-బీజేపీ నేతల్లారా ఒళ్లు దగ్గర పెట్టుకోండి
-మేం తంబాకు.. లవంగం ఫైల్స్ తీస్తాం
-కేంద్రమంత్రి గడ్కరీని చూసి నేర్చుకోండి
-ఢిల్లీ వర్సిటీకి రాహుల్ ఎందుకు వెళ్లలేదు?
-ఓయూలో రాజకీయ సభ ఎలా పెడతారు?
-ముందు అమరవీరులకు క్షమాపణ చెప్పాలి
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్

బండి సంజయ్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదని, పేకాటలో జోకర్‌లా ఆయన వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. శనివారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. బండి సంజయ్ పాదయాత్రలో జనం లేక పిచ్చెక్కి నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా ఏ ఒక్క బీజేపీ నేత ఇంటి నుంచి కాలు బయటపెట్టలేరని హెచ్చరించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రజాకార్ ఫైల్స్ తీస్తామని బండి పేర్కొనటాన్ని తప్పుబట్టారు. బండి సంజయ్‌పై ‘తంబాక్ ఫైల్స్.. లవంగం ఫైల్స్’ తీస్తామని చురకలంటించారు. బండిది ప్రజాసంగ్రామ యాత్ర కాదని, పాపాలు కడుక్కొనే యాత్ర అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి స్పష్టమైన అవగాహన ఉన్నదని, ఆయనను చూసైనా బీజేపీ నేతలు బుద్ధితెచ్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రగతిశీలంగా పురోగమిస్తుందని గడ్కరీ పేర్కొనటాన్ని గుర్తుచేశారు.
ఉద్యమకారులపై మాట్లాడే హక్కు లేదు
రెండు అడుగుల రేవంత్, తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి తమలాంటి ఉద్యకారులపై మాట్లాడే నైతిక హక్కులేదని సుమన్ తేల్చిచెప్పారు. పోశమ్మగుడి ముందు పొట్టేలును కట్టేసినట్టు ఉండే జగ్గారెడ్డి ఉద్యమకారులపై మాట్లాడితే సహించబోమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసి, విద్వేషాన్ని రగిల్చేందుకే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నేతలు ఉస్మానియాకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా వెళ్లేముందు రాహుల్‌గాంధీ అమరవీరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల సభలు సమావేశాలు ఉస్మానియాలో పెట్టుకూడదని, గతంలో యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి నిర్ణయం తీసుకొన్నదని గుర్తుచేశారు. రాహుల్‌కు నిజంగా విద్యార్థులపై ప్రేమ ఉంటే ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూలో విద్యార్థులపై దాడులు జరిగితే ఎందుకుపోలేదని ప్రశ్నించారు. రాహుల్‌ది ఐరెన్‌లెగ్ అని, గోల్డెన్‌లెగ్ అని నిరూపించుకోవాలనుకొంటే గుజరాత్ కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే చూడలేని కాంగ్రెస్, రైతు సంఘర్ష్ యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. నలగొండ జిల్లాలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే నోముల భగత్ సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతున్నప్పటికీ, పనులే చేయడం లేదన్న రేవంత్‌ను చూసి ప్రజలు నవ్వుకొంటున్నారని వివరించారు.