Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పార్టీలకతీతంగా అభివృద్ధి

-వచ్చే నాలుగేండ్లలో ఎలాంటి ఎన్నికలు లేవు
-బల్దియా.. ఖాయా పీయా చల్దియా కాదని నిరూపిద్దాం
-సీఎం కేసీఆర్‌ గంటలకొద్ది కసరత్తుచేసి కొత్త చట్టాన్ని రూపొందించారు
-పట్టణాల సమగ్ర స్వరూపాన్ని మార్చిచూపిద్దాం
-ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి టీఎస్‌ బీ-పాస్‌ చట్టం
-పాలమూరు పట్టణప్రగతిలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌
-రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పట్టణప్రగతి కార్యక్రమం

‘రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి.. వచ్చే నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవు.. ఇక మా దృష్టంతా అభివృద్ధిపైనే’ అని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. బాగా పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవడమే ప్రధాన ఉద్దేశమని.. తమకెలాంటి రాజకీయ ఉద్దేశాలు, ఆపేక్షలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నిర్వహించిన పట్టణపగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులోభాగంగా పురపాలకశాఖమంత్రి కేటీఆర్‌.. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మహబూబ్‌నగర్‌లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో దళితులు అధికంగా ఉండే పాతతోట ప్రాంతంలో పాదయాత్రచేశారు.

అనంతరం అప్పన్నపల్లిలోని వైట్‌హౌజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మున్సిపల్‌ కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, ప్రత్యేక అధికారులతో ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. మొత్తం 130 మున్సిపాలిటీల్లో 122 చోట్ల టీఆర్‌ఎస్‌ పాలకవర్గాలే ఉన్నాయని.. అయినప్పటికీ పార్టీలకతీతంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధే తమ అజెండా అని స్పష్టంచేశారు. బల్దియా అంటే ఖాయా.. పీయా.. చల్దియా కాదని నిరూపించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంటలకొద్దీ కసరత్తుచేసి కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకొచ్చారని చెప్పారు. కొత్త చట్టం ద్వారా పట్టణాల రూపురేఖలు మార్చేందుకు అవకాశం వచ్చిందని, ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

సమస్యలున్న ప్రాంతాల నుంచే ‘ప్రగతి’
ఎక్కువ సమస్యలుండే ప్రాంతాలను గుర్తించి అక్కడినుంచే పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం సూచించారని.. అందుకే మహబూబ్‌నగర్‌లో దళితులు ఎక్కువగా ఉండే పాతతోటలో పాదయాత్ర చేసినట్టు మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలను గుర్తించానని.. వాటిని ప్రాధాన్యక్రమంలో తీరుస్తామని తెలిపారు. ప్రభుత్వం పేదలకోసం ఏం చేస్తున్నదో వివరించానని.. ఇంటింటికీ శుద్ధజలం అందించడం, పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు తదితర అంశాల్లో వారు సంతోషంగా ఉన్నారన్నారు. ఒక్క పాతతోటలోనే 90 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఇచ్చినట్టు వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌లో గతంలో 14 రోజులకోసారి తాగునీరు సరఫరా అయ్యేదని.. తెలంగాణ ప్రభుత్వం వచ్చా క ప్రస్తుతం నిత్యం శుద్ధమైన జలం అందిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ప్రవేశపెట్టిన పరిచయం కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందితో ప్రజలకు నేరుగా పరిచయమయ్యేలా చూశామన్నారు. ప్రజలు, సిబ్బంది మధ్య చక్కని సంబంధాలు ఉండటం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ మరింతగా విజయవంతమైందని చెప్పారు. రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కృషిచేస్తామని చెప్పారు. సిరిసిల్లలో చెత్త ద్వారా విద్యుత్‌, ఎరువులను తయారుచేస్తూ నెలకు రూ.3 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారని.. అంతకంటే పెద్దదైన మహబూబ్‌నగర్‌లో తడిచెత్త ద్వారా ఎరువులు, పొడిచెత్త ద్వారా విద్యుత్‌ తయారుచేసేందుకు అవకాశం ఉన్నదని చెప్పారు.

ఇండోర్‌ నగరాన్ని తలదన్నేలా..
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పేరున్నదని, ఆ నగరంనుంచి స్ఫూర్తిపొంది మన పట్టణాలను తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. గతంలో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ను ఇండోర్‌లా తీర్చిదిద్దాలని సూచించారు. ఇక్కడ తక్కువ చెట్లున్నాయని.. మొక్కలునాటి సంరక్షించాలని చెప్పారు. మున్సిపాలిటీ బడ్జెట్‌లో 10శాతం పచ్చదనానికే కేటాయించాలని, 85 శాతం మొక్కలు బతకకుంటే కౌన్సిలర్ల పోస్టు పోతుందని హెచ్చరించారు.

ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌ బీపాస్‌ చట్టం
ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభించే టీఎస్‌ బీపాస్‌ చట్టం ద్వారా ఇంటి అనుమతుల కోసం మున్సిపాలిటీ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 75 గజాల్లోపు స్థలంలో ఇంటి నిర్మాణానికి ఒక్క రూపాయి ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకొంటే చాలన్నారు. 75 గజాల నుంచి 600 గజాలలోపు నిర్మాణాలకు సైతం నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకొన్న తర్వాత 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే 22వ రోజు ఆటోమేటిక్‌గా పోస్టు ద్వారానే అనుమతి పత్రాలు వస్తాయని చెప్పారు. ఈ చట్టం ద్వారా 70శాతం మందికి మున్సిపల్‌ ఆఫీస్‌ మొఖం చూడాల్సిన పనిలేకుండా పోతుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని గుర్తుచేశారు.

100 శాతం అక్షరాస్యత రావాలి
పట్టణప్రగతిలో అక్షరాస్యతపై కూడా దృష్టి సారిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నిరక్షరాస్యులను గుర్తించి 100 శాతం అక్షరాస్యులను చేసేందుకు కృషిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ అందరినీ గజ్వేల్‌కు తీసుకెళ్లి అక్కడి అభివృద్ధిని చూపించారని.. ఆ పట్టణం మాదిరిగానే వైకుంఠ ధామాలు, వెజ్‌, నాన్‌వెజ్‌, పూలు, పండ్ల మార్కెట్లు, ఓపెన్‌ జిమ్‌లు, క్రీడాప్రాంగణాలు ఏర్పాటుచేయాలన్నారు. ఎక్కడాలేనివిధంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాలమూరు పట్టణానికి 3,700 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు తీసుకొచ్చారని కితాబిచ్చారు. ‘సమావేశానికి వచ్చిన వార్డు ఆఫీసర్లు 49 మంది కనిపించడం లేదు.

వార్డు ఆఫీసర్లేరి కలెక్టర్‌ గారూ.. 49 వార్డులకు 49 మంది ప్రత్యేకాధికారులు నాకైతే కనిపించడం లేదు’ అని కలెక్టర్‌ వెంకట్రావును ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ బాగా అభివృద్ధి చెందాలని.. ఇక్కడికి మళ్లీ వస్తానని.. పనిచేయనివారిని ప్రత్యేకంగా గుర్తిస్తానని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మండలి విప్‌ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొరమోని నర్సింహులు, సీడీఎంఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నేడు దేవరకొండ, కల్వకుర్తిలో పర్యటన
పట్టణప్రగతిలో భాగంగా మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్‌ మంగళవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించే పట్టణప్రగతిలో పాల్గొంటారు.

అప్పుడు నాయనొచ్చిండు.. ఇప్పుడు నువ్వొచ్చినవ్‌ బిడ్డా
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సోమవారం మహబూబ్‌నగర్‌లోని పాతతోటలో పాదయాత్రచేశారు. అమ్మా, అవ్వ, అక్కా, అన్నా అంటూ స్థానికులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ నేపథ్యంలో అక్తర్‌ ఉన్నీసా బేగం ఇంటికి మంత్రి కేటీఆర్‌ చేరుకోగానే ఆయనను పట్టుకొని ఆనందబాష్పాలు రాల్చారు. స్పందించిన కేటీఆర్‌.. క్యాహై అమ్మా.. క్యూ రోరె అంటూ పలుకరించారు. ఉన్నీసాతోపాటు మరికొందరితో మంత్రి సంభాషణ ఇలా..

మంత్రి కేటీఆర్‌: అమ్మా ఎలా ఉన్నారు?
అక్తర్‌ ఉన్నీసా: బిడ్డా అప్పుడు నాయిన కేసీఆర్‌ వచ్చిండు.. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి పలుకరిస్తే సంతోషం తట్టుకోలేక కన్నీళ్లొచ్చినై. గప్పట్ల మేము ఎట్ల ఉన్నమో పలుకరించినోళ్లు లేరు.

మీకు పింఛన్‌ వస్తుందా? కుటుంబం బాగుందా?
ఉన్నీసా: బిడ్డా, నాయిన దేవుడిలెక్క మా కుటుంబాన్ని ఆదుకుంటుండు. ప్రతినెల పింఛన్‌ వస్తున్నది. అంతా సంతోషంగా ఉన్నం.

ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా?
ఉన్నీసా: నాకు అందరూ ఆడపిల్లలే. పెండ్లిళ్లుచేసిన. ఇల్లు కావాలయ్యా.లేనివారికి ఇల్లు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.ఉన్నీసా: ఇక చాలు బిడ్డా, ఇల్లు ఉంటే మంచిగ బతుకుతం. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి మా కాలనీల చాలా సమస్యలు తీరినై.

చెత్త వేసుకొనేందుకు బుట్టలు ఇచ్చారా అమ్మా?
వేణమ్మ: సార్‌, చెత్త బుట్టలు రెండు ఇచ్చారు.

చెత్త ప్రతిరోజు తీసుకుపోతున్నారా?
వేణమ్మ: మైక్‌ పెట్టుకొని ఇంటి దగ్గరికి వచ్చి చెత్త తీసుకొని పోతున్నరు.

డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
వేణమ్మ: వారానికి ఒకసారి డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నరు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నరు. వాళ్లను చదివించిన. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తే చాలా సంతోషంగా ఉంటం.

కాలనీ మంచిగ మారిందామ్మా?
వెంకటమ్మ: అయ్యా.. గప్పుడు గీ కాలనీ గురించి ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు. మురికివాడ అని ఎవ్వరు వచ్చేటోళ్లు కూడా కాదు. ఇప్పుడు మురికి లేకుండా మంచి కాలనీగా చేసిండు మా శీనయ్య.

నీళ్లు మంచిగ వస్తున్నాయా?
వెంకటమ్మ: రోజు విడిచి రోజు వస్తున్నయి. మాకు ఒక నల్లా ఇప్పించండి.

పింఛన్‌ సరిపోతుందా?
వెంకటమ్మ: అయ్యా.. గప్పుడు రూ.200 పింఛన్‌ వస్తుండే, మాకు ఇప్పుడు రూ.2,016 వస్తుంది. గింతకంటే ఇంకా ఏం కావాలి.

మీ వార్డు కౌన్సిలర్‌ ఎలా పనిచేస్తుండు?
కతాలమ్మ: మా వార్డు కౌన్సిలర్‌ మంచిగ పనిచేస్తుండు. ఏమన్న సమస్య ఉందంటే ఎంబటే వస్తడు.

ఈ ఇంటికి నువ్వే పెద్దనా అమ్మా?
కతాలమ్మ: అవునయ్యా.. మా ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉండి కాలం గడుపుతున్నం. ఇల్లు చిన్నగా ఉన్నది. జర కొత్త ఇల్లు మంజూరు అయ్యేటట్టు చూడుసార్‌.

ఇల్లు ఫికర్‌ పెట్టుకోకమ్మా..
కతాలమ్మ: సరే సారూ జర్ర మమ్మల్ని యాదిపెట్టుకొని మేలు చేయండి.

ప్రభుత్వం ఎట్లా ఉందమ్మా?
కతాలమ్మ: చాలా బాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా మంచి పథకాలను తీసుకొస్తుండు. మా శీనయ్య మంచిగ పనిచేస్తుండు. ఇంత మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు సూడలేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.