Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పారిశ్రామికాభివృద్ధి రెండో దశకు శ్రీకారం

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రక్రియలో రెండోదశ ప్రారంభమైంది. వివిధ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల ఎంపిక కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ కార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీధర్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని ఆదివారం ఆమన్‌గల్, ముచ్చర్ల, రాచకొండ పరిసర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ భూముల పరిస్థితి, ఏఏ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం అనే విషయాలపై అధ్యయనం జరిపారు.

-ఇండస్ట్రియల్ పార్కులకు స్థలాల పరిశీలన ప్రారంభం -ఏరియల్ సర్వే నిర్వహించిన ఉన్నతాధికారులు -3న మూడు జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే -ముచ్చర్ల సమీపంలో 2,747 ఎకరాల్లో ఫార్మాసిటీ -రాచకొండలో సినిమా సిటీకి ప్రతిపాదనలు -హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థలాలపై అధ్యయనం -సీఎం హామీలను అమల్లో పెట్టేందుకు కసరతు -నిన్న పాలసీ ప్రకటన, -నేడు పారిశ్రామిక పార్కులకు స్థలాల పరిశీలన

rachakonda-area-surveyపరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఈ పర్యటన వివరాలు వెల్లడిస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల సమీపంలో ఫార్మా, బల్క్ డ్రగ్స్ పరిశ్రమలను నెలకొల్పేందుకుగాను 2747 ఎకరాల ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆమల్‌గల్‌లో కూడా 4 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని చెప్పారు. ఈ భూములపై రేపటిలోగా ఇరు జిల్లాల అధికారులు సమగ్రమైన నివేదికను అందజేయనున్నారని ఆయన వివరించారు. డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కూడా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల, రాచకొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆమల్‌గల్ ప్రాంతాలను స్వయంగా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారని పేర్కొన్నారు.rachakonda-area-survey1

రంగంలోకి సీఎం… రాష్ర్టాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో అత్యంత ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానం ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 24 గంటలు కూడా గడవక ముందే అధికారులను పార్కుల ఎంపికపై సర్వేకోసం పంపించారు. డిసెంబర్ 3న తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. 3వ తేదీన నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని భూములను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. రాజధాని చుట్టు పక్కల అనేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని, అందులో ఫార్మా, ఎడ్యుకేషన్, సినిమా సిటీల వంటివి ఉంటాయని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. వాటితో పాటు ప్లాస్టిక్, ఏరోస్పేస్, మెడికల్ డివైస్ ఉత్పాదక కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పారిశ్రామికవేత్తల సదస్సుల్లో హామీ ఇచ్చారు.

ఇపుడు ఆ హామీలన్నింటికీ కార్యరూపం ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో వ్యవసాయయోగ్యం కాని భూముల వివరాలు ఇప్పటికే సేకరించిన ప్రభుత్వం ఆ భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ) ఆధీనంలోకి తీసుకు రానున్నది. అలాగే పారిశ్రామిక వాడల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ(డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) తదితర శాఖల అధికారులు పలుమార్లు భేటి అయ్యారు. టీఎస్‌ఐఐసీ రూపొందించిన ప్రాథమిక ప్రతిపాదనల్లో సాధ్యాసాధ్యాలను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

ఏరియల్ సర్వే ఏర్పాట్లను ఆదివారం పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్‌లు పరిశీలించారు. సర్వేలో పరిశీలించే ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్డుకు ఎంత దూరంలో ఉన్నాయి? రహదారి, నీటి వసతులపై దృష్టి సారించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

5 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ.. ప్రాథమిక నిర్ణయం ప్రకారం 5 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ముచ్చెర్లను ఎంపిక చేశారు. ఇక్కడ 2700 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్లు సమాచారం. దానికి 1, 2 కి.మీ దూరంలోనే మరో 1200 ఎకరాల వరకు ఉంది. వీటినే ఏరియల్ సర్వే చేయనున్నారు. అలాగే ప్లాస్టిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్‌ను 250 ఎకరాల్లో, ఎడ్యుకేషన్ పార్కును 450 ఎకరాల్లో, మెడికల్ డివైస్ ఉత్పాదక క్లస్టర్‌ను 200 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలున్నాయి.

వీటి ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు, కందుకూరు మండలం తిమ్మాపూర్, మీర్‌ఖాన్‌పేటపై దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతంలో దేవాదాయ శాఖ ఆధీనంలోని 2 వేల ఎకరాల్లోనూ అనుకూలమైన పార్కును ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. గతంలో ఇక్కడ నానో కార్ల ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు స్థానికుల వ్యతిరేకత ఎదురైంది. ఈసారి ప్రజలకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా కల్పించే పార్కును ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అలాగే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రస్తుతం టీఎస్‌ఐఐసీ ఆధీనంలోని స్థలాల్లో ఏయే రంగాలను ఏర్పాటు చేయొచ్చునో అధ్యయనం చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో శంషాబాద్, సైబరాబాద్ జోన్లల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు.

రాచకొండలో సినిమా సిటీ.. తెలంగాణలో సినిమా రంగాన్ని సుస్థిరం చేయడంతో పాటు ప్రపంచపటంలో గుర్తింపు పొందేలా 2 వేల ఎకరాల్లో సినిమాసిటీ ఏర్పాటుచేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. తాజాగా ఆ సినిమాసిటీకి రాచకొండ అనుకూలమైందని అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది. డిసెంబర్ 3న కేసీఆర్ ఏరియల్‌సర్వేలో ఆ ప్రాంతంకూడా ఉంది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మధ్యనున్న రాచకొండ గుట్టలు సినిమా సిటీకి చాలా అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ భూముల పరిస్థితిపై టీఎస్‌ఐఐసీ ఇప్పటికే నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులును వివరాలు అడిగింది.

ఆ ప్రాంతంలోని కొంత భూమిని డిఫెన్స్ ఫైరింగ్‌కు కేటాయించారు. ఆ కేటాయింపును స్థానిక రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నేత దశాబ్ద కాలం క్రితం వేలాది ఎకరాలు కొనుగోలు చేశారన్న ప్రచారం జరిగింది. అయితే సినిమా సిటీ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలమని నిర్ధారణకు వస్తే ఆ భూములను సేకరించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ ఎకరాకు ప్రభుత్వ ధర రూ.50 వేల నుంచి రూ.లక్షకు మించనందున సేకరణ తేలికేనని అంటున్నారు.

రెండో దశ ప్రారంభమైంది పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మొదటి దశలో సమగ్ర అధ్యయనం చేసి ఆకర్షణీయమైన పారిశ్రామిక చట్టాన్ని తయారు చేశాం. అతిపెద్ద ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇపుడు రెండోదశకు ఈ నెల 3న సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. రెవెన్యూ, పరిశ్రమల శాఖలు గుర్తించిన స్థలాల్లో ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? ఎక్కడ ఏ పార్కులను ఏర్పాటు చేయాలి? అనే అంశాలపై అధ్యయనం కోసమే ఏరియల్ సర్వేను చేపడుతున్నాం. సీఎం కేసీఆర్‌తో కలిసి రాచకొండ గుట్టలు, ముచ్చెర్ల ప్రాంతాలను వీక్షిస్తున్నాం. వివిధ ప్రతిపాదనలు పరిశీలించి సీఎం నిర్ణయం తీసుకున్నాక ఏయే ప్రాంతాల్లో ఏఏ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామో వెల్లడిస్తాం.

– కే ప్రదీప్‌చంద్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.