Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పింఛన్ తీసుకునే అవ్వను అడగండి.. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తది

-ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిలకు మంత్రి హరీశ్‌రావు సూచన -ఇక్కడి సర్కారు పథకాలకు పేర్లుమార్చి ఏపీలో అమలు -కాపీనాయుడు సొంత తెలివితేటలతో చేసిందేమీలేదు -ఆంధ్రాబాబు డైరెక్షన్‌లో పనిచేసే నాయకులకు తెలంగాణలో ఇక నూకలు చెల్లాయి: మంత్రి ధ్వజం

Harish Rao

మీ సొంత నియోజకవర్గాలల్లోని గ్రామాల్లో ఆసరా పింఛన్ తీసుకుంటున్న అవ్వను అడగండి చెబుతారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు చేసే మీకు, ఆ తల్లుల కండ్లలో ఆనందం కనిపిస్తది అని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రవెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి ఉనికిని చాటుకునేందుకు, పత్రికల్లో కనిపించేందుకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు చేసే ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత నియోజకవర్గమైన పాలకుర్తిలో వెయ్యి రూపాయల పింఛన్లు తీసుకుంటున్న అవ్వ కండ్లలో ఆనందం చూస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నదో మీకే తెలుస్తుందన్నారు. కేవలం ఉనికిని చాటుకునేందుకే ప్రభుత్వంపై టీడీపీ నాయ కులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు గమనిస్తున్నారని, ఆంధ్రాబాబు డైరెక్షన్‌లో పనిచేసే నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఇక నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.

కల్యాణలక్ష్మి ఏపీలో అమలుచేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం 25లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నది మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆంధ్రాలో సీడింగ్ విధానంలో ప్రతి ఒక్కరికీ 4కిలోల బియ్యమే ఇస్తున్నారని, తెలంగాణ సర్కార్ సీడింగ్ ఎత్తివేసి ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం అందించి, కడుపు నిండా అన్నం పెడుతున్నదన్నారు. మూడేండ్లుగా నిలిచిపోయిన విద్యార్థుల ఫీజులకు రూ.1800 కోట్లు విడుదల చేయడమేగాక, వచ్చే విద్యాసంవత్సరానికి రూ.2,800కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతి విద్యాసంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.4వేల కోట్లు, పింఛన్ల కోసం రూ.4వేల కోట్లు, ఆహారభద్రత కోసం రూ.3వేల కోట్లను పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. ఇప్పటికే 3,800 మందికి షాదీముబారక్ పథకం కింద రూ.51వేల చొప్పున అందించామని ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి న్యాయబద్ధంగా రావాల్సిన కరెంటు ఇవ్వకుండా చంద్రబాబు కర్కశంగా ప్రవర్తించారని, ఆంధ్రా రైతులకు హక్కు లేకున్నా పొలాలు ఎండిపోవద్దని మానవతా థృక్పథంతో సీఎం కేసీఆర్ ఆదుకున్నారన్నారు. బాబు నిజ స్వరూపం ఇప్పుడే బయటపడుతుందని, మాయమాటలు చెప్పే ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారని ఆంధ్రాప్రజలు సైతం అర్థం చేసుకున్నారన్నారు.

బాబు పల్లకీ మోసే నేతలకు పుట్టగతులుండవు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెడుతున్న చంద్రబాబునాయుడు కాపీనాయుడుగా తయారయ్యారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. ఆంధ్రా ప్రజలకు సొంత తెలివితేటలతో చేసిందేమీ లేదని, పైగా కాపీబాబుగా మిగిలిపోయారని విమర్శించారు. ఉద్యోగుల ఫిట్‌మెంట్, హరితహారం, మిషన్ కాకతీయ, పోలీసులకు నూతన వాహనాల వంటి పథకాల పేరు మార్చి ఏపీలో ప్రవేశపెట్టి కాపీబాబుగా తేటతెల్లమయ్యారన్నారు. ఉద్యమం నుంచి పునర్నిర్మాణం వరకు తెలంగాణకు అడుగడుగునా అడ్డుతగులుతూ ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ నూక లు చెల్లాయని ఆ పార్టీకి చెందిన సభ్యత్వ నమోదు చూస్తేనే అర్థమవుతున్నదన్నారు. ఆంధ్రాబాబు పల్లకీ మోసే నాయకులకు తెలంగాణలో పుట్టగతులుండవని హెచ్చరించారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, నంగునూరు మండల ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మూర్తి బాల్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, నాయకులు నముండ్ల రాంచంద్రం, గుండుశ్రీను పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.