Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పరిశుభ్రత.. పరిశోధన.. పచ్చదనం

-స్వచ్ఛ హైదరాబాద్ రూపురేఖలు వెల్లడించిన సీఎం -ఇక ప్రతి నెలా ఒక రోజు స్వచ్ఛ హైదరాబాద్ -పరిశుభ్రతతోపాటు మౌలిక సౌకర్యాల లోటుపాట్లపై నివేదికల రూపకల్పన -నగర ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ -పూర్తిగా సహకరిస్తామన్న దత్తాత్రేయ – 425 యూనిట్లు, బస్తీల్లోకి ఆరువేల మంది చేంజ్ ఏజెంట్స్ -తక్షణమే చిన్నచిన్న పనుల పూర్తి, పెద్ద పనులపై 26న భేటీ

KCR meet on Swacch hyderabad 01

ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 16న హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం కేవలం నాలుగు రోజులకే పరిమితం కాదని, ప్రతి నెలలో ఒక రోజు కొనసాగుతుందని చెప్పారు. పరిశుభ్రత కార్యక్రమాలతోపాటు బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలపై పూర్తిస్థాయి నివేదికలు రూపొందించాలని సీఎం మార్గదర్శనం చేశారు. అంతర్జాతీయ స్థాయి నగరమైన హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు స్వచ్ఛభారత్‌లో భాగంగా హరితహారం కార్యక్రమం తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలో గురువారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై నగర ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 నుంచి 20వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన వినతులు, దృష్టికి వచ్చిన సమస్యలపై ఈ నెల 26న మరోసారి నగర ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

ప్రతి నెలా ఒక రోజు స్వచ్ఛ హైదరాబాద్.. స్వచ్ఛ హైదరాబాద్ కేవలం నాలుగు రోజులకే పరిమితం చేయకుండా ప్రతినెలా ఒక రోజు ఈ కార్యక్రమానికి కేటాయిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంకోసం హైదరాబాద్‌ను 400 విభాగాలుగా విభజించాలని ముందుగా అనుకున్నామని అయితే ఇందులో పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి 17 భాగాలు, కంటోన్మెంట్ పరిధిలోని 8 భాగాలను కూడా అదనంగా చేర్చి 425 భాగాలుగా చేసినట్టు సీఎం వెల్లడించారు. ఈ నెల 16న హెచ్‌ఐసీసీలో ప్రారంభ కార్యక్రమం పూర్తికాగానే అధికారుల బృందం తమకు కేటాయించిన భాగానికి వెళుతుందని, 20వ తేదీ వరకు అదే ప్రాంతంలో కలియతిరిగి చెత్తను ఏరివేయడం, శిథిలాలను తొలగించడం, బస్తీని పరిశుభ్రంగా మార్చడం లాంటి పనులను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తుందని చెప్పారు. ప్రతి బృందానికి ఒక సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి ప్రేరకుడిగా పనిచేస్తారన్నారు. ఈ బృందంలో 15 మంది సభ్యులు చేంజ్ ఏజెంట్స్‌గా ఉంటారన్నారు. ఇలా మొత్తం ఆరువేల మంది బస్తీలలో తిరిగి ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పోలీసులు, ఆర్మీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నదని సీఎం వెల్లడించారు.

బస్తీలవారీగా సమస్యలపై నివేదికలు.. బస్తీల్లోకి వెళుతున్న బృందాలు కేవలం చెత్త ఏరివేతకే పరిమితం కాకుండా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలించి నివేదిక తయారుచేయాలని కేసీఆర్ ఆదేశించారు. విద్యుత్, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, కూరగాయల మార్కెట్లు, శ్మశానవాటికలు, పార్కుల వంటి మౌలిక సదుపాయాల పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరు, ఆయా బస్తీల్లో ఇండ్లు లేని పేదల వివరాలు, తక్షణం అక్కడ ఎలాంటి

పనులు చేపట్టాలనే విషయాలపై సమాచారం సేకరించాలని సీఎం సూచించారు. అప్పటికప్పుడు చేయగలిగిన పనులు ఉంటే వెంటనే పూర్తి చేయడానికి బస్తీకి వెళ్లే ప్రతి అధికారికి రూ.50 లక్షల వరకు పనులు చేపట్టే అవకాశం కల్పించామన్నారు. బస్తీల వారిగా సేకరించిన సమాచారాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్రోడీకరించి ఆ సమాచారంతో ఒక బుక్‌లెట్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దాని ఆధారంగా ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలో మొత్తం నగరమంతా ఎలాంటి పనులు చేయాలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చి దిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూలంకుషంగా చర్చించేందుకు నగర ప్రజాప్రతినిధులతో ఈ నెల 26న హెచ్ ఆర్‌డీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సమావేశం నిర్వహిస్తామని సీఎం తెలిపారు.

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో… హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగానే తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తామని కేసీఆర్ చెప్పారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం వ్యాఖ్యానించారు.

సిగ్నల్ ఫ్రీ విధానం అభివృద్ధి.. నగరంలోని రహదారులను అంతర్జాతీయ స్థాయిలో సిగ్నల్ ఫ్రీ విధానంతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరంలో చాలా చోట్ల కూరగాయల మార్కెట్లు, శ్మశాన వాటికలు, పార్కులు, బస్‌బేలు నిర్మిస్తామని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా వచ్చే సమాచారం నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని, దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా మలచాలని అభ్యర్థించారు.

దేశంలో మనమే నంబర్ వన్: కేంద్రమంత్రి దత్తాత్రేయ కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొన్న భారీ కార్యక్రమంగా స్వచ్ఛ హైదరాబాద్ నిలిచిపోతుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. స్వచ్ఛ భారత్‌ను పెద్ద ఎత్తున నిర్వహించే ఖ్యాతి తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందని, ఈ కార్యక్రమం అమలులో మనమే నెంబర్‌వన్‌గా నిలుస్తామని దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఒక్కసారిగా ఇంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు నగర పరిశుభ్రతకు నడుం కట్టడం అపూర్వమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సదుద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరిస్తామని, కేంద్రం నుంచి నిధులు కూడా ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, నగర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, అసదుద్దీన్ ఓవైపీలతో పాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.