Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పరిశ్రమల్ని విస్తరిస్తాం

-యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకుంటున్నాం -నియోజకవర్గాల్లో ఆహారశుద్ధి కేంద్రాలు -కోటి ఎకరాల మాగాణం కోసం కేసీఆర్ కృషి -కులవృత్తులకు పూర్వవైభవం: మంత్రి కేటీఆర్ -ప్రతిపక్షాలు చేసిన పాపం ప్రజలు అనుభవిస్తున్నారు: మంత్రి నాయిని -సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో ఐటీఐ భవనం ప్రారంభించిన మంత్రులు

నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించామని, సాధించుకున్న రాష్ట్రంలో ఆ లక్ష్య సాధనకు అహర్నిశలూ శ్రమిస్తున్నామని పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. గ్రామీణ పారిశ్రామీకరణతో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను విస్తరించి, యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలంగాణదేనని స్పష్టంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో రూ.7.74 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ) నూతన భవనాన్ని సోమవారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, రంగారెడ్డి, మేడ్చల్, పటాన్‌చెరువు ప్రాంతాలకే పరిమితమైన పరిశ్రమలను రాష్ట్రమంతా విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరికీ పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఆహారశుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారని గుర్తుచేశారు.

నేటి విద్యార్థుల్లో ఎక్కువ శాతం డాక్టర్లు, ఇంజినీర్లు మాత్రమే అవుతామని, ఇతర వృత్తుల్లోకి వెళ్లబోమని చెప్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థకు, వ్యవసాయరంగానికి పెద్దదిక్కుగా శతాబ్దాల తరబడి ఉన్న కులవృత్తులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా యువతకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఐటీఐలాంటి కళాశాలల ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి కొలువులు లభించేలా కృషిచేస్తున్నామని తెలిపారు. 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు సీఎం చేతుల మీదుగా అపెరల్ పార్కుకు శంకుస్థాపన చేశామన్నారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే వరంగల్‌లో కొత్తగా టెక్స్‌టైల్స్ పార్కు, గద్వాల, పోచంపల్లిలో హ్యాండ్లూం పార్కులను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నదని చెప్పారు.

కోటి ఎకరాల మాగాణం కోసం కేసీఆర్ తపన ఆనాడు దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అంటే.. నేడు సీఎం కేసీఆర్ కోటి రతనాల వీణ మాత్రమేకాదు.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అని చెప్తూ దానిని సాకారం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. గోదావరి జలాలను ఇంటింటికీ అందించాలన్న సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచరికార్డు బద్దలు కొట్టిందని చెప్పారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకుపోతున్న కేసీఆర్‌కు ప్రజలు వెన్నంటి ఉండాలని కోరారు. గత సమైక్య పాలకుల నిర్లక్ష్యంవల్ల పూడికనిండిన 46 వేల చెరువులను మిషన్‌కాకతీయద్వారా పునరుద్ధరించినట్టు చెప్పారు. లక్షా 12వేల ఉద్యోగాల భర్తీకోసం కృషిచేస్తున్నట్టు తెలిపారు. నిరుద్యోగభృతి ఇస్తామంటూ చెప్తున్న ప్రతిపక్షపార్టీలు ఎవరికి ఇస్తారో చెప్పాలంటే నోరెళ్లబెతున్నాయని ఎద్దేవాచేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా అన్నిరంగాలను అభివృద్ధిచేస్తూ, పేదలకోసం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, దమ్మున్న ముఖ్యమంత్రిని చూసి తమకు ప్రజలు ఓటేస్తారో లేదోనన్న అయోమయంలో ప్రతిపక్షాలు ఆపద మొక్కులు మొక్కుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల హామీలు, ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా ప్రజల ఆశీస్సులతో ముందుకు పోతామని స్పష్టంచేశారు.

మరో 15 ఏండ్లు టీఆర్‌ఎస్‌దే అధికారం: నాయిని వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్నామని, కోటి ఎకరాలకు సాగునీరందించే పనులు శరవేగంగా సాగుతున్నాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇంటింటికీ నల్లానీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగనన్న దమ్మున్న మొనగాడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రతిపక్షాలు చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. వారు చేసిన పాపాలను కేసీఆర్ కడిగేస్తూ ప్రజలకు పట్టిన శాపాలను తొలిగిస్తున్నారన్నారు. మరో 15 ఏండ్లదాకా టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని, మళ్లీ సీఎం కేసీఆరేనని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 65 ప్రభుత్వ, 225 ప్రైవేటు ఐటీఐల్లో 40వేలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నట్టు చెప్పారు. రూ.7.74 కోట్లతో ఏర్పాటుచేసిన మండెపల్లి ఐటీఐలో 356 మంది శిక్షణ పొందుతున్నట్టు తెలిపారు. ఐదు సీట్లున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకూడా రాదని సర్వేలే చెప్తుంటే.. ఏకంగా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు కలగంటున్నారని ఎద్దేవాచేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. సమావేశంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.