Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పేదలు బాగుపడితేనే తృప్తి

-హైదరాబాద్‌లో మురికి బాధలు పోవాలె -చెత్త కలెక్షన్‌కు 2500 ట్రాలీ ఆటోలు కొంటాం.. -వాటిని ఆయా బస్తీల్లోని పేదలకే ఇస్తాం.. -22న నగర సమస్యలపై అధికారులతో చర్చిస్తాం.. -చెత్తపై యుద్ధంలో ప్రజలే కథానాయకులు -నాలుగేండ్లపాటు స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహిస్తాం -అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం -జూన్ 2 నుంచి హైదరాబాద్‌లో లక్ష పట్టాలు -నెలలో ఎన్టీఆర్ నగరవాసులకు ఇండ్ల పట్టాలు -భీంరావ్‌బాడ బాధితులకు అక్కడే ఇండ్లు కట్టిస్తం -స్వచ్ఛ హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ -తాను పాత ముఖ్యమంత్రులలెక్క కాదని స్పష్టీకరణ

KCR visited Maheshwaram area as a part of swachh hyderabad

పేదల బతుకుల్లో మార్పు వస్తేనే ప్రభుత్వానికి తృప్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇయ్యాల తెలంగాణ రాష్ర్టాన్ని చాలా కష్టపడి తెచ్చుకున్నం. ఈ రాష్ర్టానికి సార్ధకత రావాలంటే.. పేదలంతా నవ్వుకుంట బతకాలె. ఊర్లపొంట చెరువులు తవ్వుతుంటే రైతుల ముఖాల్లో సంతోషం కనపడుతున్నది. హైదరాబాద్‌లో ఈ మురికి బాధ పోవాలె. చెత్త బాధ పోవాలె. మీకు మంచి ఇండ్లు రావాలి. మీరంతా బాగుపడాలి. అప్పుడే ప్రభుత్వానికి తృప్తి కలుగతది అని పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చివరిరోజైన బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎన్టీఆర్‌నగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. చెత్త మీద ప్రజలే యుద్ధం చేయాలి. గవర్నమెంటు ఎంత చేసినా ఏం కాదు. ఏ బస్తీల ఉన్నోళ్లు ఆ బస్తీల.. ఏ గల్లీల ఉన్నోళ్లు ఆ గల్లీల… ఎక్కడికక్కడ ప్రజలే కథానాయకులు కావాలి. మీరు ముందల పడితేనే, పట్టుబడితేనే ఇది సక్సెస్ అయితది. శుభ్రమైన మంచినీళ్లు కడుపు నిండా రావాలన్నా.. ఈ చెత్త జీవితాలు మారాలన్నా… ఇండ్లులేని వారందరికీ ఇండ్లు రావాలన్నా.. ప్రభుత్వం-ప్రజలు కలిసి యుద్ధం చేస్తనే బాగుపడే పరిస్థితులు వస్తయి. ఈ కార్యక్రమానికి ఇప్పుడే శ్రీకారం చుట్టినం.. నాలుగేండ్లపాటు ఇది కొనసాగుతూనే ఉంటుంది. నేను పాత ముఖ్యమంత్రుల్లెక్క కాదు. ఏదో ఫొటోలు దిగిపోవడానికి రాలేదు అని పేర్కొన్నారు. ప్రభుత్వం-ప్రజలు కలిసి యుద్ధం చేస్తేనే చెత్త పోతుందని పిలుపునిచ్చారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..మల్లోసారి మీ దగ్గరికే వస్తాం..

హైదరాబాద్‌ల ఎక్కడ చూసినా దరిద్రంగా ఉంది. రోడ్ల మీదనే నీళ్లు పారుతున్నయి. ఎక్కడ వేసిన చెత్తకుప్పలు అక్కడే ఉన్నయి. చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా మారకపోతే… ఇయ్యాల మనం ఇట్ల బతికినం. రేపు మన పిల్లలు కూడా ఇట్లనే బతకాల్నా? ఈ దరిద్రంల ఉండానికే ఈ దేశంల పుట్టినమా. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ఇవన్నీ బాగు చేయాలని ముందుకు వచ్చింది. పేదోళ్లకు ఇండ్లు ఇయ్యాలె.. పరిస్థితులన్ని చక్కదిద్దాలనే ఈ కార్యక్రమం తీసుకున్నం. పాత ముఖ్యమంత్రుల్లెక్క కాదు నేను. ఏదో ఒకసారి వచ్చి.. నేను, కృష్ణారెడ్డి జాడ్ కట్టె పట్టి ఫొటో దిగితే సరిపోదు. దాంతో ఏం కాదు. నిజంగా ఏం కావాలి? ఈ పరిస్థితి మారాలె. లేనోళ్లకు ఇండ్లు రావాలి. లేనోళ్లకు నాలుగు ఇండ్లు ఇద్దామనేసరికి దొంగలొచ్చి దరఖాస్తులు పెడ్తరు. ఇది పెద్ద సమస్య. దాన్ని ఎదుర్కొనే శక్తి మీకే ఉండాలె. ఎక్కడికక్కడ అన్యాయం జరిగితే.. ఇది తప్పయ్యా, నీకు ఇండ్లున్నయి అని అడిగే తెలివి మనకు లేకపోతే… గవర్నమెంటు ఏ స్కీం పెట్టినా మల్ల గా దొంగల పాలె అయితది. అందుకోసం మిమ్ములందరినీ మానసికంగా సిద్ధం చేసి, ఒక వేదిక ఏర్పాటు చేసుకుని.. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నాలుగేండ్లు కొనసాగిస్తది. ప్రతి నెలకోసారి ఒకరోజు ఇదే అధికారులు మీ బస్తీలకు వస్తరు. మల్ల చలికాలం టైంలో.. మల్ల ఐదు రోజులో… ఆరు రోజులో… మొత్తం గవర్నమెంటు మీ దగ్గరికే వస్తది. హైదరాబాద్ సిటీ బాగుపడేదాకా… పేదల ఇండ్లు కట్టే దాకా… ఊరుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం చేసింది.

పట్టాల జాతర హైదరాబాద్‌లో ఇండ్లు కట్టుకున్న పేదోళ్లకు జీవో 58 కింద 125 గజాల వరకు పట్టాలు ఫ్రీగా ఇస్తున్నం. ఇప్పటికే 1.27 లక్షల దరఖాస్తులు వచ్చినయి. దాంట్లో లక్ష మందికి పట్టాలిచ్చే అవకాశమున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా జూన్ 2 నుంచి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంబురాల్లోనే ఆ లక్ష మందికి సర్టిఫికెట్లు ఇస్తరు. ఈరోజు సాయంత్రానికి ఈ ప్రోగ్రాం అయిపోతది. సాయంత్రం రెండు నియోజకవర్గాలున్నయి. ఉప్పల్, మల్కాజిగిరి పోవాలె. దాంతోటి ఈ తిరిగే, సమాచారం సేకరించే కార్యక్రమం బంద్ అయితది. కానీ, మొత్తం ప్రోగ్రాం బంద్ కాదు. ఈనెల 22 తారీఖున 400 మంది.. ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిండ్రో.. వాళ్లందరూ ఏ బస్తీల ఏమున్నది? ఏం లేదనేది..? రిపోర్టు తీసుకొని నా దగ్గరికి వస్తున్నరు. మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో మీటింగు ఉంటంది. దినమంత చర్చ చేసి.. బ్రహ్మాండంగా హైదరాబాద్ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారుచేస్తాం.

మీరు సుఖంగా ఉండాలన్నదే మా కోరిక హైదరాబాద్ పేరుకు పెద్ద. లోపల ఏం లేదు. గ్లోబల్ సిటీ అంటున్నం. ఒట్టిగనే అయితదా? తియ్యగ, పుల్లగ మాట్లాడితే అయితదా? పెద్ద రోడ్డు మీదపోతే మంచిగనె కనబడుతది. ఎన్టీఆర్‌నగర్‌కు వస్తే.. దాని సంగతేందో తెలుస్తది. ఆ కొసకు పోతే ఇంక బాగా తెలుస్తది. ఏ బస్తీకి పోయిన ఇదే పరిస్థితి ఉంది. ఇదంతా మారాలంటే ఎక్కడికక్కడ ప్రజలు యుద్ధం చేయాలె. మీకు తోడ్పాటుగా గవర్నమెంటు ఉంటది. మీకు ఇండ్లు కట్టించే బాధ్యత గవర్నమెంటు తీసుకుంటది. ఆ ఇండ్లు కూడా మునుపటిలా డబ్బాల్లా ఉండవు. రెండు బెడ్‌రూంలు, ఒక కిచెన్, ఒక హాల్ ఉండేలా.. భారతదేశం మొత్తంలా ఎక్కడలేని విధంగా 560 స్వేర్‌ఫీట్లలో బ్రహ్మాండంగా ఇండ్ల నిర్మాణం జరుగుతది. మీ ఎన్టీఆర్‌నగర్ చరిత్ర రాస్తే రామాయణం అంత. వింటే భారతమంత. 30-35 ఏండ్ల నుంచి మీరు ఎక్కని కొండలేదు.. మొక్కని బండ లేదు. ఎన్నో దరఖాస్తులు పెట్టిండ్రు.. పరిష్కారం కాలె. ఇదంతా గతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2-3 రోజుల్లో ఎమ్మార్వో, జీహెచ్‌ఎంసీకి చెందిన 10-15 మంది అధికారుల బృందం మీ దగ్గరికి వస్తది. మీ కాలనీ సంగతి మీకు తెల్వదు. మీరున్నది ఇక్కడగానీ… సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు లేరు. మీకు హక్కులు లేవు. కోర్టుల కేసు వాళ్లే గెలిచిండ్రు. నిన్ననే మీ ఎమ్మెల్యే వాళ్ల దగ్గరికి పోయిండు. ప్రజలు ఇండ్లు కట్టుకుండ్రు… కోర్టు ఆర్డర్ ఉందని ఇప్పుడు వాళ్లనేం ఎల్లగొడతవు. రాజీ చేసుకో. మేం వాళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటం…అని చెప్తే వాళ్లు కూడా ఒప్పుకున్నరు. అయితే వాళ్లు గూడ… మా జాగ ఎంతపోయిందో.. వేరే దగ్గర అంత జాగ చూపెట్టండని అడుగుతున్నరు. ఎన్ని కోట్లు ఖర్చయినా సరే… కోర్టుల ఈ జాగ గెలిచిన వాళ్లకు ఆ డబ్బు నేను కడ్తా. నెలలోపల మీ అందరికీ నేనే వచ్చి సర్టిఫికెట్లు పంపిణీ చేస్తా. అప్పుడు మీకు భూమిపై హక్కులు వస్తయి. భూమికి విలువ వస్తది. మంచిగ ఉంటది. ఐదు నెలల్లోపలే ఇక్కడ 800-1000 ఇండ్లు కట్టి ఇస్తం. మీరు సుఖంగా, మీ పిల్లలతోటి సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక.

కొద్దిరోజుల్లోనే వీఎం హోం టీచర్లకు ఊరట వీఎం హోం (విక్టోరియా మెమోరియల్ హోం) టీచర్ల సమస్య నాకు తెలుసు. నేను తర్వాత విజిట్‌లో ఇక్కడికి వచ్చినపుడు వీఎం హోంకు వస్తా. మీ జీతాలు తక్కువ ఉన్నట్లు తెలుసు. మిమ్మల్ని కొందరు బెదిరిస్తున్న విషయం కూడా నాకు తెలుసు. నా దగ్గర రిపోర్టు ఉన్నది. నేనే హోంకు వస్తా.. తప్పకుండా మీ సాలరీస్ ఎన్‌హాన్స్ చేయిస్త. మీరు అనాథ పిల్లలకు సేవ చేస్తున్నరు కాబట్టి, గవర్నమెంటు మిమ్మల్ని చూడాలె. ఆ బాధ్యత నేను తీసుకుంటా. మీరు వర్రీ కాకండి. కొద్దిరోజుల్లోనే మీ సమస్య పరిష్కారమైతది.

క్లాస్ తీసుకున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ… ఆటంకం కలిగించగా.. వారిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి క్లాస్ తీసుకున్నారు. క్యా… కీ… అంటె, లొల్లి పెడితే, దరఖాస్తులు పట్టుకొని అరిస్తే పని కాదు. ఐఏఎస్ అధికారులు వచ్చి మీ ఇండ్ల సుట్టూ తిరుగుతున్నరు. దరఖాస్తులు ఇయ్యకుండ నిన్న, మొన్న ఏం చేసిండ్రు? ఎందుకియ్యలె? ఇయ్యకుండ మిగిలిపోయినవాళ్లుంటే నేను పోయిన తర్వాత కూడా గంట సేపు అధికారులు ఉంటరు. మీ దరఖాస్తులు అన్నీ తీసుకుంటరు. వాళ్లు తీసుకున్నరంటే గ్యారంటీగా నా దగ్గరికొస్తయి. మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చినపుడు ఇట్ల లొల్లి చేస్తే.. ఏమన్నా ఫాయిదా ఉంటదా..? 50 ఏండ్లకెళ్లి ఇదే దుకాణం. ఇవే దండలు, దండాలు, దరఖాస్తులు… అంతకుమించి ఏం లేదు? బతుకులు మారేది లేదు. నిజంగా బతుకులు మారాలంటే స్థిరంగా కూర్చోవాలి.. మాట్లాడుకోవాలి.. చర్చ చేసుకోవాలి. శాంతంగ పని చేసుకోవాలె. అప్పుడు మార్పు వస్తది అని అన్నారు. అదేవిధంగా బస్తీల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు రాకుండా ఉన్నవారుంటే స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. అర్హుల్లో చివరి మనిషి వరకు పింఛను, రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత తనదేనని సీఎం భరోసా ఇచ్చారు. ఎవరి ఇంట్లోనైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారుంటే.. వాళ్లు పేర్లు నమోదు చేయించుకోవాలని, ఉచితంగా కార్పొరేట్ వైద్యం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మహేశ్వరం, బాల్కొండ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు.

రోడ్ల మీద కష్కెడు చెత్త ఉండొద్దు పరిశుభ్రత గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు చెత్తను రిక్షాల మీద తీసుకుపోతున్నరు. ఆ సిస్టం బాగలేదు. రిక్షాలు ఒక దగ్గర జమ చేయడం, మల్ల బజార్ల ఒక దగ్గర పోయడం… అక్కడికి రెండ్రోజులకోసారి లారీ వచ్చుడు.. అప్పటిదాకా అక్కడ కంపు కొట్టుడు.. ఇవన్నీ జరుగుతున్నయి. ఇవన్నీ మారాలంటే చెత్త కలెక్షన్ రిక్షాలతో కాదు. ఆటో ట్రాలీలతో జరగాలె. ఒకటీ, ఒకటిన్నర నెలలో మొత్తం 2500 ఆటో ట్రాలీలను ప్రభుత్వం కొంటున్నది. దాంట్లో రెండు కంపార్టుమెంట్లు ఉంటయి. ధనవంతులు, పేదవాళ్లు అనే తేడా లేకుండా ప్రభుత్వం ప్రతి ఇంటికి రెండు వేర్వేరు కలర్లతో చెత్త బుట్టలు కొనిస్తది. తడి చెత్త ఒక దాంట్లో, పొడి చెత్త ఇంకోదాంట్ల పోయాలె. బుట్టలిచ్చేటపుడు అన్నీ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తారు. ఎందుకంటే తడి చెత్త.. ఎరువులు తయారుచేయడానికి పోతది. పొడి చెత్త.. కరెంటు తయారు చేయడానికి పోతది. మనం ఇక్కడనే వేరు చేసి ఇస్తే.. సీటీల చెత్త లేకుండా ఉంటది. నగరానికి నాలుగు మూలలా లారీల ట్రాంపులు తయారయితున్నాయి.. అక్కడ చెత్త తీసుకెళ్లే లారీలు ఉంటయి. ఇంట్లో నుంచి ఆటోలోకి, ఆటోలో నుంచి లారీల దగ్గరికి పోతయి. లారీ సీదా కరెంటు ప్రొడ్యూస్ చేసే కాడికి పోతది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలె. హైదరాబాద్‌లో కష్కెడు చెత్త కూడా ఉండకుండా అందరం పట్టుబడితెనే అయితది. గవర్నమెంటు ఈ పని తీసుకున్నది. గవర్నమెంటే పైసలు పెడతది. ప్లాస్టిక్ బుట్టలు కొనిస్తది. ఆటోలు రిక్షాలు పెడ్తది. మీ బస్తీల ఉండే పేదోళ్లకే ఆ ఆటోరిక్షాలు కొనిస్తాం. ఎకనామిక్ యాక్టివిటీ కింద పిల్లలకు ఇస్తం.

గెంటేసిన దగ్గరే ఇండ్లు కట్టిస్త… భీంరావ్‌బాడ అన్నదమ్ములొచ్చిండ్రు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆఫీస్ కడ్తామని కూలగొట్టి… ఆ గాంధీభవన్ పక్కన ఉంటె ఆగం పట్టించిండ్రు. ఆ కాంగ్రెసోళ్లకు కావాలంటె నేను ఇంకో దగ్గర జాగ ఇస్త. వాళ్లను పిలిచి మాట్లాడతా. భీంరావ్‌బాడ ప్రజల్ని వెళ్లగొట్టడాన్ని గతంలో మేం వ్యతిరేకించినం. ఇది అన్యాయం అని చెప్పినం. కొట్లాడినాం.. కానీ ఆ దుర్మార్గులు అప్పుడు విన్లే. ఏదేమైనా.. మనకు పంచాయితీ అవసరంలేదు. మీరు వాళ్లతో కొట్లాడకండి. నేనే పిలిపించి.. మాట్లాడుతా. ఎందుకు బదనాం అయితరు.. వాళ్ల జాగ వాళ్లకు ఇచ్చేయండి, మీకు ఇంకో దగ్గర జాగ ఇస్త… కాంగ్రెస్ ఆఫీస్ బ్రహ్మాండంగా పెద్దగా కట్టుకోండని కూడా చెబుదాం. మీ ఇండ్లు మాత్రం ఆడనే కట్టిద్దాం. అప్పుడే భీంరావ్‌బాడ ప్రజలకు న్యాయం జరుగుతది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండె… ఆగమైనం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది… మీ బిడ్డనె ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నడు… మీ మనసు నింపే బాధ్యత నాది. ఇయ్యాల్నె వివరాలు తెప్పించుకొని, మీ సమస్యను కూడా పరిష్కారం చేస్తా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.