-భూమి లెక్క ఖుల్లంఖుల్లా -కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు మూడునెలలు ఇదే పనిలో ఉండాలి -రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేసి రైతులకు పక్కాగా పత్రాలివ్వాలి -వివరాలు పంచాయతీ గోడపై రాయాలి -పహాణీ, సేత్వారీ, ఫౌతిలాంటి పదాలు రికార్డుల నుంచి తొలిగించాలి -ఐదెకరాలకు పైబడిన సాదాబైనామాలు కలెక్టర్ అనుమతితో క్రమబద్ధీకరణ -కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవిన్యూ రికార్డుల నిర్వహణ -ప్రక్షాళనకు కలెక్టర్లు బృందాలను ఏర్పాటు చేయాలి -కార్యక్రమ నిర్వహణ ఖర్చులకు ప్రతి కలెక్టరుకు రూ.50 లక్షలు -కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పాత విధానాలకు స్వస్తి పలుకుతూ కొత్తకు నాంది కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు. రికార్డుల ప్రక్షాళనతో అన్ని వివాదాలకు చరమగీతం పాడాలన్నారు. రికార్డుల్లో రైతులకు అర్థం కాని పహాణీ, సేత్వారీ, పౌతిలాంటి పదాలు తొలిగించి, రైతులకు అర్థమయ్యే సరళమైన పదాలు పొందుపర్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఐదెకరాలకు పైబడిన భూములకు సంబంధించిన సాదాబైనామాలను కూడా కలెక్టర్ అనుమతితో క్రమబద్ధీకరించాలని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఏటీఎంలో డబ్బు డ్రా చేసినా ఆన్‌లైన్‌లో ఖాతా అప్‌డేట్ అయ్యే పద్ధతిలో భూమి క్రయవిక్రయాలు కూడా అప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని అన్నారు. భూమి రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ, నవీకరణలపై గురువారం ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీవోలతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి రికార్డులను సమగ్రంగా ప్రక్షాళన చేసి, రైతులకు పక్కాగా పట్టాదార్ పాసుపుస్తకాలు అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి, భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలన్నారు.

అలాగే భూములు- వాటి యజమానుల వివరాలను పంచాయతీ గోడలపైన, ప్రభు త్వ పాఠశాలల గోడలపైన రాయాలని స్పష్టంచేశారు. భవిష్యత్‌లో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రికార్డులను ప్రక్షాళన చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే మూడు నెలల్లో పూర్తిచేయాలని, అప్పటివరకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఈ పనిమీదే ఉండాలని సీఎం సూచించారు. రికార్డుల ప్రక్షాళనకు ప్రతి కలెక్టరుకు రూ.50 లక్షల నిధులు ఇస్తున్నామని సీఎం తెలిపారు. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఆసాంతం నిర్వహించే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని, వారే బృందాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాగా పనిచేసే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం ప్రకటించారు.ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉంటున్న రెవెన్యూ అధికారులు తమ ప్రాథమిక విధి అయిన భూముల నిర్వహణను నిర్లక్ష్యం చేయాల్సి వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. భూమి రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం అనేక వివాదాలకు, గందరగోళానికి, ఘర్షణలకు దారితీసిందని చెప్పారు. రికార్డుల ప్రక్షాళన ద్వారా అన్ని వివాదాలకు చరమగీతం పాడాలని సీఎం సూచించారు.రైతుకు కావాల్సింది సాగునీరు, పెట్టుబడి, పండించిన పంటకు గిట్టుబాటు ధర అని అన్నారు. రైతులకు సాగునీరు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పెట్టుబడికోసం ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు వచ్చే ఏడాదినుంచి ఇస్తున్నామని, గిట్టుబాటు ధర రైతుకు అందించడం కోసం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నా మని వివరించారు. అయితే పెట్టుబడి ఇచ్చే పథకానికి భూమి రికార్డులు సరిగ్గా లేకపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజమైన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావాలంటే భూమి రికార్డులు పక్కాగా ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో బ్యాంకులు పెట్టుబడి ఇవ్వడానికి పట్టాదార్ పాసుపుస్తకాలు కుదువ పెట్టాల్సిన పనిలేదని అన్నారు. ఇక నుంచి బ్యాంకులు అడిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని స్పష్టంచేశారు. పక్కాగా రూపొందించిన రికార్డులను ఆన్‌లైన్‌లో చూసుకొని బ్యాంకులు రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే రైతులు సమావేశమై ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడానికి 2600 క్లస్టర్లలో రైతు సమావేశ మందిరాలను నిర్మించాలని సీఎం నిర్ణయించారు.
భూమి హక్కులపై స్పష్టత ఎకరాకు రెండు పంటల పెట్టుబడికి ఏడాదికి రూ.8 వేలు రైతుల బ్యాంక్ అకౌంట్‌లో వేయాలని నిర్ణయించాం. అయితే భూములున్న రైతులెవరు అని లెక్కలు తీస్తే రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, వ్యవసాయశాఖలో మరోలా వివరాలున్నాయి. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. కాబట్టి ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి, భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి వివిధ పనులకోసం లక్షల ఎకరాలు సేకరించింది. రైల్వే లైన్లు, ప్రాజెక్టులు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, దవాఖానలు, కాల్వలు నిర్మించడానికి వ్యవసాయ భూములు తీసుకున్నాం. కానీ ఈ వివరాలు రికార్డుల్లో నమోదుకాలేదు. ఇంకా ఆ భూములు రైతుల వద్ద ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూముల విషయంలో స్పష్టత రావాలి. మొదటి దశలో వివాదం లేని భూముల విషయంలో స్పష్టత రావాలి. వాటికి రైతులు, గ్రామస్థుల సహకారంతో స్పష్టత ఇవ్వాలి. రెండోదశలో కోర్టు వివాదంలోని భూములను గుర్తించాలి. కోర్టు కేసు తీర్పుకు లోబడి వాటిపై స్పష్టతఇస్తాం. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల వివరాలు నమోదు చేయాలి అని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు స్పష్టత ఇచ్చారు.
రికార్డుల ప్రక్షాళనకు ప్రతి కలెక్టర్‌కు రూ.50 లక్షలు గ్రామాల్లో భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించే బృందాల ఎంపిక బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే. అవసరమైతే కొంతమందిని తాత్కాలిక పద్ధతిపై నియమించుకోండి. భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి ప్రతి కలెక్టర్‌కు రూ.50 లక్షలు అందుబాటులో ఉంచుతున్నాం. రెవెన్యూ గ్రామం యూనిట్‌గా వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ భూముల వివరాలు సేకరించాలి. అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలి అని సీఎం చెప్పారు.
వ్యవసాయం బాగుపడాలంటే రైతులకు చేయూత అందించాలి రైతులకు కావాల్సింది ప్రధానంగా మూడు అంశాలు.. ఒకటి సాగునీరు, రెండోది పెట్టుబడి, మూడోది గిట్టుబాటు ధర. ఈ మూడు అంశాల్లో రైతుకు చేయూత అందితే వ్యవసాయం బాగుపడుతుంది. అందుకే రాష్ట్రంలో ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టాం. సాగునీరు అందించడానికి కృషిచేస్తున్నాం. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నాం. కొంతమంది కోర్టు కేసుల ద్వారా ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నా, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకుపోతున్నది. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరిస్తున్నాం. నాణ్యమైన ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలపాటు ఇవ్వడంవల్ల భూగర్భ జలాలు కూడా వినియోగంలోకి వచ్చాయి. ప్రస్తుతం 45% పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. వచ్చే యాసంగి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాచేయడానికి కృషి జరుగుతున్నది. ఉపరితల, భూగర్భ జలాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తున్నాం అని సీఎం తెలిపారు.
ప్రభుత్వమే రైతులను సంఘటితం చేస్తుంది వచ్చే ఏడాదినుంచి రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి అందిస్తున్నాం. మూడో అంశమైన గిట్టుబాటు ధర కోసం రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేస్తున్నాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్ర బాధలో ప్రజలు ఉన్నారు. అమెరికా సహా అనేక దేశాల్లో టమాటా లాంటి ఉత్పత్తులను రోడ్లపై పారబోసే దృశ్యాలను బీబీసీలాంటి న్యూస్ చానళ్లలో చూస్తున్నాం. రైతు సంఘాలు సంఘటితంగా లేకపోవడంవల్లనే ఈ సమస్య వస్తుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వమే పూనుకొని, అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేస్తున్నది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాల ప్రతినిధులుంటారు. మూడోవంతు మహిళా సభ్యులుంటారు. మండల రైతు సమన్వయ సమితులు ఎప్పటికప్పుడు మార్కెట్‌లోని అడ్తిదారులతో మాట్లాడుతారు.
రైతులంతా ఒకేసారి పంటను మార్కెట్‌కు తీసుకురావద్దు. మండల రైతు సమన్వయ సమితులు అడ్తిదారులతో మాట్లాడి గిట్టుబాటు ధర నిర్ణయిస్తాయి. ఆ తర్వాతే సరుకును గ్రామాలవారీగా తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందుతారు. ఒకవేళ మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాకుంటే, రాష్ట్ర రైతు సమన్వయ సమితి నేరుగా కొనుగోళ్లు జరుపుతుంది. దీనికోసం రూ.500 కోట్ల నిధిని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇది కాకుండా మరో ఐదారు వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి పంటను కొనుగోలు చేసి, ప్రాసెసింగ్ చేసే హక్కులను ప్రభుత్వం కల్పిస్తుంది. దీనిద్వారా రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది అని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, భూమి రికార్డుల ప్రక్షాళన ప్రాజెక్టు మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎంవో అధికారులు, ఎంపిక చేసిన తహసీల్దార్లు, కొంతమంది రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన సూచనలు -ఐదెకరాలకు పైబడిన భూములకు సంబంధించిన సాదాబైనామాలను కూడా కలెక్టర్ అనుమతితో క్రమబద్ధీకరించాలి. పాత దరఖాస్తుదారుల నుంచి సాదాబైనామా రాసుకున్న తేదీ నాటి రేటుతో రిజిస్ట్రేషన్ చేయాలి. -భూమి శిస్తు రద్దు చేసినందున భూమి రకాలను వర్గీకరించాల్సిన అవసరం లేదు. గరిష్ఠ భూ పరిమితి చట్టం ప్రకారం వర్గీకరించిన భూముల వివరాలను యథాతథంగా కొనసాగించాలి. -అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో వీలైనంత గరిష్ఠస్థాయిలో క్లియర్ చేయాలి. భూ యాజమాన్య హక్కులు కల్పించాలి. వ్యవసాయం చేసుకునే వారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలి. -కోర్ బ్యాంకింగ్ తరహాలో భూమి రికార్డుల నిర్వహణ ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ ఏటీఎంలో డబ్బులు తీసుకున్నా, వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయి వెంటనే సమాచారం వస్తుంది. కోట్లాది ఖాతాలు నిర్వహించే బ్యాంకులలో సాధ్యమైన ఈ పద్ధతి 55 లక్షల రైతులకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో అనుసరించాలి. -గ్రామ కంఠం పరిధి, హద్దులను నిర్ణయించాలి. -అంకితభావంతో చేసే ఏ పనైనా విజయవంతం అవుతుంది. అధికారులు భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాదిరిగా కాకుండా, పితృ వాత్సల్యంతో నిర్వహించాలి. -తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేయాలి. అందుకు రైతు సమన్వయ సమితులదే ప్రధాన భూమిక. రైతు సమన్వయ సమితి సభ్యులు 1.75 లక్షల మంది ఉంటారు. అదొక సైన్యం. రైతులను సంఘటిత శక్తిగామార్చి రైతుల కోసం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తాం. -2600 క్లస్టర్లలో రైతు సమావేశ మందిరాలను నిర్మించాలి. రూ.15 లక్షలతో నిర్మించే రైతు వేదిక కోసం దాతల నుంచి స్థలాలు సేకరించాలి. రైతులు పరస్పరం చర్చించుకొని మార్కెట్ ధరలు, పంటల పరిస్థితి, మార్కెట్ డిమాండ్, ఆధునిక పద్ధతులు, శాస్త్రీయ విధానాలు, యాంత్రీకరణపై అభిప్రాయాలు పంచుకోవాలి.