Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేద విద్యార్థులకు సర్కారు భరోసా

-బకాయిల్లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ -ఈ ఏడాది 2,445 కోట్లు మంజూరు -ఫిబ్రవరిలోగా దరఖాస్తు చేసుకోవాలి -స్కాలర్‌షిప్‌లను భారీగా పెంచాం -అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్

రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత చదువుల పట్ల సర్కారు భరోసా కల్పిస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంటుపై లఘుచర్చ సందర్భంగా మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. గతంలో పురుగుల అన్నం, నీళ్లచారు తినలేక అవస్థలు పడిన పరిస్థితులు తెలంగాణ వచ్చాక మాయమయ్యాయని, ఇప్పుడు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో తల్లిదండ్రులకు ఆత్మైస్థెర్యం కల్పించామన్నారు. 2017-18లో రూ.860 కోట్లు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు జరిపామని, ఇటీవల 1585కోట్లు (మొత్తం రూ.2445కోట్లు) మంజూరు చేశామని వెల్లడించారు. గతేడాదికి సంబంధించి బకాయిలు లేకుండా, 2017-18 విద్యాసంవత్సరానికి రీయింబర్స్‌మెంటు నిధులు అందుబాటులో ఉంచినట్టు వివరించారు. కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి.. ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు, యాజమాన్యాలకు తప్పుడు సంకేతాలిచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం తగదని చెప్పారు. అడ్మిషన్ల కాలపరిమితిలో తేడావల్ల కొన్ని ఇబ్బందులున్నా సకాలంలో చెల్లింపులకు చర్యలు చేపట్టామన్నారు.

ఆయా విద్యాకోర్సులను బట్టి అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ వరకుకొనసాగుతుందని, ఈ పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకోసం విద్యార్థులు ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుందని తెలిపారు. కళాశాల అనుబంధ వసతి గృహ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ.900 నుంచి రూ.1500కు, ఇంటర్ విద్యార్థులకు రూ.520 నుంచి రూ.750కి పెంచామన్నారు. అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఆర్థికసహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. బీసీ-ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులకు ఒకే విధానంతో ఫీజుల చెల్లింపుపై సభ్యుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడే సత్తా లేక అసెంబ్లీ నుంచి పారిపోతున్నారని ఈటల ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి. దౌర్భాగ్యం అంటూ.. కాంగ్రెస్ సభ్యుడు సంపత్ వ్యాఖ్యలు చేయడం సంస్కారహీనమని ఈటల అన్నారు.

పౌరసరఫరాలశాఖను పటిష్ఠపరుస్తాం పౌరసరఫరాలశాఖను పటిష్ఠపరిచేందుకు అనేక సంస్కరణలను తీసుకొస్తున్నామని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గంగాధర్‌గౌడ్, భూపాల్‌రెడ్డి, రాజేశ్వరరావు, యాదవరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానాలు చెప్పారు. పౌరసరఫరాలలో నగదుబదిలీ ప్రస్తావనేలేదని పేర్కొన్నారు. బియ్యం దారిమళ్లకుండా తనిఖీ బృందాలను ఏర్పాటుచేశామని, ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. రేషన్‌షాపుల ద్వారా దొడ్డు బియ్యమే సరఫరా చేస్తామని, డీలర్ల కమీషన్ పెంచే ఆలోచన ఉన్నదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రేషన్‌షాపులను బంద్‌చేసే ఆలోచనలేదని స్పష్టంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.