-22 నుంచి 24 వరకు నియోజకవర్గాల్లో సమావేశాలు
-ఓటర్ల నమోదు, జాబితా సవరణే ఎజెండా
-ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై ఈసీని కలువాలి
-టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం
-పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
-జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం వేగవంతం
టీఆర్ఎస్ను మరింత పటిష్ఠపర్చడమే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు ఓటర్ గుర్తింపు కార్డులు ఉండి కూడా ఓటు వేయలేకపోయారని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని, ప్రతి నియోజకవర్గంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఓటు నమోదు, ఓటర్ల జాబితా సవరణే ప్రధాన ఎజెండాగా ఈ నెల 22 నుంచి 24 వరకు నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 6 వరకు జరిగే ఓటరు నమోదులో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేటీఆర్‌తో సమావేశ వివరాలను ప్రధాన కార్యదర్శులు నారదాసు లక్ష్మణరావు, శ్రీనివాస్‌రెడ్డి, వీజీ గౌడ్, తుల ఉమ, బస్వరాజు సారయ్య, పీ రాములు, బండి రమేశ్, సత్యవతి రాథోడ్, ఫరీదుద్దీన్ తదితరులతో కలిసి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అనేకచోట్ల ఓట్లు గల్లంతు కావడంతో పార్టీ అభ్యర్థుల మెజార్టీ కొంత తగ్గిందని, ఈసారి ఎన్నికల్లో ఇలాంటి సమస్య రాకుండా ముందుగానే ఈసీని కలిసి పరిష్కరించాలని కేటీఆర్ సూచించారని ఆయన తెలిపారు. పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శులతో కూడిన బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసి చర్చిస్తుందని చెప్పారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృ ష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలో విస్తృ తస్థాయి సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ నిర్ణయించారన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే ఈ సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు హాజరవుతారని, గ్రామ, మం డల, నియోజకవర్గస్థాయిలో ఉండే ము ఖ్యనేతలందరూ ఇందులో పాల్గొంటారని చెప్పారు. సుమారు రెండువేల మం దితో జరిగే ఈ సమావేశాల్లో పేర్లు నమో దు, ఓటర్ల జాబితా సవరణే ప్రధాన ఎజెండాగా ఉంటుందన్నారు. 26 నుం చి జనవరి 6వరకు ఓటరు నమోదులో చురుగ్గా పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారని తెలిపారు. ఓటుహక్కు కోల్పోయిన వారికి తిరిగి కల్పించేలా కృషి చేయాలని, ఈ ప్రక్రియను పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ, వివరాలను ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కు తెలియజేయాలని కేటీఆర్ సూచించారని తెలిపారు.
జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠపరిచే చర్య ల్లో భాగంగా అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. ఇప్పటికే అన్ని జిల్లా ల్లో పార్టీ కార్యాలయాలకు స్థల సేకరణ జరిగిందని, త్వరలోనే భవనాల నమూనాను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆమోదించిన తర్వాత పనులను ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. జనవరి మొదటి వారంనుంచి పార్టీ కార్యాలయ నిర్మాణాలు ప్రారంభం కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.