-జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లదే బాధ్యత -పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగాలని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ద్వారా ఇండ్లు పొందినవారికి మరోసారి ఇల్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో పేదల కోసం కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై గురువారం గృహనిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇండ్ల నిర్మాణం పూర్తవుతున్నందున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీకి చెందిన పేదలకోసం ఇతర జిల్లాల్లో నిర్మిస్తున్న ఇండ్లలో 10%, లేక 1000 ఇండ్లకు మించకుండా స్థానికులకు కేటాయించాలని తెలిపారు. డబుల్ ఇండ్లు నిర్మిస్తున్న కాలనీల్లో గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటినుంచే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు. త్వరలో గృహనిర్మాణ శాఖ అధికారులతో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. సమీక్షలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.