హైదరాబాద్ పాతబస్తీని అద్బుతంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పేలా 18 నెలల కాలంలోనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంగళవారం పాతబస్తీలో కేటీఆర్ సుడిగాలి పర్యటన జరిపారు. -సమైక్య పాలనలో నిరాదరణకు గురైన హైదరాబాద్ -నిజాం కాలంనాటి రిజర్వాయర్లే తప్ప కొత్తవి నిర్మించలేదు -దాహం తీర్చడానికి రెండు రిజర్వాయర్ల ఏర్పాటు -తెలంగాణ వస్తే ఏమొస్తుందో చూపించాం -18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం -అభివృద్ధికి పాటుపడే నాయకులకే అండగా ఉందాం -ఓట్లకోసం వస్తే మీరెందుకు చేయలేదని నిలదీయాలన్న మంత్రి కేటీఆర్ -పాతబస్తీలో సుడిగాలి పర్యటన

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడలో దక్షిణ మండలం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రియాసత్‌నగర్, మైసారం ప్రాంతాల్లో రిజర్వాయర్‌లకు శంకుస్థాపన, బాబానగర్‌లో గుర్రంచెరువు, సూరంచెరువుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, జంగమ్మెట్ బస్తీలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో హైదరాబాద్ నగరం నిరాదరణకు గురైందన్నారు. ఇక్కడ భూములను అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న ఆంధ్రపాలకులు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక్కపని కూడా చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి కనీసం ఒక్క రిజర్వాయర్‌ను కూడా నిర్మించలేదని ఆరోపించారు. నిజాంకాలంలో నిర్మించిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ తప్ప కొత్తగా వచ్చినవి ఏవీ లేవన్నారు. అందుకే తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారి కళ్ళు బైర్లుకమ్మేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. సమైక్య పాలనలో పాతనగరం అన్నివిధాలుగా నిరాదరణకు గురైందని అన్నారు. అందుకే కేసీఆర్ పాతబస్తీపై ప్రత్యేకంగా దృష్టిని సారించి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.