Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదల ఇండ్లలో పాలుపొంగిన సంబురం

ఇండ్లళ్లకు పొయ్యిన ఎర్రవల్లి, నర్సన్నపేట స్వయంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇది తొలి అడుగు ఇక అంతటా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎదగాలి పేదల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం నగదురహిత గ్రామాలుగా ఎర్రవల్లి, నర్సన్నపేట నంబర్‌వన్ నగదురహిత రాష్ట్రంగా తెలంగాణ సామూహిక గృహప్రవేశాల్లో సీఎం కేసీఆర్

cm-kcr-participated-in-house-warming-ceremony-in-eravalli-and-narsannapet-villages

గడపలకు పసుపు.. దర్వాజలకు మామిడి తోరణాలు.. ఇండ్ల నిండా చుట్టాలు! కొత్త బట్టలు కట్టుకున్న కుటుంబాలు.. ఎటుచూసినా పండుగ శోభ! శుక్రవారం పూట.. వెలుగు కిరణాలు తాకుతున్న వేళ.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలకు ఇది నవోదయం! డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి ఇది తొలి అడుగని, ఇకపై అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయంపాలిత, స్వయం సహాయక, స్వయం సమృద్ధిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పేదలకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఉచిత డబుల్ బెడ్‌రూం ఇండ్ల గృహప్రవేశాలను ముఖ్య మంత్రి శుక్రవారం ఉదయం 7.15 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 7.53 గంటలకు అన్ని ఇండ్లలోకి గృహప్రవేశాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. హిందువులు పూజలు, వ్రతాలు నిర్వహించుకోగా.. ముస్లిం, క్రైస్తవ కుటుంబాలు తమ పద్ధతుల్లో ప్రార్థనలు చేశాయి. తొలుత ఎర్రవల్లి గ్రామ సమీపంలో నిర్మించిన కల్యాణమంటపాన్ని ప్రారంభించి, అక్కడ పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. గృహప్రవేశాల అనంతరం ముఖ్యమంత్రి గ్రామమం తా కలియదిరుగుతూ లబ్ధిదారులను పలుకరించారు. ఎర్రవల్లి గ్రామం రచ్చబండ వద్ద కూర్చొని కాసేపు ముచ్చటపెట్టారు. అనంతరం ఎర్రవల్లి కల్యాణమంటపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎర్రవల్లి, నర్సన్నపేటలను నగదు రహిత గ్రామాలుగా ప్రకటించారు.

రెండుగ్రామాలకు సంబంధించిన కిరాణా, సెలూన్, చికెన్ షాపుల యజమానులకు స్వైపింగ్ యంత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, గృహప్రవేశాలు చేసిన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలకు సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌ను నగదు రహితంగా మార్చడంలో మంత్రి హరీశ్‌రావు కృషి అభినందనీయమని చెప్తూ, అదే స్ఫూర్తితో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు నగదు రహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలువాలని కోరారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచేలా అం దరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం దేశంలోనే ఓ గొప్ప ముందడుగని సీఎం కేసీఆర్ చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో బతుకాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో దాదాపు 600 ఇండ్లకు ఒకేసారి గృహప్రవేశాలు చేయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేశామని చెప్పారు.

ఇప్పటివరకు మనం ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమేనని, ఇదే స్ఫూర్తితో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో ముందుకుపోదామని సీఎం పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీల అమలులో ముందడుగు సాధించాలని, బంగారు తెలంగాణకు బాటలు వేసేలా ఎర్రవల్లి, నర్సన్నపేట ఉండాలని, ఈ రెండు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర సాగునీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, జేసీ హన్మంతరావు, జెడ్పీటీసీ ఎంబరి రామచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, నర్సన్నపేట సర్పంచ్ బాల్‌రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.