-సంపూర్ణ హక్కులు కల్పిస్తాం -ఆస్తుల క్రయవిక్రయాలకు చాన్స్ -అధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలి -ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ -రెవెన్యూ సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలతో 8 గంటల సమీక్ష

పట్టణాల్లో ఆస్తులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న టైటిల్ హక్కు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఏండ్లుగా నివాసముంటూ ప్రభుత్వానికి బిల్లులు చెల్లిస్తున్న పట్టణ పేదలకు ఆయా స్థలాలపై టైటిల్ హక్కులు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభమయిందన్నారు. పట్టణాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాలవారీగా సమీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామాల కంటే పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తులకు సంబంధించి టైటిల్ సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్నవారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్దఎత్తున ఉపశమనం కలిగించామని.. అయినప్పటికీ కొన్ని కారణాలతో పరిష్కారంకాని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మున్సిపాలిటీల్లోని పేదల కోసం ప్రభుత్వం త్వరలో పూర్తిస్థాయిలో, శాశ్వత పరిష్కారం చూపుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. వ్యవసాయేతర ఆస్తులను 15 రోజుల్లో ధరణి వెబ్సైట్లో నమోదుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. దసరా నుంచి ధరణి వెబ్‌పోర్టల్ ప్రారంభమవుతుందని చెప్పారు.
ఆస్తుల నమోదును పర్యవేక్షించాలి ధరణి వెబ్సైట్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతోపాటు పట్టణాల్లో ఏండ్లుగా పేరుకుపోయి న భూ సంబంధిత సమస్యలను సేకరించి ఇవ్వాలన్నారు. కాలనీలో ఎలాంటి భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? వారి సంఖ్యఎంత? పరిష్కారమేమిటి? తదితర వివరాలను తనకు అందించే సమాచారంలో పొందుపర్చాలని సూ చించారు. వాటన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి శాశ్వతంగా పరిష్కరిస్తుందని కేటీఆర్ హామీఇచ్చారు. పట్టణాల్లో ఏండ్ల తరబడి నివాసముం టూ కరెంట్ కనెక్షన్, ఇంటి పన్ను చెల్లిస్తున్నవారికి ప్రయోజనం చేకూరుస్తామని చెప్పారు. పేదలకు వారికి చెందిన ఆస్తులపై సంపూర్ణ హక్కులు దక్కడంతో భవిష్యత్‌లో క్రయవిక్రయాలకు ఎ లాంటి సమస్యలు ఉండవని తెలిపారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న పట్టణాల్లో నెలకొన్న రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలను కేటీఆర్ వద్ద ప్రస్తావించారు. ఇప్పటికే వారివద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందజేశారు. మంగళవారం సాయంత్రంలోగా అన్ని సమస్యలను పురపాలకశాఖ ఇవ్వనున్నట్టు వారు పేర్కొన్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, డీటీసీపీ విభాగాల ఉన్నతాధికారులు మంత్రు లు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ సహకారమందించాలని కేటీఆర్ఆదేశించారు. సమావేశంలో మంత్రు లు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్నవారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్దఎత్తున ఉపశమనం కలిగించాం. అయినప్పటికీ కొన్ని కారణాలతో పరిష్కారంకాని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాం. మున్సిపాలిటీల్లోని పేదల కోసం ప్రభుత్వం త్వరలో పూర్తిస్థాయిలో, శాశ్వత పరిష్కారం చూపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అంగుళం భూమిని రికార్డులకు ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలి.
-మంత్రి కే తారకరామారావు