-అన్ని ఆస్తులూ ఆన్‌లైన్‌లో నమోదు -ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి -దళారులను నమ్మొద్దు.. పైసా ఇవ్వొద్దు -అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్

వ్యవసాయేతర ఆస్తులపై ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను పరిష్కరించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆస్తి హక్కులు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అవసరమైతే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ కాలనీల్లో ఏండ్లుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపై శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు 24.50 లక్షల ఆస్తులు ఉన్నాయని, వీటిలో కొన్నింటిలో ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తిహక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా కృషిచేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆస్తి హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని, కేవలం ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి, అవసరమైతే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లోని ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక, రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొంటారని మంత్రి తెలిపారు. ప్రజలు దళారులను నమ్మవద్దని, ఎవ్వరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో దాదాపుగా భూసమస్యలు తొలగిపోయాయని, ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మంత్రి తెలిపారు. కాగా,
హైదరాబాద్ గత ఆరేండ్లలో లక్షలాదిమందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు పరిపాలన సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో హైదరాబాద్ నగరం విస్తరిస్తున్నదని చెప్పారు. అవినీతికి పాతరవేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
-1న ఓటరుగా నమోదు చేసుకుంటా -అర్హత ఉన్న కార్యకర్తలూ చేసుకోవాలి -గ్రాడ్యుయేట్ల నమోదు బాధ్యత నేతలదే -ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -పార్టీ నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం

నాయకుడంటే ముందుండి నడిపించేలా ఉండాలి.. ఇంకొకరికి మార్గదర్శకంగా నిలవాలి.. అందుకే తానే ముందు నిల్చోనున్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు. ఓటర్లకు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు మార్గదర్శకంగా నిలిచేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యే తొలిరోజునే ఓటరుగా నమోదు చేసుకుంటానని చెప్పారు. తానే కాదు, అర్హత ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా అదేరోజు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా న మోదు చేయించే బాధ్యత తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శాసనమండలి పట్టభద్రుల స్థానం ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శనివారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇంచార్జిలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను దీటుగా తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పట్టభద్రులకు చేర్చే ప్రయత్నం చేయాలని, ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో ప్రతిపక్షాల అవాస్తవాలను ఎండగట్టి, వాస్తవాలను గణాంకాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం 1.50లక్షల మందికి ఉద్యోగాలు, టీఎస్‌ఐపాస్ ద్వారా దాదాపు 15లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించిన సంగతిని గుర్తుచేశారు.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకుపోతున్నదని, సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతాంగాన్ని బలోపేతం చేసే అనేక కార్యక్రమాలను టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాలమూరు పచ్చగా మారిందని, వలసలు ఆగిపోయాయని కేటీఆర్ అన్నారు. త్వరలోనే ఉమ్మ డి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ హైదరాబాద్ జిల్లాల్లో బలమైన శక్తిగా ఉన్నదని, ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తన బలాన్ని చాటుకున్నదని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహంతో ముందుకుపోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు పరిపాలన సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో హైదరాబాద్ నగరం విస్తరిస్తున్నది. ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది.
-మంత్రి కేటీఆర్