-ఖమ్మం- వరంగల్- నల్లగొండ నుంచి పోటీ -ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ -హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థిపై త్వరలో నిర్ణయం

ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ఆదివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలిపారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని షోడశపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్ పొందారు. పరిశోధనలో కృషికిగాను డాక్టర్ తమహంకర్ మెమోరియల్ పతకం అందుకొన్నారు.
విద్యార్థి నేత నుంచి.. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఎదిగిన ఆయన, తదనంతరం టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో పల్లా రాజేశ్వరెడ్డిపై 20 సెక్షన్ల కింద 11 కేసులు నమోదయ్యాయి. 2015లో వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో టీఆర్ఎస్ రాష్ట్ర అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనమండలి విప్‌గా పనిచేశారు. నల్లగొండ ఎంపీగా పోటీచేశారు. వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పట్టభద్రులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు దోహదపడ్డారు.