-కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టర్ల జేబుల్లోకి వరదలా నిధులు -సర్కారు ఆదరణను ఓర్వని ప్రతిపక్షాలు: మంత్రి హరీశ్‌రావు -అభివృద్ధిలో గుజరాత్ తర్వాత తెలంగాణే: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

కాంగ్రెస్ హయంలో కాంట్రాక్టర్ జేబుల్లోకి చెరువుల నిధులు వరదల్లా వెళ్లాయి. కాంగ్రెస్, టీడీపీ హయాంలో పంచుకొనుడు, దంచుకొనుడే. అలాంటివి మాకు తెలియవు. మిషన్ కాకతీయ పనులు పారదర్శకంగా చేపడుతున్నాం. జవాబుదారీతనంగా పనిచేయడమే మాకు తెలుసు. ప్రతిపక్షాలు ప్రతివిషయంలో రాద్ధాంతం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. గురువారం మెదక్‌లోని సాయిబాలాజీ గార్డెన్లో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష ఎన్నికకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలకుడిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ ప్రథకాలు ప్రజల మన్ననలు పొందడంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పసలేని ఆరోపణలు చేస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టంచేశారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే గుజరాత్ తర్వాత తెలంగాణ అభివృద్ధి వైపు పయనిస్తుందని, సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక వల్లే సాధ్యమైందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా నర్సాపూర్‌కు చెందిన జెడ్పీ చైర్పర్సన్ రాజమణి భర్త మురళీయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి సామెల్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాములునాయక్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్, గూడెం మహిపాల్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.