Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదలందరికీ బంధువవుతా..

-దళితబంధు.. దళితుల దగ్గర్నే ఆగదు
-అన్ని వర్గాల్లోని పేదలకూ ఇస్తాం
-ఆ శక్తి, యుక్తి టీఆర్‌ఎస్‌కే ఉన్నది
-పూర్తి అవగాహనతోనే దళితబంధు
-కాంగ్రెస్‌, బీజేపీ ఢిల్లీ గులాములు
-వారితో ఇలాంటి పథకం అయితదా?

ఈ గులాములు అధికారంలోకి వస్తే.. సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌
టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు

9వ సారీ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవం
భేషజాలు వదిలిపెట్టి.. నా మాటను గౌరవించి, వారికి ఉన్న పదవులను కూడా వదులుకొని.. నాతో కలిసి నడిచి, తెలంగాణ రాష్ట్రం తేవడంలో, ఇంత గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందు నిలిచిన టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులకు, మండలి సభ్యులకు, ఎంపీలకు, వివిధ స్థాయిలలో పనిచేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.

ఏయే రంగాల్లో తెలంగాణ దెబ్బతింటదని చెప్పారో.. అదే రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా వేనోళ్ల కొనియాడబడుతున్నది. తెలంగాణ పథకాలను దేశమంతాకాపీ కొడుతున్నారు. తెలంగాణ పథకాలు మాకూ పెట్టాలని, లేదంటే మమ్మల్ని తెలంగాణలో కలపాలని ఇతర రాష్ర్టాల ప్రజల నుంచి డిమాండ్‌ వస్తున్నది.

టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు
దళితబంధు పథకం ఇక్కడితోనే ఆగదని, మిగతా వర్గాల్లోని పేదలకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 6,500 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ దళితులు అట్టడుగున ఉన్న సామాజికవర్గం కాబట్టి.. వాళ్ల కన్నీళ్లు తుడిచేందుకు ముందుగా వారికి అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని వర్గాలకు దళితబంధు తరహా పథకం అమలు చేసే శక్తి, యుక్తి గల పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రమేనని అన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

దళితబంధు దగ్గర్నే ఆగదు
అట్టడుగున ఉన్న, వేల సంవత్సరాల వివక్షకు గురైన సామాజికవర్గం కాబట్టి.. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వర్గం కాబట్టి అతి తక్కువ అవకాశాలు, అతి తక్కువ భూమి కలిగి ఉన్న జాతి కాబట్టి. ఆ జాతి కన్నీళ్లు తుడవడానికి దళితబంధుతో ప్రారంభమైనాం. రూ.23 లక్షల కోట్లలో రూ.1.70 లక్షల కోట్లు దళితబంధుకు పోతే.. మిగతా వర్గాల్లోని పేదలకు కూడా కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటిస్తది. ఒక సంవత్సరం అటూఇటూగా అన్ని కులాల్లో, అన్ని సామాజిక వర్గాల్లోని పేదలను తీర్చిదిద్ది.. దళితబంధు వంటి కార్యక్రమాన్ని అమలుచేస్తాం. ఇలా ఇచ్చే శక్తి, యుక్తి ఉన్న రాజకీయ వ్యవస్థ టీఆర్‌ఎస్‌ మాత్రమే. దళితబంధును తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రారంభించలేదు.. ఏడు సంవత్సరాల తర్వాత తెలంగాణకు అవసరమైన కరెంటు, నీళ్లు, వ్యవసాయం తదితర మౌలిక రంగాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చుకొన్న తర్వాత, రాష్ట్రం ఆర్థికంగా పటిష్ఠపడిన తర్వాత, స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యంతోని, సంపూర్ణమైన అవగాహనతోని, శక్తితోని చేపట్టిన ఉద్యమం దళితబంధు. రాష్ట్ర ప్రజానీకానికి మీ బిడ్డగా మనవి చేస్తున్నా. నేను ఏది జరుగుతదని చెప్పిన్నో అది జరిగింది. దళితబంధు దళితబంధు దగ్గర్నే ఆగదు. రాష్ర్టానికి వచ్చే సంపద వేరెవరికో ఇవ్వరు. మన కండ్లల్లో ఉన్న కన్నీరు ఎవరో తుడవరు. మన దళితజాతిని మనమే ఉద్ధరించుకోవాలి. ఆ పేదలను మనమే కాపాడుకోవాలి. దళితబంధుతోపాటు గిరిజనుల్లోని నిరుపేదలను, బీసీ, ఎంబీసీ వర్గాల్లోని నిరుపేదలు, రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న నిరుపేద వర్గాలకు మీ బిడ్డగా హామీ ఇస్తున్నా. దళితబంధుతోపాటు మిగతా వర్ణాలకు కూడా చేయగలిగే శక్తి, యుక్తి ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉన్నదని మనవి చేస్తున్నా.

ఢిల్లీ గులాములు చేయగలరా?
ఈ కిరికిరి గాళ్లు, కిరాయి గాళ్లు, ఢిల్లీ గులాములు ఈ పని చేయలేరు. దళితబంధు వంటి కార్యక్రమాన్ని చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీల్లాంటి ప్రభుత్వం ఉంటే చేయగలుగుతదా? వాళ్లకు ఢిల్లీ పర్మిషన్‌ ఇస్తదా? ‘ఒక్క తెలంగాణలో ఎట్ల చేస్తరండీ? చేస్తే దేశమంతా చేయాలి గదా.. షటప్‌’ అంటరు. ఈ గులాములు అధికారంలోకి వస్తే, సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌.. అదీ వీళ్ల బతుకు. కాంగ్రెస్‌, బీజేపీలను నేను అడుగుతున్నా.. చేసేందుకు మీకు అవకాశం లేకుండెనా? మీకు ఇయ్యలేదా అవకాశం? 75 ఏండ్ల స్వాతంత్య్ర కాలంలో మీరే కదా పరిపాలకులు? ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా మీ పెత్తనమే కదా? ఎందుకు మీరు ఈ ఆలోచన చేయలేదు? ఈ కార్యక్రమానికి మీరు ఎప్పుడో శ్రీకారం చుట్టి ఉంటే ఇయ్యాల మేం చేసే అవసరం ఏం వచ్చేది? మీరు ఎవరికీ చేయలేదు.. తూతూ మంత్రంగా ప్రజలను ఓటు బ్యాంకుగా భావించి, ఎమోషన్లను రెచ్చగొట్టి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందారే తప్ప పేదరికం శాశ్వత నిర్మూలన కోసం.. దళితుల్లో పేదరికాన్ని తీసేయడం కోసం మీరు ప్రయత్నాలు చెయ్యలేదు. నేను ఒక విజన్‌తో చెప్తున్నా. దళితబంధుపై మనం పెడుతున్న పెట్టుబడి ఇది. సబ్సిడీ కాదు.. వ్యర్థమయ్యేది కాదు. దళితజాతి బిడ్డల్లో కూడా అనేక రత్నాలు, డైమండ్స్‌ ఉన్నాయి. అవకాశమిస్తే వారిలో నుంచి అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది. అది రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి కూడా విశేషమైన తోడ్పాటును అందిస్తది. మనం పెట్టే రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడి రూ.10 లక్షల కోట్ల ఆస్తిని ఈ రాష్ర్టానికి సమకూర్చి పెడుతుంది. సంపద సృష్టి జరుగుతుంది.

అవాకులు చవాకులు పేలుతున్నరు
చాలామంది తెలియని వాళ్లు.. కిరికిరి గాళ్లు, అరకొర అవగాహన ఉన్నవాళ్లు అక్కడక్కడ అవాకులు, చవాకులు పేలుతున్నారు. తెలంగాణ సమాజానికి నేనొక్కటే మనవి చేస్తున్నా. రేపటి ఉజ్వల తెలంగాణ సాధ్యం కావాలంటే.. ఏది సాధించాలన్నా ఎవరికి న్యాయం జరగాలన్నా.. అద్భుతమైన నాయకత్వ పటిమ కావాలి. దీక్షతో, దృఢ సంకల్పంతో పనిచేసే గొప్ప సైన్యం ఉన్న రాజకీయపార్టీ కావాలి. ఆ పార్టీ శ్రేణులు కూడా అదేవిధంగా ఉండాలి. టీఆర్‌ఎస్‌ అట్లా ఉన్నది కాబట్టే.. వ్యవసాయం, కరెంటు, ఐటీ, సంక్షేమం, పరిశ్రమలు, మంచినీరు.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ.. దేశం కన్నా ముందు పరిగెడుతున్నది. దేశం వెనక్కి ఉన్నది.. మనం ముందుకున్నాం.

వచ్చే ఏడేండ్లలో రూ.23 లక్షల కోట్లు
దళితబంధు పథకం వందకు వంద శాతం సంపూర్ణంగా విజయం సాధించే పథకం. దీనికి మనం పెట్టుకొన్నది చాలా చిన్న డబ్బు. అంతా కలిస్తే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నట్లు తేలింది. పెరిగితే మరో లక్ష రెండు లక్షల కుటుంబాలు పెరుగొచ్చు. మొత్తంగా రూ.1.70 లక్షల కోట్లు లేదా రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు అవుతది. ఇది నా పాండిత్యం కాదు. నా కవిత్వం కాదు. ఎకానమిస్టులు, రాష్ట్ర ఆర్థికశాఖ, కేంద్ర గణాంక శాఖలు తేల్చిన లెక్కలు. ఈ టర్మ్‌లో మిగిలిన రెండు సంవత్సరాలు, వచ్చే టర్మ్‌లోని ఐదు సంవత్సరాలు కలిపితే వచ్చే ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం పెట్టబోయే ఖర్చు రూ.23 లక్షల కోట్లు. 2028 నాటికి మన వార్షిక బడ్జెట్‌ రూ.4.28లక్షల కోట్లు ఉంటుంది. ఇప్పుడు రూ.2.37 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2028లో రూ.7.76 లక్షలకు చేరుతుంది. ఇది కాబోయే తెలంగాణ. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈ ఉజ్వల ప్రస్థానం ముందుకు కొనసాగబోతున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.