-తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయి.. -పరకాల నియోజకవర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

పట్టుదలతో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిపిందామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పరకాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ములుగురోడ్‌లోని కేఎస్‌ఆర్ గార్డెన్‌లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని అన్నారు.
జిల్లా వాసి అయిన రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం పరకాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ముందుండాలన్నారు. తెలంగాణలో చంద్రబాబుకు నూకలు చెల్లినందునే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలో టీడీపీ బాగుందని చెబుతూ చంద్రబాబు నుంచి డబ్బు మూటలు తీసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏపీ నుంచి న్యాయపరంగా రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్ వాటాను చంద్రబాబు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
రాష్ర్టానికి 1130 మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉందని, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబును ఒప్పించి విద్యుత్‌ను తీసుకురావాలని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు. బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు దయాకర్‌రావుకు లేదన్నారు. ఎన్నికల్లో హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారుల విభజన పూర్తిగా జరగలేదు.., జరిగిన వెంటనే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.
మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పరకాల నియోజకవర్గంలో పల్లా గెలుపునకు ప్రత్యేకంగా కమిటీలను నియమించి క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తామన్నారు.
తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ అయినందు నే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను జిల్లా వాసినేనని, తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించానని గుర్తుచేశారు. తనను ఆదరించి ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు.
ఎమ్మెల్సీగా గెలుపొందిన వెంటనే పట్టభద్రుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం అందరం సమష్టగా పనిచేద్దామన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కన్నెబోయిన రాజయ్యయాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మర్రి యాదవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్‌రావు, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, కోల జనార్దన్‌రెడ్డి, లింగంపెల్లి కిషన్‌రావు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ వాసుదేవరెడ్డి, నియోజకవర్గ నాయకులు చింతం సదానందం, ధర్మరాజు, నిమ్మగడ్డ వెంకన్న, టీఆర్‌ఎస్వీ జిల్లా కార్యదర్శి అర్షం మధుకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.