-మహారాష్ట్ర మంత్రికి హరీశ్‌రావు లేఖ
మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్ట్‌ల సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాణహిత-చేవెళ్ల, లెండి ఎత్తిపోతల పథకం, పెనుగంగ ప్రాజెక్ట్‌లకు సంబంధించి పెండింగ్‌పనులపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌కు రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు లేఖ రాశారు.
మహారాష్ట్ర జెగ్నూరు,నిజామాబాద్ సరిహద్దులోని లెండి ప్రాజెక్ట్‌కు 1985లో శంకుస్థాపన జరిగినా, ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మహారాష్ట్రకు 3.93 టీఎంసీలు తెలంగాణకు 2.43 టీఎంసీల నీరందనుంది. ఏయే పనులు ఎక్కడెక్కడ నిలిచాయి?, పునరావాసంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? అనే విషయాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్ట్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నది. ప్రాణహిత-చేవెళ్ల, ఆదిలాబాద్ పెనుగంగ ప్రాజెక్ట్‌లో కూడా సమస్యలను పరిష్కరించడంపై మంత్రి హరీశ్‌రావు దృష్టి సారించారు.