మీడియాకు ఎప్పటికప్పుడు స్పష్టత ఇవ్వాలి. ప్రకటనలు ఇవ్వాలి. ప్రజల్లో ధైర్యంనింపాలి అని డీఎంఅండ్‌హెచ్‌వోకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా హాస్పిటల్ 500 పడకల కెపాసిటీ సరిపోవటంలేదని, స్థాయిని పెంచాలని, మైనార్టీలకు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ సంవత్సరం కొత్త హాస్పిటళ్లను మంజూరు చేయటంలేదని, పాతవాటిని మాత్రం బలోపేతం చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తున్నామని, రూ.1,750 కోట్ల బడ్జెట్‌ను పెంచామని తెలిపారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీచేసిన విషయాన్ని సీఎం గుర్తుచేచేశారు. జాతీయ రహదారులపై ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు రూ.60 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని, నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, పెర్కిట్‌లో ట్రామాకేర్ సెంటర్లను ఈనెల మూడో తేదీన ప్రారంభించనున్నట్టు తెలిపారు.

త్వరలో అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, అందుకు అనువైన వాతావరణం, స్థలం, వసతులు ఉన్నాయని ఎంపీ కవిత సీఎం దృష్టికి తెచ్చారు. గతంలో వీసీలు దుర్మార్గంగా ప్రవర్తించారని, అందుకే యూనివర్సిటీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని, కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నామని సీఎం అన్నారు. త్వరలో రాష్ట్రంలోని ఉన్న అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని, జిల్లా కలెక్టర్లతో రిజిస్ట్రార్లు చర్చించిన తర్వాత ఆ సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని సమస్యలను ఆ సమావేశంలో చర్చిస్తామని ఎంపీ కవితకు హామీ ఇచ్చారు.

ఈ సమీక్షాసమావేశంలో జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డీ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సీఎంవో అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీపాటిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మహ్మద్ షకీల్, హన్మంత్‌షింధే, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, డీ రాజేశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నేడు వెంకన్న ఆలయంలో పూజలు బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ కొండపై గతేడాది వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం జరిగింది. ఇక్కడ కొద్దిరోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వెంకన్నను దర్శించుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరిన మేరకు సీఎం కేసీఆర్ బాన్సువాడకు వచ్చారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బయలుదేరి తిమ్మాపూర్ గుట్టకు వెళ్తారు. సతీసమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు.

మిషన్ భగీరథ.. విజయవంతం ఇలా.. మిషన్ భగీరథ పథకాన్ని త్వరగా పూర్తిచేసేందుకు ఏం చేయాలి అనే అంశంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. ఎల్ నినో బలహీనపడిందని, ముందస్తు వర్షాలకు అవకాశం ఉందని సీఎం చెప్పారు. జూన్ నెల ప్రారంభమయ్యేలోపు, రోహిణి కార్తెలోనే సింగూరు, శ్రీరాంసాగర్ అంతర్భాగంలో చేస్తున్న పనులను పూర్తిచేసుకోవాలని సూచించారు. వర్షాలు పడినా సింగూరులో పనులు కొనసాగించుకునే అవకాశం ఉంటుందా? అని చీఫ్ ఇంజినీరును అడిగారు. ఎస్సారెస్పీలో పనులు మందకొడిగా జరుగుతున్నట్టు సీఎం గుర్తించారు.

మంచినీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తాను చెప్పిన విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సింగూరు వాటర్‌గ్రిడ్ పనులు ఏప్రిల్ నెలలో, శ్రీరాంసాగర్ వాటర్‌గ్రిడ్ పనులు మే నెల మూడో వారం వరకు సేఫ్ లెవల్‌కు తీసుకురావాలని గడువు నిర్దేశించారు. నాణ్యమైన హెచ్‌డీపీఈ పైపులను వాడుతున్న దృష్ట్యా లీకేజీ సమస్యలు రాబోవని చెప్పారు. ఎక్కడెక్కడ పైపులు వేయాలనే అంశంపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చొని అవగాహనకు రావాలని సూచించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రణాళిక తయారుచేసి, రైతులు విత్తనాలు వేయకముందే వారి పొలాల్లో పైపులైన్లు వేయాలని సూచించారు. విత్తనాలు వేసి, మొలకెత్తిన తర్వాత పైపులైన్లకోసం తవ్వితే వారికి నష్టం కలుగుతుందన్నారు. వేరే చోట్ల అవసరమున్నప్పుడు పైపులు వేసినా.. విత్తనాలు వేసేచోట మాత్రం ముందుగానే వేయాలని ఆదేశించారు.

వేసవికాలంలోనే పైపులైన్లు వేసే ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఎర్రవల్లిలో తన పంటపొలం నుంచి మిషన్ భగీరథ పైపులైన్లు వేసిన అంశాన్ని గుర్తుచేస్తూ తాను ముందుకు వస్తే రాష్ట్రవ్యాప్తంగా మంచి సంకేతం వెళ్లిందన్నారు. కొన్ని పనులకు పరిపాలన అనుమతులు రాలేదని ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ చెప్పటంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకా పాత అలవాటు పోలేదా? జాప్యం చేయాల్సిన అవసరం ఉందా? అనుమతులు వెంటవెంటనే ఇచ్చేయండి. పనులు చకచకా నడిపించండి అని గట్టిగా చెప్పారు. స్పీడ్ పెంచటానికి ప్రజాప్రతినిధులు కృషిచేయాలని, సమావేశం ఏర్పాటుచేసుకొని అవగాహన చేసుకోవాలని, మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవాలని సూచించారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.