Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పట్నాలు కళకళలాడాలి

-దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలు, నగరాలుగా మార్చాలి
-అధికారులు, ప్రజాప్రతినిధులదే ఆ బాధ్యత
-మేయర్లు,చైర్‌పర్సన్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
-పల్లెప్రగతి పునాదిగా 24 నుంచి పట్టణప్రగతి
-దళితవాడల నుంచే కార్యక్రమాలు మొదలుపెట్టాలి
-మూడునెలల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి
-ఎనిమిది నెలల్లో కరంటు సమస్యలకు పరిష్కారం
-పల్లెప్రగతిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు
-తేడావస్తే ఎవరైనా పదవుల నుంచి తప్పుకోవాల్సిందే
-ఎమ్మెల్యేలు, కలెక్టర్లు గ్రామాల్లో రాత్రి బసచేయాలి
-అన్ని మున్సిపాలిటీల్లో మరోసారి క్రమబద్ధీకరణ
-మున్సిపల్‌ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే పట్టణప్రగతి కార్యక్రమంతో పట్టణాలు, నగరాలు కళకళలాడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలు, నగరాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లదేనని చెప్పారు. పల్లెప్రగతి పునాదిగా ఈ నెల 24 నుంచి పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టే కార్యక్రమాలను పేదలు ఎక్కువగా నివసించే దళితవాడల నుంచే ప్రారంభించాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టిపెట్టాలని తెలిపారు. వార్డులవారీగా పట్టణప్రగతి ప్రణాళిక తయారుచేసుకొని, దానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ వెళ్లాలన్నారు. నిధుల వినియోగంలో కచ్చితమైన క్రమశిక్షణ పాటించాలని, ప్రణాళిక ప్రకారమే వ్యయంచేయాలని సూచించారు. మూడునెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం పూర్తిచేయాలని, ఎనిమిది నెలల్లో కరంటు సంబంధిత సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని ఆదేశించారు. లేనిపక్షంలో సంబంధిత ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి, పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

పల్లెప్రగతి కార్యక్రమం సమీక్షించటానికి మండల పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి బసచేసి, గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి, పల్లెప్రగతి లక్ష్యాలను సాధించాలని కోరారు. మంగళవారం ప్రగతిభవన్‌లో కార్పొరేషన్ల మేయర్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సదస్సునిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేయాల్సిన, చేయించాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఎలా ఉండాలో వివరించారు. భర్తృహరి సుభాషిత పద్యం చదివి, అర్థం చెప్పి కార్యోన్ముఖులను చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వార్డులవారీగా ప్రణాళిక
పట్టణంలో వార్డులవారీగా ప్రణాళిక తయారుచేయాలి. ప్రతి పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక తయారుకావాలి. కౌన్సిలర్‌/ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ఈ ప్రణాళికను రూపొందించాలి. వార్డులవారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయా లు తీసుకోవాలి. ప్రతివార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలి. వార్డులో ఏమి ఉన్నాయి? ఏమి లేవు? ఇంకా ఏమి కావాలి? ఏమిచేయాలి? అనేదానిపై ఎక్స్‌రే తీసుకుని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. పట్టణంలో ఉండాల్సిన కనీస పౌర సదుపాయాలేమిటో నిర్ధారించుకుని, వాటిని కల్పించటానికి ప్రాధాన్యమివ్వాలి.

పట్టణ ప్రజలకు, పట్టణాలకు వచ్చే ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వస్థలాలను వినియోగించాలి. ఏ పట్టణానికి ఎన్ని టాయిలెట్లు అవసరం.. ఎక్కడ నిర్మించాలో నిర్ధారించుకుని మూడునెలల్లో వా టి నిర్మాణం పూర్తిచేయాలి. వీధుల్లో వ్యాపారం చేసుకునే స్ట్రీట్‌వెండర్స్‌ కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్‌వెండింగ్‌ జోన్లు ఏర్పాటుచేసి.. వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రత్యేకస్థలం కేటాయించేవరకు వారికి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం తగు ఆదేశాలు ఇస్తుంది. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజారవాణా వాహనాలు, సరుకురవాణా వాహనాలను నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్క్‌చేయడానికి సదుపాయం కల్పించాలి. వీటన్నింటికోసం ప్రభుత్వస్థలాలను వినియోగించే అధికారం కలెక్టర్లకు ప్రభుత్వం కల్పిస్తుంది.

ఎనిమిది నెలల్లో ప్రమాదరహిత విద్యుత్‌ వ్యవస్థ
పట్టణాల్లో ప్రమాదరహిత విద్యుత్‌వ్యవస్థ తయారుకావాలి. వంగిన, తుప్పుపట్టిన, రోడ్డుమధ్యలోని విద్యుత్‌ స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ఉండే ట్రాన్స్‌ఫారాలను మార్చాలి. పొట్టి స్తం భాల స్థానంలో పెద్దస్తంభాలు వేసి.. ఇండ్లపై వేలాడే వైర్లను సరిచేయాలి. ఈ పనులన్నీ చేయడానికి అవసరమైన నిధులను ఈసారి బడ్జెట్‌లో కేటాయిస్తాం. ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో ఎనిమిదినెలల్లో కరం టు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. లేనట్లయితే దానికి వారే బాధ్యత వహించాలి. కావాల్సిన స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫారాలను విద్యుత్‌ అధికారులు ముందుగానే సమకూర్చి, ఆయా పట్టణాలకు పంపించాలి.

అభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులు
పట్టణాలకు ప్రతినెలా రూ.148 కోట్ల చొప్పున ఆర్థికసంఘం నిధులు అందిస్తాం. ఇతర ఖర్చులు తగ్గించుకుని అయినాసరే, గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నట్టే.. పట్టణాల అభివృద్ధికి నిధులు అందజేస్తాం. ఈ నిధుల వినియోగంలో క్రమశిక్షణ ఉండాలి. ప్రతి మున్సిపాలిటీ ఆర్థికప్రణాళిక రూపొందించుకోవాలి. తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చును చార్టెడ్‌ అకౌంట్‌గా నిర్దేశించుకోవాలి. అప్పులకు సంబంధించిన కిస్తీలు, ఉద్యోగుల జీతభత్యాలు, కరంటు బిల్లులు, మంచినీటి బిల్లులు ప్రతినెలా కచ్చితంగా చెల్లించాలి. ఇది కమిషనర్ల బాధ్యత. ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడే పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించాలి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను కూడా పట్టణాల ప్రగతికి వినియోగించాలి. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది. ఇందులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి. ఎవరికివారు పూనుకొని తమ ప్రాంతంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి.

చెట్లు పెంచే బాధ్యత కౌన్సిలర్లు, కార్పొరేటర్లదే
పల్లెల్లో సర్పంచ్‌ల మాదిరిగా పట్టణాల్లో చెట్లుపెంచే బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు స్వీకరించాలి. పెట్టిన మొక్కల్లో 85% బతికే బాధ్యతను వారు తీసుకోవాలి. ఆయా పట్టణాలకు అవసమైనన్ని నర్సరీలను ఏర్పాటుచేయా లి.పట్టణంలో జాగాలేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేయాలి. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీచేయాలి. ఇండ్ల నుంచి చెత్తసేకరణకు అవసరమైనన్ని వాహనాలు సమకూర్చుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 3,100 వాహనాలు తీసుకోవాలని నిర్ణయించాం. ఇప్పటికే 600 వాహనాలు వ చ్చాయి. మిగతావి త్వరలోనే వస్తాయి. ఇంకా అవసరం ఉన్న పట్టణాల్లో మరికొన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నది. డైనేజీలు శుభ్రంచేయడానికి అనేకరకాల మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఏర్పాటుచేసుకోవాలి.

అక్రమ నిర్మాణాల కూల్చివేత
కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇండ్ల నిర్మాణం, లేఅవుట్‌ విషయం లో సులభమైన అనుమతుల విధానం తెచ్చామని, ప్రజలపై నమ్మకం ఉంచామని అన్నా రు. ‘ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠినచర్యలు తీసుకుంటాం.. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం’ అని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని సూచించారు. జీవో నంబరు 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వస్థలాల్లో నిర్మించిన ఇండ్లను క్రమబద్ధీకరించినట్టే.. అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, డీజీపీ మ హేందర్‌రెడ్డి, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పట్టణ పరిపాలన కమిషనర్‌ సత్యనారాయణ, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంకల్పం ఉంటే వందశాతం విజయం
-మేయర్లు, చైర్‌పర్సన్లతో ముఖాముఖిలో సీఎం
మున్సిపల్‌ సదస్సులో భాగంగా సీఎం కేసీఆర్‌ మేయర్లు, చైర్‌పర్సన్లతో ముఖాముఖి నిర్వహించారు. ‘మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజాజీవితంలో అనేకరకాల అనుభవాలుంటాయి. దేశంలో, రాష్ట్రం లో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభమైపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నవి. బ్రిటిష్‌ వలసపాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చా యి. అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛాభారతంలో ఉన్నాం. జాతి నిర్మాణరంగంలో మనమంతా మమేకమైపోయాం. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదుకోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజాజీవితంలో ఎంతముందుకైనా పోవచ్చు.

పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజాజీవితం అంత సులభంకాదు. సోయి తప్పి పనిచేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రంవస్తే మనం బాగుపడుతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండుసార్లు సీఎంను చేశారు. నా వరకైతే గెలిచేంతవరకే రాజకీయం, తర్వా త కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పథకాలు అన్నిగ్రామాల్లో వివక్షలేకుండా అమలుచేశాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పనిచేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. అవగాహనతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలుగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే గొప్ప ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. మీరంతా ధీరులు కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

పక్కా ప్లానింగ్‌ ఉండాలి
‘ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్‌నైట్‌లో చేసేస్తాం అని మాట్లాడొద్దు. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకునిపోయి పట్టణాలను తీర్చిదిద్దాలి’ అని సీఎం కేసీఆర్‌ ఉద్బోధించారు. ఫొటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడం పై దృష్టిపెట్టాలన్నారు. ‘ఆరునెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారిపడతాయి. ప్రగతి నిరోధకశక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉం టూ నే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ఎప్పు డూ ఇతరదేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి’ అని చెప్పారు.

భర్తృహరి సుభాషితంతో..
-ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
-యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌
-ధీరుల్‌ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
-ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్‌ గావునన్‌
ఏదైనా పని మొదలుపెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చివరిగా భర్తృహరి సుభాషితంలోని పద్యం చదవి, దాని అర్థంచెప్పారు. మేయర్ల, చైర్‌పర్సన్లు, అధికారులు అనుకున్న లక్ష్యం సాధించి, ఉత్తములుగా నిలువాలని ఆకాంక్షిస్తూ సదస్సును ముగించారు.

మంచి పట్టణం లక్షణాలు ఇవే
‘మంచి పట్టణం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అనేది ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. దానికి సమాధానాలు వెతుక్కుంటే ఏమిచేయాలో బోధపడుతుంది. ప్రతిరోజూ చెత్తను, మురుగును నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలి. శుద్ధమైన మంచినీరు సరఫరా కావాలి. వీధిలైట్లు బాగా వెలగాలి. రహదారులపై గుంతలు, బొందలు, గోతులు ఉండకూడదు. పట్టణం పచ్చదనంతో కళకళలాడాలి. చెత్త నిర్మూలనకు డంప్‌యార్డులు ఉండాలి. చనిపోయినవారిని గౌరవంగా సాగనంపేందుకు దహనవాటికలు/ ఖననవాటికలు ఉండాలి. పట్టణ జనాభాను అనుసరించి పరిశుభ్రమైన వెజ్‌, నాన్‌వెజ్‌, ఫ్రూట్‌, ఫ్లవర్‌ మార్కెట్లు ఏర్పాటుచేయాలి. పట్టణంలోని యువతకు అవసరమైన క్రీడాప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఉండాలి’ ఇవీ ఒక మంచి పట్టణం లక్షణాలు అని సీఎం తెలిపారు.

అవినీతిరహిత వ్యవస్థ ఉండాలి
మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. ‘బల్దియా.. ఖాయా పీయా చల్దియా’ అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డపేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంబించాలి. అవినీతిరహిత వ్యవస్థ ఉండాలి. పట్టణప్రగతి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అడ్డదిడ్డంగా ఎటుపడితే అటుకాదు. అది మీ చేతుల్లోనే ఉన్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.