Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పారిశ్రామిక పాలసీకి ఓకే

రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించినవి ఇవీ! 3 కార్పొరేషన్లు.. -తెలంగాణ వాటర్ గ్రిడ్ డెవలప్‌మెంట్ -తెలంగాణ గ్రామీణ రహదారుల అభివృద్ధి -తెలంగాణ పట్టణ రహదారుల అభివృద్ధి

ఇవీ నిర్ణయాలు.. -హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్లు -నూతన ఇసుక కేటాయింపు విధానం -తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు -33 కార్పొరేషన్లకు పేర్లు మార్పు -ఇంటర్మీడియట్ బోర్డు విభజన 4 బిల్లులు.. -ద్రవ్య వినిమయం -మహిళా భద్రతా, బాలికా సంరక్షణ -మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు 22% రిజర్వేషన్ -సర్పంచ్‌లకు అధికారాల బదలాయింపు

KCR Cabinet Meeting

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆదివారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు, బిల్లులకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన క్యాబినెట్ భేటీ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం అయిదు గంటలకు సచివాలయంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రిమండలి సమావేశం సుమారు మూడు గంటల పాటు సాగింది.

-నూతన విధానానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర! -మంత్రిమండలి మూడు గంటలపాటు సుదీర్ఘ సమావేశం -పలు కీలక బిల్లులు, నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానానికి సమావేశం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. అలాగే మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు, సర్పంచులకు మరిన్ని అధికారాలు బదలాయించే బిల్లు, ఈవ్ టీజర్ల భరతం పట్టేందుకు, మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా భద్రత, బాలికా సంరక్షణ బిల్లులకు సమావేశం పచ్చజెండా ఉపినట్లు సమాచారం. వాటితోపాటు వాటర్ గ్రిడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గ్రామీణ రహదారుల అభివృద్ధి , పట్టణ రహదారుల అభివృద్ధి కోసం రెండు కార్పొరేషన్ల ఏర్పాటు, ఇంటర్మీడియట్ బోర్డు విభజన, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్ల నిధులు, నూతన ఇసుక కేటాయింపు విధానం, 33 కార్పొరేషన్లకు పేర్లు మార్పు తదితర అంశాలను చర్చించి ఆమోదించినట్టు తెలిసింది. క్యాబినెట్ సమావేశంలో మొత్తంగా నాలుగు బిల్లులు, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, రెండు నూతన ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలపై చర్చ జరిగినట్టు చెప్తున్నారు. ఏ రోజు ఏ బిల్లును అసెంబ్లీలో ఆమోదానికి తీసుకురావాలనే విషయంపై చర్చించినట్టు తెలిసింది. రూ.లక్ష కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆదాయ, వ్యయాలకు సంబం ధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో సర్కారు భారీ కసరత్తు చేసి రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపినట్టు తెలిసింది.

ప్రధానంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ విండో ద్వారా అనుమతులతో పాటు నూతన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తూ టీ-పాస్ నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఇందులో పరిశ్రమలకు ప్రధానంగా అవసరమయ్యే 24రకాల అనుమతులను 16కు తగ్గిస్తూ విధివిధానాలు రూపొందించినట్టు తెలిసింది.

మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోని నామినేటెడ్ పోస్టుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రూపొందించిన బిల్లును క్యాబినెట్ ఆమోదించినట్లు సమాచారం.

కార్పొరేషన్ల ఏర్పాటుకు.. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి రక్షిత నల్లానీరు ఇచ్చే లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ నిర్వహణ కోసం ప్రతిపాదించిన తెలంగాణ వాటర్ గ్రిడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. సుమారు రూ.27వేల కోట్లతో చేపట్టిన ఈ గ్రిడ్‌కు రూ.2వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన విషయం తెలిసిందే. ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న నల్లగొండ జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటర్ గ్రిడ్‌కు అక్కడే పునాది వేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైలాన్ నిర్మాణ పనులు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థాన్‌ నారాయణపురంలో చేపట్టారు. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నిధులు కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.10వేల కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ పనులను చేపట్టేందుకుగాను ప్రత్యేకంగా రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ గ్రామీణ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్, తెలంగాణ పట్టణ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో వీటిని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

హుస్సేన్ సాగర్‌కు రూ.100 కోట్లు.. హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింప జేసేలా హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ ప్రతిపాదించినట్టు రూ.100 కోట్ల నిధుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని.. సాగర్‌లోకి మురుగు నీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మురుగునీరు మళ్లింపు కోసం ఈ నిధులను వెచ్చిస్తారు.

పేర్లు మార్పు.. ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు తలపెట్టిన సంస్థకు తెలంగాణ సాంస్కృతిక సారథి అన్న పేరును క్యాబినెట్ అంగీకరించిందని తెలిసింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కళలు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలోని 500మంది కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ.. కళాజాత బృందాలతో ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తెలంగాణ సాంస్కృతిక సారథిగా నామకరణం చేశారు. ఇక రాష్ట్రం విభజన నేపథ్యంలో 89కార్పొరేషన్లు ఉమ్మడిగా ఉండగా.. వాటిలో 33కార్పొరేషన్లకు పేర్లు మార్పునకు నిర్ణయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కార్పొరేషన్ల పేర్లు మార్చి ప్రత్యేక చట్టాలను రూపొందించేందుకు రెండేళ్ల వ్యవధి పట్టనుంది. అలాగే ఇంటర్ బోర్డు విభజనకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అధికారుల సమాచారం.

రాజకీయ అంశాలపైనా చర్చ.. రాష్ట్ర మంత్రి మండలి భేటీలో శాసన సభ నిర్వహణ, విపక్షాల తీరుతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఆసరా పథకంపై విస్తృతంగా చర్చ సాగినట్లు తెలిసింది. చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను త్వరగా పిలిచి పనులు చేపట్టాలనే విషయంపై చర్చించారు. అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన, పారదర్శకంగా పనులు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్ర చిహ్నాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు సమస్యపై సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయంలో అనుసరిస్తున్న తీరు, కేంద్రంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ప్రత్యేక చొరవ తీసుకుంటారని సీఎం కేసీఆర్ మంత్రులకు వివరించినట్లు తెలిసింది. సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, డా.తాటికొండ రాజయ్య, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీఏడీ ముఖ్య కార్యదర్శి సునీల్ జోషి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

సర్పంచులకు మరిన్ని అధికారాలు.. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు మరిన్ని అధికారులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్వతంత్ర వ్యవస్థలుగా విలసిల్లాల్సిన స్థానిక సంస్థలు అధికారాలు లేక కునారిల్లుతున్నాయని సీఎం కేసీఆర్ గతంలో అనేక సార్లు ప్రస్తావించారు. ఇందులో భాగంగా సర్పంచిలకు అధికారాల బదలాయింపు బిల్లుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఆఘాయిత్యాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి దురాచారాలకు కళ్లెం వేసేందుకు గత కొంత కాలంగా ప్రత్యేక కమిటీ ద్వారా విస్తృత క్షేత్రస్థాయి చర్చలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం ప్రత్యేకంగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో మంత్రి మండలిలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ నిర్వహించి మహిళా భద్రత, బాలికా సంరక్షణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. 62పేజీలు ఉన్న ముసాయిదా బిల్లులో 22అంశాలు ఉన్నట్లు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.