-అధినేత అడుగుజాడల్లో కేటీఆర్ కార్యాచరణ
-పార్టీ పటిష్ఠత.. సంస్థాగత నిర్మాణంలో కీలక భూమిక.. కార్యకర్తలకు బీమా ధీమా
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్‌కు నేటితో మూడేండ్లు పూర్తి

సమకాలీన రాజకీయాల్లో ఆయనది విలక్షణత. విషయ పరిజ్ఞానంలో ఆయనకు ఆయనే సాటి. వాక్పటిమ, భావ వ్యక్తీకరణలో తండ్రికితగ్గ తనయుడు. ఆయనే టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్టీ సీఎం కేసీఆర్ పూర్తికాలం అధికార కార్యకలాపాల్లో తలమునకలయ్యారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేయటం, అధినేత ఆదేశాలను శ్రేణుల్లోకి తీసుకెళ్లటం కోసం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్‌ను నియమించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించి నేటికి సరిగ్గా మూడేండ్లు.
ఈ ప్రయాణంలో ఒకవైపు పార్టీ బాధ్యతలు, మరోవైపు పాలనలో మంత్రిగా కర్తవ్య నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. సీఎం కేసీఆర్ వ్యూహారచనకు కార్యరూపం ఇవ్వడంలో అనుసరణీయమైన పాత్ర పోషించారు. ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపు కోసం కార్యక్షేత్రంలోకి వెళ్లి ప్రచారం నిర్వహించటం.. గెలుపు బావుటా ఎగురవేయటంలో కీలకభూమిక పోషించారు. రికార్డు స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థల సేకరణ, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించటంలో తనదైన పాత్ర పోషించారు.
అధినేత వ్యూహం, వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యాచరణ
ఇటీవలే పార్టీ ద్విదశాబ్ది మైలురాయిని దిగ్విజయంగా దాటిపోయింది. ఈ ప్రయాణం సుదీర్ఘకాలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాన్ని రచించారు. దీనికి కార్యరూపం ఇవ్వడంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు, అధినేతకు మధ్య బలమైన వారధి నిర్మిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యం ఇవ్వటంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. యువ నేతలతో ఎంత కలివిడిగా ఉంటారో సీనియర్లు, పెద్దనాయకులతో కూడా అంతే సఖ్యతతో మెలగుతారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలకు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకు మధ్య సమన్వయం నెలకొల్పటంతో అనైక్యతకు తావులేకుండా పార్టీ ముందుకు వెళ్తున్నది.
కార్యకర్తల కుటుంబాలకు ఆత్మీయ స్పర్శ
ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు
చేపట్టిన బీమా సొమ్మును జాప్యం లేకుండా చెల్లించేందుకు కేటీఆర్ ఒక ప్రత్యేక
విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఎప్పటికప్పుడు చెక్కుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకొంటున్నారు.
ఆపదలో ఉన్నవారికి అండ
ఆపదలో ఉన్నవాళ్లను సోషల్ మీడియా వేదికగా ఆదుకోవటంలో కేటీఆర్ ట్రెండ్‌సెట్టర్‌గా మారారు. ట్విట్టర్ ద్వారా తమను ఆదుకోవాలని కోరిన వారికి వ్యక్తిగతంగా స్పందిస్తూనే ప్రభుత్వపరంగా కూడా ఆదుకొంటున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ట్విట్టర్‌లో తనను సంప్రదించిన 7,305 మందికి సీఎం రిలీఫ్‌ఫండ్, ఎల్‌వోసీ వంటి సేవలకు రూ.37.82 కోట్ల మొత్తాన్ని చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. పేదరికంలో ఉన్న వందల మంది విద్యార్థులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారు. కరోనా విపత్తు సమయంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, బ్లాక్‌ఫంగస్ నివారణకు మందులను తెప్పించి ఇచ్చారు. తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వందల మందికి.. ట్వీట్ చేసిన వెంటనే స్పందించి సహాయం చేశారు.
స్ఫూర్తిగా జన్మదిన వేడుకలు
తన పుట్టినరోజు సందర్బంగా హంగూ ఆర్భాటాలు చేయకూడదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్.. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సందర్భంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్ పిలుపును అందుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తమ వంతుగా అంబులెన్స్‌లను అందజేశారు. దీంతో కొత్తగా 89 అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు దన్నుగా నిలిచారు. వ్యక్తిగతంగా తానే 130 త్రిచక్ర వాహనాల(మోటార్ సైకిల్స్) ను పంపిణీచేశారు. ఈ స్ఫూరితో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము దివ్యాంగులకు వాహనాలు అందజేస్తామని ముందుకొచ్చారు. కేటీఆర్ ఏం చేసినా వినూత్నంగా, సామాన్యులకు చేరువగా ఉండేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు.
ఈ సంవత్సరం మరణించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు ఆగస్టు 4న తెలంగాణభవన్‌లో పార్టీ తరఫున బీమా చెక్కులు పంపిణీ చేశారు. కుటుంబాల స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు.
‘మీతో గడిపింది కొద్దిక్షణాలే. మీ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న మీ సోదరులు, భర్త, కుమారుడు.. అనూహ్యంగా మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన పార్టీ కుటుంబీకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. మేమందరం మీకున్నం. మనది 60 లక్షల మంది కుటుంబం. మనందరికి పెద్దిదిక్కుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నరు. అందరినీ సీఎం కేసీఆరే ఆదుకుంటరు. నిబ్బరంగా..ధైర్యంగా ఉండాలి. మీకు ఏ సమస్య ఉన్నా పార్టీ చూసుకుంటది’
పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ఆగస్టు 4, 2021, తెలంగాణ భవన్)
మంత్రి కేటీఆర్‌పై ప్రముఖుల ప్రశంసలు
కేటీఆర్ డైనమిక్ మినిస్టర్. గ్రేట్ క్యాటలిస్ట్. ఫెసిలిటేటర్.
అమితాబ్‌కాంత్ , సీఈవో, నీతిఆయోగ్
మంత్రి కేటీఆర్ కృషి తెలంగాణలో ఐటీ విస్తరణకు ఎంతో దోహదపడుతుంది.
-గుర్నాని, చైర్మన్ టెక్ మహీంద్రా
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ ఐటీ పాలసీపై దృష్టిపెట్టాలి. ఐటీ ఫలాలను అందించటంలో కేటీఆర్ ఉదాహరణగా నిలిచారు.
-మాజీ కేంద్రమంత్రి శశిథరూర్
తెలంగాణ కోసం ఎంతో చేస్తున్న మీరు నిజమైన హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది.
సినీనటుడు సోనూసూద్
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ లబ్ధికి వినియోగించటంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.
-డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రాండే
ప్రభుత్వం గత ఆరేండ్లలో తనదైన విధానాలతో..పెట్టుబడుల ఆకర్షణలో పోటీపడుతున్నది. ఇతర రాష్ర్టాలకు పోటీగా రాష్ట్ర ప్రభు త్వం అమలుచేస్తున్న ప్రోత్సాహకాలకు సం బంధించి మంత్రి కేటీఆర్ ప్రసంగం బాగున్నది.
-టెక్స్‌టైల్ పాలసీ మంత్రి కేటీఆర్ ప్రసంగానికి ముగ్ధులైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ఎమర్జింగ్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మంత్రి కేటీఆర్ విజన్ అద్భుతం.
– యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్