Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదల మనిషి

-ప్రజాసేవకే నోముల జీవితం అంకితం
-హుందాతనానికి ఆయన మారుపేరు
-తెలంగాణపై నిబద్ధత ఉన్న నాయకుడు
-ప్రాంతం కోసం సీపీఎంనే ధిక్కరించారు
-రాష్ట్ర అభివృద్ధి కోసమే నిత్యం తపన
-నోములకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళి
-8 మంది మాజీ సభ్యులకు సభ సంతాపం
-నేటికి వాయిదాపడిన అసెంబ్లీ సమావేశం

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పేదల పక్షపాతి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం మొదలుకాగానే సీఎం కేసీఆర్‌ నోముల మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థిగా, న్యాయవాదిగా, కమ్యూనిస్టు నాయకుడిగా, శాసన సభ్యునిగా నోముల నిరంతరం ప్రజాసేవలోనే గడిపారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నోముల నర్సింహయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

ఇలా జరుగుతుందనుకోలేదు
ఇట్లాంటి దుఃఖకరమైన, బాధాకరమైన సంతాపం నేనే ప్రవేశపెట్టాల్సి రావడంపై బాధపడుతున్నాను. ఈ సందర్భం వస్తుందని అనుకోలేదు. నర్సింహయ్య వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరి మిత్రులు. చాలా ఏండ్లు ఆయనతో కలిసి పనిచేసినం. తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉధృతంగా కొనసాగించే సమయంలో ఆయన ఎన్నో సందర్భాల్లో బాధపడేవారు. ‘మాకు మనసులో ఉన్నదన్నా.. చాలా సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి ఉన్నాం. మా మనసులు బాధ పడుతున్నాయి’ అని శాసనసభలో, బయట కలిసినప్పడు చెప్పేవారు. ‘సరే మీరు పోరాటం చేస్తున్నారు కదా.. ఏదో ఒక బాయిలింగ్‌ పాయింట్‌లో మేమూ జాయినవుతాం’ అని చెప్పేవారు.

మోసపోతమనుకోలేదు
‘కమ్యూనిస్టు పార్టీల్లో ఇట్లాంటి చాలామంది మిత్రులున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ఒక పెద్ద మనిషి రాజిరెడ్డి ఒక సందర్భంగా నేను ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళుతుంటే, నేను ట్రైన్‌లో ఉన్నానని తెలుసుకొని చాలా బోగీలు దాటుకొని నా దగ్గరకు వచ్చి, నా చుట్టూ ఉన్న మిత్రులందరినీ పలకరించి, నన్ను పలకరించారు. ‘ఇంత అన్యాయం జరుగుతదని అనుకోలేదు బిడ్డ! విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తది.. ఏదో ఒరుగుతదని ఆశించాం. కానీ ఇట్ల మోసపోతమని అనుకోలేదు. పాతవి చాలా పత్రికలున్నయి.. అవన్నీ మీకు పంపిస్త. అనలైజ్‌ చేయండి. మాట్లాడండి. మొదలుపెట్టిన ఉద్యమాన్ని మాత్రం విడవద్దు’ అని చెప్పారు. రాజిరెడ్డికి పెద్దాయనని దండంపెట్టి, మీరు కూడ రావాలన్నా. కలిసిరాకపోతే కలువదని నేను చెప్తే.. ‘మీరు నడవండి.. మీవెంట మేమున్నాం’ అని ఆయన చెప్పారు. అలాగే నర్సింహయ్య కూడా అనేక సందర్భాల్లో అన్నారు. నర్సింహయ్య గురువు నర్రా రాఘవరెడ్డి అక్కడ కూర్చొని (నర్రా రాఘవరెడ్డి సభలో కూర్చునే చోటు చూపిస్తూ) అద్భుతమైన సామెతలు చెప్తూ ప్రజా సమస్యలపై మాట్లాడేవారు. ఆయన ప్రజలవ్యక్తి. ఆ రాఘవరెడ్డి శిష్యుడే నోముల నర్సింహయ్య. రాజకీయంగా అతనికి అవకాశమిచ్చి, తన సీటులో నిలుచోబెట్టి గెలిపించాడు.

సొరంగం వద్దు.. కాలువ తవ్వాలన్నాం
ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న సమయలో.. ఎస్సెల్బీసీ కాలువ తవ్వాలని, సొరంగం వద్దని మా అందరి అభిప్రాయం. కానీ ఆ రోజు మా మాటకు విలువలేదు. అఖిలపక్ష సమావేశమని పిలిస్తే రాఘవరెడ్డి పోయి ఒప్పుకొని వచ్చారు. ఆయన వెంట నర్సింహయ్య కూడా వెళ్లారు. అప్పుడు తెలంగాణ యువ శాసనసభ్యులమంతా కోపానికి వచ్చినం. ‘అన్నా రాఘవన్న.. నువ్వెట్ల ఒప్పుకున్నవే నాకర్థం కాలేదు..’ అని అడిగితే.. ‘ఏమో ఏమి చేయాలే! ఆయిటిపాముల కాడ ఈ కాలువ దాటుతదంటే ఒప్పుకున్న. మూసీ ప్రాజెక్టులకు నీళ్లు వస్తయంటే బతికున్నప్పుడు చూస్తానని ఒప్పుకున్న’ అన్నడు. మా మిత్రుడు జగదీశ్‌రెడ్డికి పదేపదే ఈ విషయం చెప్తా ఉంటాను. ‘ఇదంతా ఎందుకు? రాఘవన్నా తెలంగాణ కోసం పోరాడుదాం రారాదు’ అంటే.. ‘ఇక కానిస్తారు బిడ్డా ఇప్పుడు!’ అన్నారు. ఇదే విధమైనటువంటి భావన ఉన్న వ్యక్తి నర్సింహయ్య. ఆయనకు ఎటువంటి బీమారి లేదు. వయసులో నాకంటే ఏడాది చిన్నవాడని అనుకుంటున్నా. ఆ రాత్రి కుటుంబసభ్యులతో మాట్లాడిన. అంత్యక్రియలకు పోతే జబ్బులేదు, ఏమి లేదన్నరు. కరోనా వచ్చి పోయింది.. బాగనే ఉండిరి. ఓ ఉదయం ఇలాంటి దుర్వార్త వచ్చింది. చాలా బాధపడ్డం. ఈ తీర్మానం నేను ప్రవేశపెట్టడం నా దురదృష్టంగా భావిస్తున్న. తప్పదు విధి బలీయమైనది కాబట్టి సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్న’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం పలువురు సభ్యులు నోములతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం
ఇటీవలికాలంలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్‌, నాయిని నర్సింహారెడ్డి, కమతం రామిరెడ్డి, కటికనేని మధుసూదన్‌రావు, కట్టా వెంకటనర్సయ్య, దుగ్యాల శ్రీనివాసరావు, చెంగల్‌ బాగన్న, కే వీరారెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. వారి సేవలను కొనియాడారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదావేశారు.

నోములతో 8 ఏండ్ల అనుబంధం: మంత్రి కేటీఆర్
‌ నోములతో తనకు ఎనిమిదేండ్ల అనుబంధమున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి నోముల ఎన్నికయ్యే వరకు అక్కడ మున్సిపాలిటీలు లేవని చెప్పారు. 15 వేల పైచిలుకు జనాభా ఉంటే, ప్రతి మేజర్‌ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత నందికొండ, హాలియా మున్సిపాలిటీలయ్యాయని చెప్తూ.. ఈ విషయంలో నోముల ప్రత్యేక శ్రద్ధ చూపించారన్నారు. అణగారిన వర్గాలకోసం గొంతు విప్పిన నాయకుడిగా రాష్ట్రమంతటా నోములకు పేరుందని చెప్పారు. ఆయన మరణం నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికే కాదు, నల్లగొండ జిల్లాలోని బలహీనవర్గాల ప్రజలకు, తమ పార్టీకి కూడా తీరని లోటన్నారు. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం పరితపించిన వ్యక్తి నోముల నర్సింహయ్య అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సాయుధ పోరాటానికి కొనసాగింపుగా, నర్రా రాఘవరెడ్డి ఆశయాలను పుణికి పుచ్చుకొని, నల్లగొండ జిల్లాలో భూస్వామ్య, పెత్తందారీ వ్యతిరేక ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. రైతాంగానికి వ్యవసాయంలో లాభం వచ్చేలా చేయాలని చెప్పేవారన్నారు. నోముల జీవితాంతం పేదల కోసం పరితపించిన వ్యక్తి అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళులర్పించారు. దేశంలో సీఎం కేసీఆర్‌ ఒక్కరే గొల్లకురుమల్లో ఐదు గురు ఎమ్మెల్యేలను, ఒక రాజ్యసభ స్థానాన్ని కల్పించటం చాలా గొప్ప విషయంగా నోముల ఎప్పుడూ చెప్తుండేవారని గుర్తుచేసుకున్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ గొల్ల కురుమలకు పదెకరాల స్థలమిచ్చినప్పుడు మాట్లాడిన సందర్భంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతగా సీఎం కేసీఆర్‌ను నోముల కీర్తించారని గుర్తుచేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ నోములతో కలిసి అనేక పోరాటాలు చేశామని గుర్తుచేసుకొన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ.. సాగర్‌ నియోజకవర్గంలో లంబాడాలకు, యాదవ సోదరులకు అవినాభావ సం బంధం ఉండేదని.. ‘గ్వోర్‌ భాయ్‌, గొలావరన్‌.. భాయ్‌ భాయ్‌’ అనేవారని గుర్తుచేసుకొన్నారు. ఎమ్మెల్యేలు జాఫర్‌ హుస్సేన్‌, పోదెం వీరయ్య, సండ్ర వెంకటవీరయ్య, చిరుమర్తి లింగయ్య, రాజాసింగ్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, జైపాల్‌ యాదవ్‌ తదితరులు నోములకు నివాళి అర్పించారు. అనంతరం నోములకు సంతాప సూచకంగా సభ రెండునిమిషాలు మౌనం పాటించింది.

నోములను చూసి నేర్చుకోవాలి ఉద్యమశీలి, ప్రజానాయకుడు నోముల నర్సింహయ్య సమాజ శ్రేయస్సుకోసం నిరంతరం తపించిన వ్యక్తి. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే వారి జీవితాన్ని అంకితంచేశారు. 1956, జనవరి 9న నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం, పాలెం గ్రామంలో పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల.. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలోనూ పేదలపక్షం వహించి, ప్రజల న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. కమ్యూనిస్టు దృక్పథం కలిగిన నర్సింహయ్య సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు. తన ఆశయాలకు అనుగుణంగా సీపీఎంలో చేరారు. నకిరేకల్‌ ఎంపీపీ అధ్యక్షుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభాపక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది. శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడేలా సామెతలు, ఛలోక్తులతో కూడిన నోముల నర్సింహయ్య ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించేవి. ప్రతిపక్ష నేతగా, శాసనసభలో ఎలా వ్యవహరించాలో, హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో, ప్రజల సమస్యలను ప్రభావ పూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో నేటితరం నాయకులు నోములను చూసి నేర్చుకోవాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ రైతుల ప్రయోజనాల కోసం నర్సింహయ్య నిరంతరం పోరాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. సీపీఎంకు విశేష సేవలందించిన నోముల నర్సింహయ్య, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో టీఆర్‌ఎస్‌ తరఫున నాగార్జునసాగర్‌ నుంచి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి చివరిశ్వాస వరకు కృషిచేశారు. నోముల.. బడుగువర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు. 64 ఏండ్ల వయస్సులో గత డిసెంబరులో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు, టీఆర్‌ఎస్‌కు తీరని లోటు. ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నర్సింహయ్య తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు. వారి ఆత్మీయతను, విలువల పట్ల వారి నిబద్ధతను నేనెప్పటికీ మరువలేను. నిజమైన ప్రజానాయకుడిగా నోముల నర్సింహయ్య తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ సభ తీర్మానిస్తున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.