Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పారిశ్రామికంగా అపూర్వ ప్రగతి

-హైదరాబాద్‌లో దిగ్గజ కంపెనీల కార్యాలయాలు
-కేసీఆర్ పాలనలో హరిత, శ్వేత, నీలి, గులాబీ విప్లవాలు
-అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా
-శాసనసభలో మంత్రి కేటీఆర్
-కాంగ్రెస్ విమర్శలను నిశితంగా తిప్పికొట్టిన మంత్రి

Minister KTR Speech In Telangana Assembly

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పారిశ్రామికరంగంలో అనూహ్యమైన అభివృద్ధిని తెలంగాణ సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటుచేసుకున్నాయని తెలిపారు. నేచురల్‌గ్రోత్ అంటూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని చూసేందుకు కాంగ్రెస్‌నేత భట్టి విక్రమార్క నిరాకరిస్తున్నారని విమర్శించారు. ఐటీరంగంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాన్ని ఐటీప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గుర్తించారని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నదని, 2014 నుంచి ఇప్పటివరకు 59 పారిశ్రామికపార్కులు ఏర్పాటుచేసిందని చె ప్పారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ కాంగ్రెస్ నాయకుల విమర్శలను తిప్పికొట్టారు. ఏమీ జరుగలేదని కాంగ్రెస్ అంటున్నదని, సులభ వాణిజ్యవిధానంలో తె లంగాణకు మొదటిర్యాంకు వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. మీరు ఇటుకలతో కొడితే మేం రాళ్లతో కొట్టగలం అని రిటార్టిచ్చారు.

10,993 పరిశ్రమలకు అనుమతి
రాష్ట్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక సంఘాలతో కలిసి ఏమిచేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందో సీఎం కేసీఆర్ ఏడుగంటలపాటు చర్చించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ చర్చ ల ప్రతిపాదనలతోనే టీఎస్‌ఐపాస్ తెచ్చామన్నా రు. దీనికింద ఇప్పటికి 10,993 పరిశ్రమలకు అనుమతులిచ్చామని, రూ.1,69,859 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 12,71,789మందికి, దీనికి రెండున్నరరెట్ల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతున్నదన్నారు. అనుమతి ఇచ్చినవాటిలో 8,294 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని, 701 పరిశ్రమలు అడ్వాన్స్‌స్టేజ్‌లో, 746 ప్రాథమికదశలో ఉన్నాయని, 1252 పరిశ్రమల నిర్మాణం ప్రారంభంకావాల్సి ఉన్నదని తెలిపా రు. 24గంటల విద్యుత్‌సరఫరా, శాంతిభద్రతలు, టీఎస్‌ఐపాస్‌తో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారని తెలిపారు.

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ టాప్
తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని అప్పట్లో కాంగ్రెస్ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కట్టె పట్టుకొని చూపించారని, నక్సల్స్ వస్తారని, పరిపాలన రాదని, పరిశ్రమలురావని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదన్నా రు. మినిమం ఇన్‌స్పెక్షన్- మాగ్జిమం ఫెసిలిటీస్ నినాదంతో 372 సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రక్షణకు పారిశ్రామిక హెల్త్‌క్లినిక్స్ తీసుకువచ్చి, వందల పరిశ్రమలకు అండగా నిలిచామన్నారు. టీ ఐడియా, టీ ప్రైడ్ ద్వారా ఎస్సీలకు 15.44%, ఎస్టీలకు 9.43% పారిశ్రామిక పార్కుల్లో రిజర్వ్‌చేశామని చెప్పారు.

ఐదేండ్లలో నాలుగు విప్లవాలు
ఈ ఐదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో హరితవిప్లవం, నీలివిప్లవం, గులాబీవిప్లవం (మీట్ ప్రాసెసింగ్), శ్వేతవిప్లవం వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆహార ఉత్పత్తుల పరిశ్రమలను తీసుకువస్తున్నామని, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పరిశ్రమలు వచ్చాయని చెప్పారు.

ఆనాడు కందిళ్లతో నిరసనలు
గతం గొప్పగా ఉండేదని, ఇప్పుడేదో అధ్వాన్నమైందన్న తీరుగా కాంగ్రెస్ సభ్యులు హేళనగా మాట్లాడారన్న మంత్రి కేటీఆర్.. గతంలో వాళ్ల ప్రభుత్వమే ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నదని చురకలంటించారు. 2014కు ముందు ప్రతిపక్షాలు అసెంబ్లీకి కందిళ్లు తీసుకువచ్చి నిరసన తెలిపేవని, కరెంట్ లేక రైతుల, గృహిణులు ఇబ్బందిపడ్డారని, రైతులు సబ్‌స్టేషన్లపై దాడులుచేశారని గుర్తుచేశారు. పారిశ్రామికవేత్తలు సైతం ఇందిరాపార్క్ వద్ద ధర్నాచేసిందీ, పరిశ్రమలకు పవర్‌హాలిడేలు ఇవ్వడంతో కార్మికులు ఉపాధి కోల్పోయిందీ కాంగ్రెస్ హయాంలోనేనని చెప్పారు. అరవైఏండ్లుగా పరిష్కరించలేని విద్యు త్ సమస్యను ఆరునెలల్లో పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తున్నాం
తాము మంచిచేస్తే కాంగ్రెస్ సభ్యులు నేచురల్ గ్రోత్ అనటంపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బిల్ట్ మూతపడితే రూ.322 కోట్లు ఇచ్చి తెరిపించే ప్రయత్నం చేశామని, సిర్పూర్ పేపర్‌మిల్లును, నల్లగొండలో సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించామమని, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్‌ను రివైవల్ చేశామని చెప్పారు. దసరాకు బిల్ట్ కార్మికులకు జీతాలిప్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

ఐదేండ్లలోనే 59 పారిశ్రామిక పార్కులు
పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఒక్క పారిశ్రామికపార్కును తీసుకురాలేదని, కానీ.. 2014 నుంచి ఐదేండ్ల స్వల్పకాలంలో 59 పారిశ్రామికపార్కులు ఏర్పాటుచేసి, 49 వేల ఎకరాలు సేకరిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌రంగంలో జినోమ్‌వ్యాలీని చంద్రబాబు ప్రారంభిస్తే తెలంగాణ వచ్చాక విస్తృతం చేశామని తెలిపారు. 75% మెడికల్ డివైజెస్ ఇక్కడే ఉత్పత్తి అయ్యేలా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్‌పార్క్‌ను ప్రారంభించామన్నారు. రూ.250 కోట్లతో సహజనాథ్ సంస్థ స్టంట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పిందన్నారు. సౌత్ హైదరాబాద్‌కు నిమ్జ్ వచ్చిందని చెప్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలిన పనిని తాము పూర్తిచేస్తున్నామని చెప్పారు. అప్పట్లో నిమ్జ్‌కు కేంద్రం మూడుకోట్లు ఇస్తే ఇప్పుడు తాము మూడు వేల కోట్లు సేకరించామని తెలిపారు. చిన్నతరహా పరిశ్రమల్లో 12 వేలమందికి నేరుగా ఉద్యోగాలు లభించాయని చెప్పారు. మిర్యాలగూడలో ఆటోనగర్ ఏర్పాటుకు స్థలం చూశామని తెలిపారు.

కాళేశ్వరం మాటెత్తితే కాంగ్రెస్‌కు కడుపు మంట
కాళేశ్వరం నీళ్ల గురించి మాట్లాడితే కాంగ్రెస్‌కు కడుపు మండుతున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. రైతుల గురించి, నీళ్ల గురించి మాట్లాడితే వారికి నచ్చదన్నారు. నా తెలంగాణ కోటి రతనాల సీమ అని దాశరథి చెప్తే.. దానిని కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల ద్వారా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కోటి ఎకరాల మాగాణం చేస్తామన్నారు.

ఓఆర్‌ఆర్ వెలుపలికి కాలుష్యకారక కంపెనీలు
హైదరాబాద్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌రోడ్డు అవతలికి తరలించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి వదిలేసిందని, ఓఆర్‌ఆర్ బయట కనీసవసతులు కూడా కల్పించలేదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించి, వాటిని తరలించడానికి ఓఆర్‌ఆర్ బయట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్కడి ప్రజలు కాలుష్యంబారిన పడకుండా ట్రీట్‌మెంట్లు ప్లాంట్లుసైతం నెలకొల్పుతున్నట్టు చెప్పారు. డిఫెన్స్ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నందున డిఫెన్స్ కారిడార్‌లో నగరాన్ని చేర్చమంటే కేంద్రం చేర్చలేదని, అయినా రెండు ఏరోస్పేస్ పార్కులను ఏర్పాటుచేశామని తెలిపారు. దండు మల్కాపుర్‌లో పరిశ్రమల విస్తరణ కొనసాగిస్తామని కేటీఆర్ చెప్పారు. అందుకోసం అందరి సహకారం కావాలని కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి అన్నారు. చౌటుప్పల్‌లో ఫార్మాకంపెనీల వల్ల వస్తున్న వాయుకాలుష్యాన్ని నియంత్రించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని మైనింగ్, ఇసుక నుంచి గత పాలకుల కంటే ఆదాయాన్ని పెంచామని తెలిపారు. గత పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలే చూశామని, ఇప్పుడు ప్రతి చేనేత కార్మికుడికి నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల ఆదాయంవచ్చేలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని చెప్పారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పుడు మాట్లాడలేదేం?
టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికలను ప్రస్తావిస్తూ.. గతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రెండురోజులక్రితం కూడా రాజస్థాన్‌లో బీఎస్పీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పార్టీలో చేరుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సభలో పరస్పరం గౌరవించుకుందామని, ఒకరిని ఒకరు దూషించుకోవడం మానుకుని, స్పీకర్ మర్యాద, సభామర్యాద కాపాడుకుందామని కాంగ్రెస్ సభ్యులకు కేటీఆర్ హితవు పలికారు.

ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్‌యూనిట్ ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బాల్క సుమన్, భాస్కర్‌రావు తదితరులు నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, కారం, మిర్యాలగూడలో బియ్యం, బత్తాయి, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయాలని అడిగారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఆహారశుద్ధి పరిశ్రమను మూ డు దశల్లో ప్రోత్సహిస్తున్నామని, క్యాబినెట్ ఆమోదించాక నాలుగేండ్లలో దశలవారీగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రూ.50 కోట్లతో మిర్చికి సంబంధించిన ఆహార శుద్ధి పరిశ్రమ వస్తున్నదని వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.