-కాంట్రాక్టుల్లో నామినేషన్ పద్ధతి ఉండదు -మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ -కాకతీయుల చెరువుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ -ఐదేండ్లలో 46వేల చెరువుల పునరుద్ధరణ, 265 టీఎంసీల నిల్వ -సభ్యులందరికీ చెరువుల పునరుద్ధరణ వివరాలిస్తామని వెల్లడి

ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని 46 వేల చెరువులను ఉద్యమస్ఫూర్తితో పునరుద్ధరించేందుకు ప్రభుత్వ ప్రణాళికలను రూపొందించిందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన నోట్‌ను సభ్యులందరికీ అందచేస్తామని, అందులోనే ఈ ఏడు చేపడుతున్న చెరువుల వివరాలు కూడా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వివరించారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు అడిగిన ప్రశ్నలపై వివరంగా సమాధానం చెప్పారు. చెరువుల పునరుద్ధరణ కాంట్ట్రాక్టుల్లో ఎలాంటి నామినేషన్ పద్ధతి ఉండబోదని, పారదర్శకంగా కాంట్ట్రాకులు ఇస్తామని చెప్పారు. అత్యధిక ఆయకట్టు ఉన్న చెరువులకే ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. చెరువుల అలుగులు, తూములతో పాటు క్యాచ్మెంట్ ప్రాంతంనుంచి వచ్చే కాల్వల మరమ్మతులు చేపడతామని, పూడికతీత కచ్చితంగా ఉంటుందని చెప్పారు.
సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యం…. దేశంలో ఏ రాష్టంలో కూడా లేనన్ని చెరువులు ఒక్క తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. తెలంగాణకు సిరులు పండించిన చెరువులను ఆరుదశాబ్దాల సీమాంధ్ర వలసపాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వేల చెరువులున్న పాలమూరులో ఎస్ఈనే నియమించలేదని, గుంటూరులో 365 చెరువులున్నా ఎస్ఈను ఇచ్చారని వివరించారు.
కులవృత్తులకు ఆలంబన.. చెరువుల ఉద్ధరణ ద్వారా గీతకార్మికులకు, చేనేతకార్మికులకు, మత్స్యకారులు, రజకులు తదితర వృత్తిదారులందరికీ మేలు జరుగుతుందని హరీశ్‌రావు చెప్పారు. చెరువు ద్వారా ఉపయోగం పొందే కులవృత్తిదారులందరితోనే చెరువుల పరిరక్షణ కమిటీ వేసే ఆలోచన ఉన్నదని మంత్రి చెప్పారు. ప్రధానంగా ప్రతీ గ్రామంలో భూగర్భ జలవనరులు పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యాచరణలో చెరువులలోకి వచ్చే కాలువలను, చెరువులను, చెరువుల నుండి పొలాలలోకి వెళ్లే పంటకాల్వలను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఆయా గ్రామాల అవసరాలకు అనుగుణంగా గ్రామ ప్రజలు తమ చెరువులకు కావాల్సిన పనులను నిర్ధారించాలని ఆయన కోరారు. గ్రామ సర్పంచ్‌లను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు అందరినీ ఈ మహత్తర ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని ఆయన చెప్పారు. పారదర్శకత, జవాబుదారీ తనం తమ విధానమని ఆయన చెప్పారు.
కాకతీయ స్ఫూర్తితో… మంత్రి వివరణ ఇస్తుండగా కాంగ్రెస్ సభ్యుడు జీ చిన్నారెడ్డి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ అని పేరుపెట్టారని, దక్షిణ తెలంగాణవారిపైన ఉత్తర తెలంగాణ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నదని చెప్పడానికి ఈ పేరు ఒక ఉదాహరణని అన్నారు. ఈ పేరు మార్చాలని ఆయన కోరారు. మంత్రి వెంటనే స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వ లోగోలోనే కాకతీయుల విజయ తోరణం ఉందని గుర్తు చేశారు. కాకతీయుల అభివృద్ధి నమూనాను, ప్రజలకోసం కాకతీయులు తవ్వించిన చెరువుల స్ఫూర్తిని ఆలంబనంగా తీసుకొని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడమే ఇందులో ఉద్దేశమని వివరించారు.
టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ చెరువుకు రూ.50లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నదని, దానికి బదులుగా చెరువుల స్థాయిని అనుసరించి వ్యయ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. బీజేపీపక్ష నాయకుడు కే లక్ష్మణ్ చెరువుల పునరుద్ధరణపైన భాగస్వాములవుతున్న అధికారులందరికీ డెహ్రాడూన్‌లో శిక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు.