-ఆర్‌అండ్‌డీకి ప్రాధాన్యం పెరుగాలి -హైదరాబాద్‌లో 50 సంస్థలతో రిచ్ -టీవర్క్స్, రిచ్లతో భాగస్వాములుకండి -మంత్రి కే తారకరామారావు పిలుపు -దావోస్‌లో కేటీఆర్‌కు అపూర్వ గౌరవం -దేశాధినేతలు పాల్గొన్న సదస్సులో ఏకైక రాష్ట్రమంత్రి -డిజిటల్ టు డెలివర్ వాల్యూ టు సొసైటీ అంశంపై ప్రసంగం -రాష్ట్రంలో సోలార్‌ప్లాంట్ ఏర్పాటుకు సుజ్లాన్ ఆసక్తి
దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో మంత్రి కేటీఆర్‌కు అపూర్వమైన గౌరవం దక్కింది. శుక్రవారం పలు దేశాల ఉప ప్రధానులు, ఆయా దేశాల మంత్రులు పాల్గొన్న లివరేజింగ్ డిజిటల్ టు డెలివర్వాల్యూ టు సొసైటీ అనే సెషన్లో.. మంత్రి కేటీఆర్ ఒక్కరికే రాష్ట్రమంత్రిగా పాల్గొనే అవకాశం లభించింది.
పరిశోధనలతోనే ప్రగతి సాధ్యమని, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారమార్గాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. పరిశోధన రంగానికి ప్రాధాన్యం పెరుగాల్సిన అవసరం ఉన్నదని, దీనికోసం పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు మరింత చొరవతీసుకోవాలని ఆయన దావోస్ ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన డెవలపింగ్ ఆర్ అండ్ డీ ఇన్ ఇండియా అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పిలుపునిచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఆసక్తి గల కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికారు. లివరేజింగ్ డిజిటల్ టు డెలివర్వాల్యూ టు సొసైటీ అనే అంశంపై జరిగిన సెషన్లోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సెషన్‌కు వివిధ దేశాల ఉప ప్రధానులు, ఆయా దేశాల కేంద్ర మంత్రులు తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించగా, కేటీఆర్ ఒక్కరే రాష్ట్ర మంత్రిగా పాల్గొనే అపూర్వ గౌరవాన్ని పొందారు. ప్రైవేట్‌రంగంలో పెద్ద సంస్థలు చేస్తున్న పరిశోధనలతో దేశంలోని అకడమిక్ రిసెర్చ్‌ని సమ్మిళితం చేసినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయని డెవలపింగ్ ఆర్అండ్డీ ఇన్ ఇండియా అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పేర్కొన్నారు. పరిశోధన కార్యక్రమాలతోపాటు పరిశోధనానంతర ఫలితాల ఆధారంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలుండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిలికాన్‌వ్యాలీలో గొప్ప విజయాలకు కారణం అక్కడి పరిశోధన సంస్థలేనని చెప్పారు.
హైదరాబాద్‌లో 50 పరిశోధన సంస్థలను అనుసంధానం చేస్తూ.. రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ వివరించారు. రిసెర్చ్ ఫలితాలు మార్కెట్లోకి రావడానికి రిచ్ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఇస్రోలాంటి భారతీయ సంస్థలు తమ పరిశోధన పటిమను, సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటాయని, అతి తక్కువ ఖర్చుతో ఫలితాలు సాధించవచ్చని ఇస్రో విజయాలు నిరూపిస్తున్నాయని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద కంపెనీల నుంచి కాకుండా స్టార్ట్‌ప్‌ల నుంచే వస్తాయని, అందుకే తెలంగాణ ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. తాము త్వరలోనే పరిశోధన చేయనున్న టీవర్స్క్, రిచ్లతో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని కోరారు. టీవర్క్స్ ద్వారా హార్డ్‌వేర్ రంగంలోనూ పరిశోధనలకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలా ప్రదర్శనశాలలు ఏర్పాటుచేయాలని సూచించారు. పరిశోధన ఫలితాలు, పేటెంట్లు, మేధోసంపత్తిని కాపాడేందుకు తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టీఐపీసీయూ)ను ఏర్పాటుచేశామని చెప్పారు. టీఐపీసీయూ మాదిరిగానే ప్రతి రాష్ట్రం ఈ నమూనాను ఏర్పాటుచేయాలని రాష్ట్రాలకు ఉత్తరాలు రాశామని వెల్లడించారు. తెలంగాణ ఇలాంటి విప్లవాత్మక ఆలోచనలతో అనేకరంగాల్లో ఆదర్శంగా ఉన్నదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) కార్యదర్శి రమేశ్‌అభిషేక్ అభినందనలు తెలిపారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ప్రభుతో సమావేశమయ్యారు.
సోలార్‌ప్లాంట్ ఏర్పాటుకు సుజ్లాన్ ఆసక్తి ప్రముఖ పవన విద్యుత్ సంస్థ సుజ్లాన్ చైర్మన్ తులసి తంతితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సోలార్ విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ ముందువరుసలో ఉన్నదని మంత్రి వివరించారు. పవన విద్యుత్‌రంగంలో మరిన్ని పరిశోధనలు జరుగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సోలార్రంగంలో విద్యుత్ స్టోరేజీ సౌకర్యం మరింతగా అందుబాటులోకొస్తే ఈ రంగం మరింత ముందుకు పోతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పవన విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు సుజ్లాన్ ఆసక్తిగా ఉన్నట్టు తులసి తంతి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలతో రానున్న సంవత్సరాల్లో కచ్చితంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విద్యుత్ ఉత్పాదన పెరుగాల్సిన అవసరం ఉన్నదని మంత్రికి తెలిపారు.
సెల్స్‌ఫోర్స్ సీఈవోతో లంచ్ సెల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్బేనియఫ్ మంత్రి కేటీఆర్‌కు దావోస్‌లో ప్రత్యేక లంచ్ ఏర్పాటుచేశారు. అనంతరం తెలంగాణ లాంజ్‌లో సెల్స్‌ఫోర్స్ సంస్థ ప్రెసిడెంట్ అమీవీవర్తో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సానుకూలత వ్యక్తంచేసినట్టు సమాచారం. ఎరిక్సన్ గ్రూప్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఎరిక్ఎక్యుడెన్తో కూడా మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎలక్ట్రానిక్స్ తయారీరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
కేటీఆర్‌కు అపూర్వ గౌరవం దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో మంత్రి కేటీఆర్‌కు అపూర్వమైన గౌరవం దక్కిం ది. శుక్రవారం పలుదేశాల ఉప ప్రధానులు, ఆయా దేశాల మంత్రులు పాల్గొన్న లివరేజింగ్ డిజిటల్ టు డెలివర్వాల్యూ టు సొసైటీ అనే సెషన్లో.. మంత్రి కేటీఆర్ ఒక్కరికే రాష్ట్రమంత్రిగా పాల్గొనే అవకాశం దక్కిం ది. బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, పోర్చుగల్, మయన్మార్, ఇండోనేషియా, నైజీరియా, లెబనాన్, బంగ్లాదేశ్, ఖతర్, పాకిస్తాన్ మంత్రులు సమావేశంలో పాల్గొన్నా రు. ఈ సెషన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ తెలంగాణ, మిషన్ భగీరథతోపాటు ఇంటింటికీ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని, ప్రభుత్వ సేవలన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా అందజేస్తున్నామని చెప్పారు.
దావోస్‌లో గణతంత్ర దినోత్సవం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న భారతీయ ప్రతినిధులు దావోస్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇన్వెస్ట్ ఇండియా లాంజ్ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో జాతీయపతాకాన్ని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. విభిన్నమైన ఆలోచనలు, పలు రాష్ట్రాలకు చెందిన నేతలమైనా భారతీయులందరం కలిసి గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారతీయుడిగా గర్వపడుతున్నానని తెలిపారు.