పత్తి, పెసర్లకు మద్దతు ధర పెంచాలని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధామోహన్‌సింగ్‌లను రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖల మంత్రి టీ హరీశ్‌రావు కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ బీ వినోద్‌కుమార్‌లతో కలిసి కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో హరీశ్ భేటీ అయ్యారు. పత్తికి మద్దతు ధర, రైతులకు గుర్తింపు కార్డులు, కొనుగోలు కేంద్రాల పెంపు, జిన్నింగ్‌మిల్స్ ఏర్పాటు అంశాలపై స్మృతిఇరానీతో చర్చించారు. తెలంగాణలో ఈ ఏడాది 25 నుంచి 30 లక్షల టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 83 కొనుగోలు కేంద్రాలు సరిపోవని, వీటిని 143కు పెంచాలని కోరారు. కొనుగోలు కేంద్రాలు వారానికి ఆరురోజులు పనిచేసేలా చూడాలన్నారు. మంత్రి విజ్ఞప్తిపై స్పందించిన స్మృతిఇరానీ 15న కేంద్ర టెక్స్‌టైల్స్‌శాఖ కార్యదర్శిని తెలంగాణకు పంపిస్తామని హామీఇచ్చారు.