-తెలంగాణకు తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ -రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్షా -పాల్గొన్న మంత్రులు గంగుల, శ్రీనివాస్‌గౌడ్

కరీంనగర్‌లో లోయర్ మానేరు కింద చేపట్టిన ‘మానేరు రివర్ ఫ్రంట్’ తెలంగాణకే తలమానికంగా నిలువాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. దేశంలోని ఇతర రివర్‌ఫ్రంట్ల కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలపై శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, జిల్లా అధికారులు, నీటిపారుదల, మున్సిపల్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మానేరు రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.310 కోట్లు కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేసి ఆకర్షణీయ పర్యాటకప్రాంతంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న నీటిపారుదల, రెవెన్యూ, టూరిజం, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు. ప్రాజెక్టు అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ లేదా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు పర్యాటకం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచే లా ప్రణాళికలు రచించారని, ఈ క్రమంలో కరీంనగర్ వద్ద మానేరు రివర్‌ఫ్రంట్ కార్యక్రమాలు మొదలయ్యాయని వివరించారు. ప్రాజెక్ట్‌కు నీటిపారుదలశాఖతోపాటు భూసేకరణ వంటి అంశాల్లో రెవెన్యూ శాఖ మరింత సహకరించాలని ఆదేశించారు.
చివరి దశలో కేబుల్ బ్రిడ్జి మానేరు రివర్‌ఫ్రంట్‌లో అంతర్భాగమైన నాలుగు చెక్‌డ్యామ్‌లు పూర్తయ్యాయని, మరో చెక్‌డ్యామ్‌తోపాటు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చివరిదశలో ఉన్నదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పురుడుపోసుకున్న మానేరు రివర్‌ఫ్రంట్‌ను అత్యంత పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు తీసుకుపోతామని అన్నారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధిలో పర్యాటకశాఖ ఇప్పటికే చురుగ్గా పనిచేస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమశాఖ తరఫున కావలసిన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్‌పై ప్రత్యేక విజన్ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినా, అవి రాజధాని ప్రాంతాల్లోనే ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ భిన్నంగా ఆలోచించి కరీంనగర్‌లో ఒక పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. భారీ ఖర్చుతో, గొప్ప విజన్‌తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇది కరీంనగర్ పట్టణానికే కాకుండా తెలంగాణ రాష్ర్టానికే ప్రత్యేక పర్యాటక ఆకర్షణీయ ప్రాంతంగా మారే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్, వరంగల్ వంటి జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇప్పటికే కరీంనగర్‌కు ఐటీ టవర్ ద్వారా ఐటీ పరిశ్రమ కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని, రివర్‌ఫ్రంట్ పూర్తయ్యాక కరీంనగర్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.