Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదలందరికీ పెళ్లికానుక

ప్రజల దీవెనలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలే తమ ప్రభుత్వానికి దేవుళ్లని, వారి సహకారంతో రాష్ర్టాభివృద్ధికి అహోరాత్రులు కష్టించి పనిచేస్తామని అన్నారు.

-రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ కల్యాణలక్ష్మి అమలు -ప్రజల దీవెనతో బంగారు తెలంగాణ -దళిత, మైనారిటీలకు 200 గురుకులాలు -విద్యుత్‌శాఖలో జేఎల్‌ఎంల రెగ్యులరైజేషన్ -ఖరీఫ్‌నుంచి రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ -సాగునీటి ప్రాజెక్టులకు ఏటా 25 వేల కోట్లు : సీఎం

KCR-addressing-in-Bhopplapally-meeting

ఈ ఆర్థిక సంవత్సరంనుంచి కులాలతో నిమిత్తం లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దళిత, మైనారిటీ విద్యార్థుల కోసం 200 గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తున్నామని, విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రేపటినుంచే రెగ్యులరైజ్ చేస్తున్నామని తెలియచేశారు. -వరంగల్‌కు మంచిరోజులు – కాకతీయ కాల్వల మరమ్మతుకు 130 కోట్లు భీంఘన్‌పూర్‌లో ఎత్తిపోతల పథకం! – రామప్ప, లక్నవరం కింద రెండు పంటలకు నీళ్లు – భూపాలపల్లిలో పోలీసు బెటాలియన్, పీజీ, మైనింగ్ పాలిటెక్నిక్ కళాశాల -వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ – కేటీపీపీ రెండో యూనిట్‌ను జాతికి అంకితంచేసిన ముఖ్యమంత్రి

ఈ ఖరీఫ్ సీజన్‌ నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల కరెంటు సరఫరా చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు 2018 నాటికి రాష్ట్రంలో రెప్పపాటు కూడా కోతలు లేని విద్యుత్‌ను అందించి తీరుతామని స్పష్టంచేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్‌లో కాకతీయ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) రెండో యూనిట్ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను మంగళవారం సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ప్రభుత్వం సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నదని, ఈ ఏడాదినుంచి ఏటా 25 వేల కోట్లు కేటాయిస్తున్నదని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కేసీఆర్ వివరించారు. అనుకున్నదానికన్నా ముందే కేటీపీపీ విద్యుత్ ప్లాంటును అందుబాటులోకి తెచ్చిన విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల, ఉద్యోగులు సిబ్బందిని కేసీఆర్ సభాముఖంగా అభినందించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి అనేక వరాలు ప్రకటించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. వరంగల్‌కు మంచిరోజులు.. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా ఇటీవల వరంగల్ లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంపై ఎన్ని అభాండాలు వేసినా వరంగల్ ప్రజలు అఖండ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించి ప్రభుత్వాన్ని దీవించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. మీరిచ్చిన స్ఫూర్తితో, దీవెనలతో వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. సమైక్యరాష్ట్రంలో గత పాలకులు మనకు నీళ్లు వచ్చేటట్టు ప్రాజెక్టులు కట్టలేదు. దేవాదులను మొదలుపెట్టినప్పుడు ఆ పుణ్యాత్ములు సంవత్సరానికి 170 రోజులు నీళ్లిస్తామన్నారు. కానీ చివరికి అరవై రోజులు కూడా పంపింగ్ జరుగలేదు. ఆ ప్రాజెక్టుకు బ్యారేజ్ కూడా కట్టలేదు.

వరంగల్ జిల్లాలో ఎల్‌ఎండీ కిందికి వచ్చే కాకతీయ కాల్వలకు 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చే సామర్థ్యం ఉంది. సమైక్య పాలకుల వల్ల కాల్వలన్నీ రిపేర్‌లో ఉన్నాయి. డీబీఎం 38 కాల్వల గురించి స్పీకర్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. వీటి మరమ్మతుకు రూ.130 కోట్లు మంజూరు చేశాం. కెనాల్ కింద ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ అధికారులతో మాట్లాడి వచ్చే వర్షాకాలం నాటికి మరమ్మతులు పూర్తి చేయిస్తాం. కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి నీళ్లు తెస్తాం. గోదావరి మీద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయబోతున్నం. కాళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టుకుంటం .

అన్ని వర్గాలకూ కల్యాణలక్ష్మి.. బీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేయాలని కోరుతున్నారు. ఇక బీసీ లేదు..ఓసీ లేదు. ఓసీలతో సహా పేదలందరికీ.. రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి కల్యాణలక్ష్మీ పథకాన్ని వచ్చే మార్చి నుంచి అమలు చేస్తాము. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులను బానిసలుగా చూశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మనది మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం కాబట్టి మొన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆదేశాలు జారీ చేశాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు రెండు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న జేఎల్‌ఎంలను క్రమబద్ధీకరిస్తాం. రేపే ఉత్తర్వులు ఇప్పిస్తా. అదే విధంగా విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వాళ్లకు కూడా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్ వెళ్లిన తరువాత విద్యుత్ శాఖ మంత్రి, అధికారులతో మాట్లాడి వారికి ఆ తీపి కబురును అందించేందుకు చర్యలు తీసుకుంటా. ఇంతకుముందు ఓ ముఖ్యమంత్రి కట్టె పట్టుకుని రాష్ట్ర పటాన్ని చూపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు వస్తాయి. అంధకారం అలుముకుంటుందని చెప్పాడు. కానీ వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి పగటిపూటనే 9 గంటల కరెంట్ ఇచ్చేలా చర్చలు తీసుకుంటున్నాం. 2018 నాటికి 24 గంటలు కరెంటు సరఫరా చేస్తాం. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం.

అన్ని వర్గాలను ఆదరిస్తున్నాం మాది అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రభుత్వం. హిందువులు పండగ చేసుకుంటే వారిని గౌరవిస్తున్నాం. దసరా, బతుకమ్మ రాష్ట్ర పండుగలుగా ప్రకటించాం. మహ్మదీయ సోదరులు రంజాన్ పండుగ జరుపుకుంటే చరిత్రలో ఎప్పుడులేని విధంగా లక్షల మంది పేదలకు దుస్తులు పంపిణీ చేసి, ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాం. క్రైస్తవులు క్రిస్మస్ పండుగ జరుపుకుంటే లక్షల మంది పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసి క్రిస్మస్ విందు ఇచ్చాం. రాబోయే రోజుల్లో దళిత, మైనార్టీ విద్యార్థుల కోసం 200వరకు గురుకుల పాఠశాలలు ప్రారంభించబోతున్నాం. భూపాలపల్లి నియోజకవర్గానికి కూడా పాఠశాల రాబోతున్నది.

బుద్ధిచెప్పి పంపినా మారలేదు ప్రతిపక్షాల పేరిట కొన్ని పార్టీలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండాలి. రాజకీయాల్లో పోటీ ఉండాల్సిందే. కానీ కొన్ని ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తున్నది. మొన్ననే మీరు వారికి బుద్ధి చెప్పి పంపారు. కానీ హైదరాబాద్‌లో మళ్లీ అదే మాటలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు తప్ప నిర్మాణాత్మకమైన, గుణాత్మకమైనటువంటి ప్రకటనలు గానీ, సూచనలు గాని చేసే సంస్కారం లేదు. ఎవరేం మాట్లాడిన ప్రజలే మాకు దేవుళ్లు. కాబట్టి వారి సహకారంతో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లటానికి అహోరాత్రులు కృషి చేస్తాం.

ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, బీ వినోద్‌కుమార్, గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టీ రాజయ్య, అరూరి రమేష్, రెడ్యానాయక్, శంకర్‌నాయక్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్, కలెక్టర్ వాకాటి కరుణ, కేటీపీపీ అధికారులు పాల్గొన్నారు.

భూపాలపల్లికి వరాలు.. వెనుకబడిన భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. గాంధీనగర్‌లో పోలీస్ బెటాలియన్, పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. మైనింగ్ ప్రాంతం కావడంతో ఆ టెక్నాలజీతో కూడిన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇస్తున్నాను. నియోజకవర్గంలో రెండు వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే మార్చి తరువాత మంజూరు చేస్తాం. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు త్వరలో భీంఘన్‌పూర్‌లో (దీక్షకుంట) కొత్త ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తాం. ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలకు సాగునీటి విషయంలో మంచి అవకాశం ఉంది. దేవాదుల మూడోదశ పనులు రామప్ప వరకు పూర్తయ్యాయి. దేవాదుల పైపుల ద్వారా రామప్ప నుంచి గణపురం, లక్నవరం చెరువుల్లోకి రూపాయి ఖర్చు చేయకుండా నీళ్లు తెచ్చుకోవచ్చు. రామప్ప, లక్నవరం చెరువుల కింద రెండు పంటలు పండించి చూపిస్తానని హామీ ఇస్తున్నాను.

ఈ సీజన్‌లోనే మధుసూదనాచారి నాయకత్వంలో కాల్వలను బాగు చేసుకుని వచ్చే సీజన్ నుంచే రెండు పంటలు పండే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది. భీంఘన్‌పూర్ చుట్టూ ఉండే గ్రామాలకు కూడా సాగునీరు వచ్చేలా ఫిబ్రవరిలో పనులు మొదలుపెడతాం. వీలు చిక్కితే నేనే వచ్చి ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేస్తాను. అలాగే 365 రోజులు లక్నవరం, గణపురం, పాకాల చెరువుల్లో నీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. తెలివైన రైతులు మూడు పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.