Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పట్టాల పండుగ

-1.25లక్షల మందికి పట్టాల పంపిణీ -ఈ పట్టాల భూమి విలువ 10వేల కోట్లు -ఈ కార్యక్రమంతో నా జన్మ ధన్యమైంది -ఇది పేదల గోస తెలిసిన ప్రభుత్వం -అన్ని కార్యక్రమాలకు పేదలే కేంద్రబిందువు -పట్టాలు రానోళ్లు మనసు చిన్న చేసుకోవద్దు -రెండేండ్లలో గుడిసెలు లేని హైదరాబాద్ -గతంలో గుడిసెలు వేస్తే బుల్డోజర్లు వచ్చేవి..ఇపుడు పట్టాలు పట్టుకుని అధికార్లు వచ్చిండ్రు -పేదలు బాగుంటేనే తెలంగాణ సార్థకమైనట్లు -రేసుకోర్సు స్థలం స్వాధీనం చేసుకుంటా -ఇండ్ల పట్టాల పంపిణీలో సీఎం కేసీఆర్

CM KCR distributes pattas to the poor people01

ఒకప్పుడు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు వచ్చేవని, ఇప్పుడు ఉచిత క్రమబద్దీకరణ పట్టాలు పట్టుకుని అధికారులే పేదల వద్దకు వస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మార్పు ఇదేనని అన్నారు. ఇపుడు చరిత్ర మారిందని, తెలంగాణ పేదల గోస తెలిసిన బిడ్డలే ప్రభుత్వంలో ఉన్నారని సీఎం చెప్పారు. రాష్ట్రంలో నిరుపేదలకు జీవో 58 కింద ఒక్క రోజే 1,25,000 మందికి పట్టాలిచ్చే కార్యక్రమం చేపట్టడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌లో లక్షమందికి పట్టాలు ఇచ్చిన భూమి విలువ పదివేల కోట్ల రూపాయలని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న తరుణంలో పేదల కళ్లల్లో వెలుగు చూడటంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. అవతరణ ఉత్సవాల సమయంలో ఈ పట్టాలు పంపిణీ చేయడం తన జీవితంలో మంచి అనుభూతి, జ్ఞాపకమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు ఉచితంగా ఇండ్ల స్థలాలు క్రమబద్ధీకరిస్తూ పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నగరంలోని మల్కాజిగిరి, ఎన్‌బీటీ కాలనీల్లో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆసాంతం పేదల గురించే మాట్లాడారు. నగరం నడిబొడ్డున ఉన్న రేసుకోర్సు భూములను స్వాధీనం చేసుకుని అందులో పాతబస్తీ ప్రజలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. గోల్ఫ్‌కోర్సులకు, రేస్‌కోర్సులకు, పేకాట క్లబ్లుకు నగరం నడిబొడ్డున విలువైన స్థలాలెందుకని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులను ఎత్తిపడేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పేదలే కేంద్ర బిందువుగా ఉంటాయని స్పష్టంచేసిన సీఎం.. పేదలు బాగుంటేనే వచ్చిన తెలంగాణ సార్థకమైనట్లని అన్నారు. ఎవ్వరెన్ని అడ్డంకులు సృష్టించినా భయపడేది లేదని, పేదలకు ఇండ్లు కట్టించి తీరడం ఖాయమని విస్పష్టంగా ప్రకటించారు. బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఇండ్ల స్థలాల ధరలకు ఈ కాలనీల పేదల స్థలాల ధరలు కూడా చేరాయన్న సీఎం.. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని, ఇవాల్టినుంచి యజమానులుగా మీ ఇంట్లో బాజాప్త ఉండవచ్చని చెప్పారు.

CM KCR distributes pattas to the poor people

మల్కాజిగిరిలో 3377 మందికి పట్టాలు: మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,377 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ జనంలో మనిషిగా ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో గుడిసెలు వేస్తే బుల్డోజర్లతో వచ్చి తొలగించేవారు. గిన్నెలు, బోళ్లు, మంచాలు రోడ్డున పడేసేవారు. జనం చెట్టుకింద కాపురముండేవారు. రైల్వే ట్రాక్‌ల వద్ద ఉన్న రెండున్నర ఎకరాలలో పేదలు రేకులతో గుడిసెలు వేసకున్నరు. దరిద్రమైన జీవితం గడుపుతున్నరు. రేసుకోర్సు, గోల్ఫ్‌కోర్స్, పేకాట క్లబ్‌లకు వందల ఎకరాలు ఎందుకు? ఇదంతా గత చరిత్ర. ఇపుడు చరిత్ర మారింది. తెలంగాణ పేదల గోస తెలిసిన బిడ్డలే ప్రభుత్వంలో ఉన్నరు. అందుకే వచ్చే రెండేండ్లలో పేదలు నివసించే మురుగు బస్తీలు పోయి రెండు పడక గదుల ఇండ్లు వస్తయి. గతంలో డబ్బాల్లాంటి ఇండ్లు కట్టి ఇచ్చారు. కాళ్లు సాపి పడకుంటే కాళ్లు ముఖాలకు తగులుతయి! పైగా బ్యాంకుల సుట్టూ తిరగడం, మీ వాట, మా వాట అంటూ తిప్పి తప్పి సంపితిరి! తిరిగీ తిరిగీ ఆగమయితిమి! అయినా ఇల్లు రాదాయే! ఇపుడు గట్ల గాదు. మొత్తం రూ.7 నుంచి రూ.9 లక్షలు ఖర్చయ్యే ఇండ్లను మొత్తం డబ్బులను 100 శాతం గ్రాంట్‌కింద ప్రభుత్వంమే కట్టించి ఇస్తది. ప్రతీ ఏడు 50 వేల చొప్పున మొత్తం రానున్న రెండేళ్లలో గుడిసెల్లేని నగరంగా చేస్తం.

మొత్తం 3,36,000 దరఖాస్తులు : జీవో 58 కింద మొత్తం 3,36,000 దరఖాస్తులు వచ్చినయి. ఇందులో 1,25,000 మంది పేదలకు ఈ రోజు పట్టాలు అందిస్తున్నం. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 2లక్షల చిల్లర పెండింగ్‌లో ఉన్నయి. వాటన్నిటిని పరిశీలించి అందరికీ 100 శాతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నం. ఇపుడు పట్టాలు రానివాళ్లు మనసు చిన్నబుచ్చుకోవద్దు. నేనే ఉన్నా. త్వరలో వీటన్నిటినీ పరిశీలించి, భూమిని కొనుగోలు చేసి ఇయ్యాల్సి ఉంది.

భీంరావుబాడ భూమిని బలవంతంగా లాక్కున్నరు నగరంలోని భీంరావుబాడ బస్తీవాసులనుంచి బలవంతంగా గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కట్టేందుకు లాక్కుంది. ఓ పీసీసీ అధ్యక్షుడు వరంగల్ మడికొండలో దళితులకిచ్చిన అనైన్డ్ భూములను లాక్కున్నడు. అలాంటి అరాచకాలకు ముకుతాడు వేసి, తిరిగి లాక్కుంటం. గతంలో మాదిరిగా లంచం, పైరవీ, దందాలు, ఆఫీసుల చుట్టూ తిరుగుడు వంటివి ఏమి లేకుండా ఆఫీసర్లంత మీ ఇంటికి వచ్చి ఒక్కపైస కర్సు లేకుంట పట్టాలు ఇస్తండ్రు. ఇంకేంది! ఇదే తెలంగాణలో మార్పు! మీ దీవెనలతో హైదరాబాద్‌ను బంగారంగా చేస్త. లండన్, అమెరికా ఏమన్న గొప్పనా? వారికంటే అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం చేస్తం. హైదరాబాద్‌ను మహాద్భుతం చేస్తం.

పేదల పక్షపాతి గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న పాత్ర మర్వలేం. పేదల పక్షపాతి గద్దరన్న భార్య విమలక్క ఇండ్లు మంజూరు చేయాలని ఓ వినతిపత్రం ఇచ్చింది. అమె కోరిక మేరకు 100 శాతం పేదలకు ఇళ్లు కట్టిస్తం.. ప్రోగ్రెసివ్‌గా ముందుకెళ్తం. ఎవరేమన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి.

మనసున్న మారాజు సీఎం: సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ పేదల పాలిట పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజని కొనియాడారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. మాల్కాజిగిరి ఎమ్మెల్యే కనుకారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి వారంలోనే వేల సంఖ్యలో పట్టాలను అందించిన ఘనత వహించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, రంగారెడ్డి జిల్లా జడ్‌పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంచి పనులు చేసే అవకాశం కొన్నిసార్లే వస్తది: బంజారాహిల్స్ ప్రాంతంలోని ఎన్‌బీటీనగర్ కాలనీలో ఏడువేల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇయ్యాల నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మనుషులమై పుడతం.. చస్తం. సమస్యకాదు. మంచి పనులు చేసే అవకాశం కొన్నిసార్లు మాత్రమే వస్తది. అనేక సంవత్సరాలనుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి, ఏ ప్రభుత్వంకూడా చేయనటువంటి 1.25 లక్షల మందికి, హైదరాబాద్‌లో లక్ష మందికి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఇట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంకో 25 వేల మందికి పేదలందికీ కూడా ఎక్కడ గుడిసె ఉందో.. ఎక్కడ ఇల్లు కట్టుకున్నరో ఆ జాగలనే వారికి పట్టా ఇస్తా ఉన్నాం. దత్తాత్రేయగారు చెప్పినట్లు మా అక్క చెల్లెళ్ల పేరుమీదనే పట్టాలు ఇస్తున్నాము. మొగోళ్లకు ఇస్తే అంతా ఆగమాగం చేస్తరు. మొగోళ్లు మా అన్నదమ్ముళ్లు.. మమ్ముల్ని కొట్టినా సరే కానీ.. జాగ మంచిగ.. సేఫ్‌గ ఉండాలి. పిల్లలకు మంచిగ అక్కరకు రావాలంటే ఆడవాళ్ల పేరుమీద ఉంటేనే మంచిగ ఉంటది. వీటిల్లో ఇంకా కొంతమంది ఇల్లు కట్టుకోవాల్సి ఉంది. అలాంటి వారికి ప్రభుత్వం రూ.9 లక్షలతో ఇండ్లు నిర్మించి ఇస్తుంది. కేసులలో ఉన్న భూములకు మంచి లాయర్లను పెడతం. ఇవ్వాలనుంచి బాజాప్త అధికారికంగా పట్టాదారులు.

మల్లమ్మకు ఇల్లు కట్టకపోతే ఎమ్మెల్యేను పట్టుకుంట మల్లమ్మ అనే స్థానిక మహిళకు ఇల్లు కట్టించి ఇవ్వడంపై ప్రత్యేకంగా మాట్లాడిన కేసీఆర్.. మల్లమ్మ వేసుకున్న గుడిసె పాపం.. బిల్డింగ్‌కింద పోతది. మనం కొత్తగా కట్టే ఇండ్లల్లో మల్లమ్మ పేరు ముందుగాల పెట్టాలె. లేదంటే మల్లమ్మకు నా అడ్రసు ఇచ్చిపోత. ఆమెకు ఇల్లు కట్టకపోతే నేనే రామచంద్రారెడ్డినే పట్టుకుంట. మహిళా సంఘం నాయకురాళ్లు కూడా ముందుగాల ఆమెకు ఇప్పించే, బిల్డింగ్ మెదలు పెట్టాలె.

ప్రజలే కాపలాదారులు: ఎవ్వలవద్ద మంత్రదండం ఉండదు. మనం అన్నం తినాలె. వట్టిగనే అయితదా అన్నం! బియ్యం నాన్పాలె, పొయ్యిమీద పెట్టాలె, వంటచెయ్యాలె.. ఉడికిందా లేదా చూడాలి. కరెక్టు టైమ్ చూసి దించాలి. దాని వెన్కెమ్మడి కూరగాయలు తేవాలె, తరుక్కోవాలె, దాని పోపు పెట్టాలె, కూర ఉడకాలె, ఇవన్నీ అయితే పల్లెం గ్లాస్ కడుక్కొని కూర్చుంటే అన్నం తినడానికి నోట్లోకి వస్తది. అట్లనే ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి ఉంటది. దాని ప్రకారంగా చేసుకుంటూ పోతే మనం సాధించలేనిది ఏదీ ఉండదు. పట్టుదల, ఐక్యమత్యం,ఆలోచన కావాలె. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టాలె. ఇప్పుడేమీ ఎలక్షన్ లేదు.. మన్నులేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు సరె! ఎవ్వళ్లు మంచిగ చేస్తే వాళ్లు గెలుస్తరు. అది ఇయ్యాల్టి మాట కాదు. కమ్యూనిటీ హాల్ అనుకున్నం. శాంక్షన్ చేసుకున్నం. అందరం నిలబడి, కాంట్రాక్టరు మంచిగ కడుతున్నడా? లేదా? కాపాలాకాసి కట్టించుకోవాలె. మీరే దాని పర్యవేక్షణ చేయాలి. మిమ్మల్ని మించిన కాపలాదారులు లేరు.

గతంలో డబ్బాలాంటి ఇండ్లు కట్టారు: గతంలో మంజూరు చేసిన ఇండ్లు డబ్బాల్లాగా ఉన్నయి. ఒక రూమ్ కట్టించారు. మెల్లగా కట్టినా మంచిదే. ప్రతి సంవత్సరం లక్షల ఇండ్లు కట్టక్కరలేదు. 50 వేలు కట్టుకుంట పోయినా మంచిదే! కట్టే ఇల్లు రెండుతరాలకు పనికొచ్చేటట్లుండాలి. ఒక్క రూమ్ కట్టి ఉండమంటే ఉంటరా? ఆడమనుషులు స్నానాలు చేస్తే బట్టలు ఎక్కడ కట్టుకోవాలె! ఎవడన్న చుట్టపోడువస్తే ఎక్కడ పండుకోవాలె! అందుకే ఖర్చైనా.. అందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టాలని నిర్ణయం చేసినం. ఈ ఇండ్ల నిర్మాణం మీద కూడా చాలామంది పెద్దలు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఎనకట మీమేమీ చేయలేదు.. మీరేమీ చేయవద్దు.. మీరు కూడా ముండమోసినట్లు ఉండాలనే పద్ధతిలో మాట్లాడుతున్నరు. అదీ చేయనివాళ్లకు.. చేసే వాళ్లకు తేడా!

దోమ గొప్ప సోషలిస్ట్: దోమకు సీఎం, ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారి, సినిమా యాక్టర్ అనే తేడా ఉండదు. ఎవరినైనా కుడుతది, కేంద్రమంత్రిని కూడా వదలిపెట్టదు. (నవ్వుతున్న ప్రజలనుద్దేశించి) అంతే కదా! దోమ గొప్ప సోషలిస్ట్. తరతమ బేధం లేదు. ఎవ్వరు దొరికితే వారిని కుడుతది. కాబట్టి దోమ లేకుంటెనే మంచిది కదా? ప్రధాని మోదీ తీసుకున్న స్వచ్ఛ భారత్ బృహత్తర కార్యక్రమం. దానిని ఆదర్శంగా మనం స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం తీసుకున్నం. దానికి మనం ఎంత గొప్పగా చేసుకుంటే మనకు అంత బాగుంటది.

ఇది మీ అందరి జీవితాల్లో పండుగ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం చాలా బాగుందదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇది మీ అందరి జీవితాల్లో పండుగని చెప్పారు. 50, 60 ఏళ్ల తరువాత పట్టాలు ఇస్తున్నారని, యజమానులు ఆవుతున్నారని అన్నారు. వీటిని కాపాడుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు మాట్లాడుతూ కేసీఆర్ ఉన్నంత వరకూ పండగే ఉంటుందన్నారు. నిరంతరం పేదల గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తాడన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని, కేసీఆర్ ఉన్నంత వరకు మీ మీదనే దృష్టి ఉంటుందన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జీవో 59ని సవరించాలని కోరారు. జీవో 58 కింద పేదలకు ఉచితంగా పట్టాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎమ్మెల్సీలు సలీమ్, రాములునాయక్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్‌తో పాటు సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం, దత్తాత్రేయ తదితరులు పలువురు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

కేసీఆర్‌ లాంటి సీఎం రావడం అదృష్టం: టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పేదలకు పండుగ వచ్చింది. ఆ పండుగ తెచ్చింది సీఎం కేసీఆర్. మంచి సీఎం వచ్చిండు. పేదల పక్షపాతిగా, కష్టపడే సీఎంగా మన్ననలను పొందుతున్నాడు అంటూ మల్కాజిగిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేరోజు తెలంగాణవ్యాప్తంగా 1.25లక్షల పట్టాలు ఇవ్వడం కేసీఆర్‌కే సాధ్యమయిందని అన్నారు. శుక్రవారం మల్కాజిగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి.. పేదలకు అండగా ఉండే ముఖ్యమంత్రి రావడం మనందరి అదృష్టమని చెప్పారు. పేదలకు కేసీఆర్ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారని అన్నారు. మల్కాజిగిరికి నాలుగుసార్లు వచ్చిన ముఖ్యమంత్రి రూ.330 కోట్లు విడుదల చేశారని తెలిపారు. కష్టపడే సీఎంకు మనమందరం సహకారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరు చూస్తుంటే బంగారు తెలంగాణ కావడం ఖాయమన్నారు. తెలంగాణ వారికి విజ్ఞానం ఎక్కువుందని, వారి మేధస్సు అమోఘమని మల్లారెడ్డి అన్నారు. ఉన్న తెలివిని ఉపయోగించుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అమెరికావలె అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించినపుడు ఎంపీ మల్లారెడ్డి ప్రస్తావించిన పలు అంశాలకు సమాధానాలు ఇచ్చారు. దీనికి ఎంపీ సంతృప్తి చెందినట్లుగా సభలోనే ప్రకటించడం గమనార్హం.

పట్టాల పండుగ ఎన్నో ఏండ్లుగా ఈడనే కూలిపని చేసుకుంట బతుకుతున్నం. ఎప్పుడు గుడిసెలు పీకేస్తారోనని భయం ఉండె. గిప్పుడా భయం పోయింది. మా జాగ మాకే చేసిండ్రు. – కే లక్ష్మి, మధురానగర్, మల్కాజిగిరి

పట్టా ఇచ్చిండ్రు.. నీళ్లు, కరెంటు ఇస్తుండ్రు పట్టా ఇచ్చిండ్రు, నీళ్లు ఇస్తున్నరు, కరెంటు ఇస్తుండ్రు.. మాకు ఉన్న బాధలన్నీ పోతున్నయి. ఈ సారు బస్తీకి వచ్చి మీ ఇల్లు మీకే ఇచ్చుడు కాదమ్మా.. ఇక్కడ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండ్రు. ముందు పట్టా ఇచ్చిండ్రు. ఇల్లు తప్పకుండా కట్టిస్తడని నమ్మకమైంది. – సాలమ్మ, యాదవబస్తీ, మల్కాజిగిరి

కేసీఆర్ సార్ మాట నిలబెట్టుకున్నరు కూలి పనులు చేసుకుంట 15 ఏండ్ల క్రితం 50గజాల స్థలంలో చిన్న రేకుల ఇంటిని కట్టుకుని జీవిస్తున్నం. గవర్నమెంట్ స్థలంలో ఉన్నందుకు ఇల్లు కూల్చేస్త్తరని బస్తీ లీడర్లు ఎప్పుడూ భయపెట్టెటోళ్లు. నల్లగొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడే బతుకుతున్న మాకు ఈ చిన్న ఇల్లు ఒక్కటే ఆధారం. తెలంగాణ వచ్చినంక మాకు పట్టాలిస్తానని చెప్పిన కేసీఆర్ సార్ మాట నిలబెట్టుకున్నరు. -ఇద్దమ్మ, దుర్గాభవానీనగర్, ఫిలింనగర్

నమ్మినందుకు ఫలితం దక్కింది నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి పదేండ్ల కింద ఇక్కడికి వచ్చి స్థలం కొనుకున్నం. పట్టా పేపర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ భయంగా ఉండేది. బస్తీలో ఎవరొచ్చి భయపెట్టినా బెదిరిపోయేటోళ్లం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టా ఇవ్వడంతో మాకు చాలా ధైర్యంగా ఉంది. కేసీఆర్ చెప్పిన మాట నమ్మి దరఖాస్తు చేసుకున్నందుకు ఫలితం దక్కింది. -సావిత్రి, దుర్గాభవానీనగర్, ఫిలింనగర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.