
-దారులన్నీ సీఎం సభా ప్రాంగణం వైపే -ఎండను సైతం లెక్కచేయకుండా సభలకు తరలివచ్చిన జనం -కేసీఆర్ మాట్లాడుతుండగా ఈలలు, కేరింతలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాకతో ఉమ్మడి పాలమూరు జిల్లా పరవశించిపోయింది. ఆదివారం మహబూబ్‌నగర్, వనపర్తిలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగసభలు విజయవంతమయ్యాయి. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. సుమారు రెండున్నర లక్షలకుపైగా ప్రజలు, కార్యకర్తలు తరలిరావడంతో సభాప్రాంగణం ఏర్పాటుచేసిన భూత్పూరు మండలం అమిస్తాపూర్ పరిసరాలు గులాబీమయమయ్యాయి. సుమారు 100 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సీఎం సభ పరిసరాలన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుకోవడానికి సుమారు 2 గంటల ముందునుంచే జనం క్యూ కట్టారు. సభా ప్రాంగణాన్ని ఏర్పాటుచేసిన అమిస్తాపూర్ వద్ద పార్కింగ్ కోసం విశాలమైన స్థలం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు జనం ఈలలు, చప్పట్లు, కేరింతలు కొట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గురించి మాట్లాడుతున్న సమయంలో ఎక్కడాలేని ఉత్సాహం కనిపించింది. ఇనుపడబ్బాలో గులకరాళ్లు వేసి లొడిపినట్టు గాయి గాయి చేసి ప్రసంగించారని మోదీ తీరును సీఎం ఎద్దేవా చేశారు.
సీఎం రాకతో చల్లబడిన సూర్యుడు.. పాలమూరులో పది రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భానుడు తన ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. అయితే, సీఎం కేసీఆర్ పాలమూరు పరిసరాల్లోకి చేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా భానుడు చల్లబడ్డాడు. సీఎం ప్రసంగం వినేందుకు ఎండను సైతం లేక్కచేయకుండా వచ్చిన జనానికి.. వాతావరణం చల్లబడటం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. సాయంత్రం 6:30 నిమిషాల తర్వాత సీఎం హెలికాప్టర్లో అమిస్తాపూర్ చేరుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గురించి సీఎం చెప్తుండగా.. జనం ఆసక్తిగా విన్నారు. కల్మషంలేని మన్నె శ్రీనివాస్‌రెడ్డిని తానే రాజకీయాల్లోకి ఆహ్వానించానని.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పార్టీని గెలిపించిన విధంగానే మన్నెను గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు.
తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్రం -దేశంలో కాంగ్రెస్, బీజేపీ హవా లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి -కేంద్రంలో కీలకం కానున్న ఫెడరల్ ఫ్రంట్: ఎంపీ అభ్యర్థి పీ రాములు
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రస్తుత ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని తెలిపారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరంలో నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ స్థాయి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభ జరిగింది. సీఎం కేసీఆర్ హాజరైన ఈ సభ లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన ఏ ఒక్క అంశాన్నీ మోదీ ప్రభుత్వం అమలుచేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు కానీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయహోదా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీల కం కాబోతున్నాయని, 16 ఎంపీ స్థానాలను గెలువడం ద్వారా కేం ద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారన్నారు. కేసీఆర్ పాదం మోపిన తర్వాతే ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడిందన్నారు. నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పీ రాములు మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా కానున్నదని, కేసీఆర్ ప్రధాన భూ మిక పోషించనున్నారని చెప్పారు. ఎంపీగా గెలిస్తే రైల్వే లైన్లతోపాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు కృషిచేస్తానన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, జెడ్పీ చైర్మన్లు బండారి భాస్కర్, తుల ఉమ, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, అబ్రహం, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రధాని అయితేనే పురోగతి -సీఎం సభలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ ప్రధాని అయితేనే అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అమిస్తాపూర్ వద్ద జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల బహిరంగసభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మూడేండ్ల కిందట ఇక్కడే సీఎం కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగమైన కర్వెన రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఈ మూడేండ్లలో కర్వెన ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. అయితే ప్రజాసంక్షేమం పట్టని కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టు పనులను అడ్డుకొంటూ వస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే ఆ ప్రాంతం అంత సస్యశామలం అవుతుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 70 ఏండ్లు పాలించినా పాలమూరు నుంచి వలస పోయిన 14 లక్షల మంది గోసను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సభకు జిల్లా నలుమూలాల నుంచి రెండున్నర లక్షల మంది జనం రావడం శుభపరిణామమన్నారు. భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు.