Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదలకు కడుపు నిండా తిండి పెట్టాలనేదే ధ్యేయం

-అర్హులందరికీ అహార భద్రత కార్డులు ఇస్తాం -జనవరి 1న రాష్ట్రవ్యాప్తంగా పథకం ప్రారంభం -సంక్షేమ హాస్టళ్ళకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం -ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి ప్రాధాన్యత -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్

Etela Rajendar ఉద్యమ సమయంలో గమనించిన పేద ప్రజల కష్టాలు, కన్నీళ్ల నేపథ్యంలోంచే తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. పేద ప్రజలందరికీ కడుపు నిండా తిండి పెట్టాలనే సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలోంచి ఆహార భద్రత కార్డుల పథకం ఆవిర్భవించిందని చెప్పారు. భావి భారత పౌరులైన విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలనే ఆశయం తో సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేపడుతున్నామన్నారు. ఈ రెండు పథకాలు జనవరి1 నుంచి అమలు జరుగుతాయని చెప్పారు. సోమవారం నమస్తే తెలంగాణకు ఈటెల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

నమస్తే తెలంగాణ: ఆహార భద్రత కార్డుల ఉద్దేశం ఏమిటి? మంత్రి ఈటెల: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మేథోమథనంలో నుంచి పుట్టింది ఈ పథకం. రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కడుపు నిండా తిండి పెట్టాలన్న ఆశయంలోనుంచి ఆహార భద్రత కార్డుల పథకం రూపుదిద్దుకుంది. గత ప్రభుత్వాలు పేదలకు బియ్యాన్ని మొక్కుబడిగా అందించేవి. అందులోనూ సవాలక్ష నిబంధనలు. చాలీచాలని సరుకులు. ఉద్యమాల సందర్భంగా పేదల కష్టాలను మా నాయకుడు స్వయంగా చూశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించాం. 20 కిలోల సీలింగ్‌ను ఎత్తివేశాం. ఒక్క మనిషికి 4 కిలోల నుంచి 6 కిలోలు చేశాం.రూపాయి కిలో విధానం కొనసాగించాం. ఈ పథకాన్ని జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం.

ప్రశ్న: కార్డులు తొలిగిస్తారనే ప్రచారం.. ఏ మాత్రం నిజం లేదు. అర్హత ఉన్న వారందరికీ కచ్చితంగా కార్డులు అందుతాయి. సంక్షేమ పథకాలు వీలైనంత ఎక్కువ మందికి చేరాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకే కదా కార్డుల ఆదాయపరిమితిని గతం లో కన్నా భారీగా పెంచింది. అందుకే కదా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయ పరిమితి 60 వేలు ఉంటే ఇపుడు లక్షా 50 వేల రూపాయలకు, పట్టణ ప్రాంతాల్లో 75 వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచింది. ప్రజల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం కావాలా? మీరన్నట్టు కార్డులు తొలిగిస్తారని కొంతమంది కావాలని ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు.. వాటిని పట్టించుకోరనే నమ్మకం ఉంది.

ప్రశ్న: విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం తినిపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచనకు బీజం పడింది… ఉద్యమ సమయంలోనే. కేసీఆర్ 14 సంవత్సరాలుగా ఉద్యమం నడిపించారు. ఆ క్రమంలో ఎప్పుడూ జనంతో, వారి జీవితాలతో మమేకమయ్యారు. ప్రజల బాధలు, ఆ కాంక్షలూ ఆయనకు బాగా తెలుసు. అందుకే సన్నబియ్యం పథకం వచ్చింది. ఆ మాటకు వస్తే నేను కూడా సంక్షేమ హాస్టళ్లో ఉండి చదువుకున్నవాడినే. ముక్కిపోయిన దొడ్డు బువ్వ తినలేక విద్యార్థులు పడే అవస్థలు నాకు తెలుసు. హాస్టళ్లలో ఉడికీ ఉడకని బియ్యం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించింది. బంగారు తెలంగాణలో భావి భారత పౌరుల ఎదుగుదల సంపూర్ణంగా ఉండాలి. అందుకే మా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ళతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ సన్నబియ్యంతో పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని కూడా జనవరి 1 నుంచే ప్రారంభిస్తున్నాం. సన్నబియ్యం పథకం కేవలం విద్యార్థులకు మాత్రమేనని స్పష్టం చేస్తున్నా.

ప్రశ్న: ఈ రెండు పథకాలకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేయబోతోంది? దాదాపు రూ.2 వేల కోట్లు. గత ప్రభుత్వాలు కేవలం రూ. 940 కోట్లు ఖర్చు చేశాయి. వాటితో పోలిస్తే..టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆహార భద్రత కార్డుల బియ్యంతోపాటు, హాస్టళ్లకు, మధ్యాహ్నభోజన పథకానికి భారీగా ఖర్చుపెట్టబోతోంది. పేదలకు బియ్యం అందచేయడంలో ఖర్చుకు వెనకాడడం అనేది ఉండదు.

ప్రశ్న: అర్హులకు ఆహార భద్రత కార్డు అందకపోతే..వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇస్తారా? ఒక్కమాట గట్టిగా చెప్పగలను. అర్హులు అందోళన పడాల్సిన అవసరం లేదు. వారికి అన్యాయం జరుగదు. అసలు మీరంటున్న పరిస్థితే రాదని నా నమ్మకం. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేయాలన్నాం. అయినా..దురదృష్టవశాత్తు ఎక్కడైనా ఒకటో రెండో కార్డులు మిస్సయితే.. అధికారుల దృష్టికి తీసుకువస్తే అప్పటికప్పుడు కార్డు అందచేస్తారు. మరో విషయం..కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఎక్కడా ఆపివేయడం ఉండదు. గత ప్రభుత్వాల మాదిరిగా గడువులోపే ఇస్తామని కంప్యూటర్ మూసివేసుకునే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉండదు.

ప్రశ్న: ఆహార భద్రత కార్డుల రంగులో మార్పు ఉండబోతుందని విన్నాం. నిజమేనా? నిజమే.. ఇకపై ఆహార భద్రత కార్డులు గులాబీ రంగులో ఉంటాయి. వీటిపైనే పేదలకు బియ్యం ఇస్తాం. అలాగే ..ఆహారభద్రత కార్డులు కేవలం బియ్యం కోసమే పనికివస్తాయి.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్ వంటి వాటికి ఉపయోగపడవు. ప్రజలు గుర్తించాలి. ప్రభుత్వాన్ని ప్రతిబింబించేలా గులాబీ కార్డులు పేదల కార్డులుగా మా ప్రభుత్వంలో ఉంటాయి.

ప్రశ్న: గతంలో అక్రమాలు జరిగాయి. బియ్యం పక్కదారి పట్టాయి. ఈసారి ఎలా అరికడతారు..? మా పాలనలో పారదర్శకత ఉంటుంది. అక్రమాలకు ఆస్కారం ఇవ్వకుండా అనేక చర్యలు తీసుకున్నాం. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి లబ్ధిదారునికి చేరే వరకు పక్కా నిఘా ఉంటుంది. ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు, డీలర్లకు కమిషన్ పెంచబోతున్నాం. అలాగే కార్డుల రేషనలైజేషన్ చేసి డీలర్లకు సమానంగా కార్డులు ఉండేలా చర్యలు చేపడుతాం. మిల్లింగ్ చార్జీలు పెంచాం. అయినా తప్పు జరిగితే అక్రమాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.