Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పరిశ్రమలను తెరవాలి.. కాపాడాలి.. విస్తరించాలి

-త్రిముఖవ్యూహం -రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణ -కళకళలాడనున్న ఖాయిలా పరిశ్రమలు -భీమా సిమెంట్, రామగుండం ఫర్టిలైజర్స్, సీసీఐ, బల్లార్పూర్ ఇండస్ట్రీలను త్వరలో ప్రారంభిస్తాం -ఎస్పీఎం పునఃప్రారంభ సభలో మంత్రి కే తారకరామారావు

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుచేసి పారిశ్రామికరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. రాష్ట్రానికి 60 కొత్త పరిశ్రమలు వచ్చాయని, టీఎస్‌ఐపాస్ ద్వారా లక్షా 23 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో చిరకాలంగా వేలమంది కార్మికులు ఎదురుచూస్తున్న సిర్పూర్‌కాగజ్‌మిల్‌ను మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించారు. ఎనిమిదో నంబర్ మిషన్ దగ్గర జేకే పేపర్‌మిల్ డైరెక్టర్ హర్షపతి సింఘానియాతోపాటు కంపెనీ ప్రతినిధులు, మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్పతో కలిసి ప్రత్యేక పూజలుచేశారు.

ఆ తర్వాత కార్మికులు, వారి కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పరిశ్రమలకు సంబంధించి తాము త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మూతపడ్డవి తెరిపించడం, ఉన్నవి కాపాడుకోవడం, విస్తరించడం అన్న వ్యూహాలతో సాగుతుండటం వల్ల సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. నల్లగొండలో భీమా సిమెంట్, రామగుండంలో ఎరువుల ఫ్యా క్టరీ, ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా లిమిటెడ్ (సీసీఐ), ములుగులోని బల్లార్పూర్ పరిశ్రమలను త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ ప్రారంభానికి కేంద్రమంత్రితో ఇప్పటికే చర్చించామన్నారు. దీని పునర్జీవం కోసం ఏ రకమైన రాయితీలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీని రెండువేల కోట్లతో విస్తరించేందుకు దాని యాజమాన్యం ముందుకు వచ్చిందని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక విధానంతో పారిశ్రామికవేత్తలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రతి నిరుద్యోగికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేదని తెలిపారు. పెట్టుబడులు తీసుకురావడం.. రాయితీల కల్పన ద్వారా పరిశ్రమల స్థాపనకు కృషి ప్రజలకు ఉపాధి కల్పించడం కోసమేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రగతిశీల వాతావరణం ఎక్కడాలేదని చాలామంది పారిశ్రామికవేత్తలు చెప్తున్నారని వెల్లడించారు.

ఎస్పీఎంను తెరిపించడం చాలెంజ్‌గా తీసుకున్నాం సిర్పూర్ పేపర్ మిల్లును ఎలాగైనా తెరిపించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. వేలమంది కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సీరియస్‌గా తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో దానిని సవాలుగా తీసుకుని పనిచేశామని పేర్కొన్నారు. జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గడెం నగేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. ముం బై, కోల్‌కతా, ఢిల్లీ ఇలా అన్ని చోట్లకు వెళ్లి చర్చలు జరిపారని గుర్తుచేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోనప్ప కృషి ఎంతో ఉందన్నారు. ఎస్పీఎంలో మూడు, నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం దీనిని టేకోవర్ చేసిన జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీ సాధారణమైనది కాదని, దేశవ్యాప్తంగా పలు కంపెనీలు, 30 వేల కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న సంస్థ అని వివరించారు. ఏ ఒక్క కార్మికుడికీ అన్యాయం జరుగకుండా దశలవారీగా తీసుకోవాలని యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. మరోవైపు కార్మికులు సైతం యాజమాన్యానికి సహకరించాలన్నారు. ఎస్పీఎం టేకోవర్ చేసిన జేకే గ్రూప్ యాజమాన్యానికి, బ్యాంకర్లకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మీ ఎమ్మెల్యే స్వాతిముత్యం కమలహాసన్ టైపు.. మంత్రి కేటీఆర్ సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను స్వాతిముత్యం సినిమాలో కమల్‌హసన్ టైపంటూ పోల్చడంతో సభలో నవ్వులు విరిశాయి. స్వాతిముత్యంలో కమల్‌హాసన్ ఉద్యోగం కోసం ఒక వ్యక్తి వద్దకు వెళ్తాడు. ఆయన సరే చూద్దాం అంటాడు. అంతే పొద్దున లేచి వాకిట్లో పేపర్ తీసుకున్న దగ్గరి నుంచి పడుకునే వరకు ప్రతి క్షణం ఉద్యోగం కోసం వెంట పడుతాడు. మీ ఎమ్మెల్యే కోనప్ప మా వెంట అలా పడ్డారు అని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఆయన వచ్చాడంటేనే విసుక్కునేటోణ్ణనీ, కానీ పట్టిన పట్టు విడవకుండా సాధించారని ప్రశంసించారు.

ప్రజలే మా బాస్‌లు టీఆర్‌ఎస్ పార్టీకి వేరే అధిష్ఠానమంటూ లేదని, ప్రజలే తమ బాస్‌లని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. వారి దీవెనలే మాకు శ్రీరామ రక్ష.. పేద ప్రజల కోసం 24 గంటలు కష్టపడే ప్రభు త్వం మాది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు ఆలోచిస్తారని వెల్లడించారు. అంతకుముందు కాగజ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద రూ.8.5 కోట్లతో మిషన్ భగీరథ పథకం శిలాఫలకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం నల్లా నీటిని ప్రారంభించి మంచినీరు తాగారు. 480 డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్లకు, కాగజ్‌నగర్ మండలం చింతగూడ వద్ద కోయవాగుపై రూ.4.50 కోట్ల నిర్మించనున్న హైలెవల్ వంతెనకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, నడిపెల్లి దివాకర్‌రావు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ రవీందర్‌రావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.