-అర్హులందరికీ ఆసరా: మంత్రి కేటీఆర్ -నిరంతర ప్రక్రియ అని ప్రచారం చేయండి: జానారెడ్డి -వయో పరిమితిని కుదించండి: లక్ష్మణ్, ఎర్రబెల్లి, అక్బరుద్దీన్ -అసెంబ్లీలో ఆసరా పథకంపై వాడి, వేడి చర్చ

ఆసరా పథకం కింద పింఛన్ల మంజూరులో క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, అయితే దేశంలో ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇస్తున్నది తామేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆసరా పథకంపై చర్చలో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఆసరా పథకంపై సభలో అర్థవంతంగా చర్చ జరపడం ద్వారా ఒక్క ప్రాణాన్ని నిలిపినా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించినట్లు అవుతుందన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది వికలాంగులున్నా, ఎందరు వితంతువులున్నా పింఛన్లు యథావిధిగా మంజూరు చేస్తున్నామని, వృద్ధుల పింఛన్ల విషయంలోనే కొన్ని నిబంధనలు పెట్టినట్లు చెప్పారు. పింఛన్ల సంఖ్య ప్రభుత్వం తగ్గించేందుకు ప్రయత్నిస్తుందన్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఉన్న 32 లక్షల పింఛన్లే కాదు అవసరమైతే 35 లక్షల పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలనే తాము అమలుచేస్తున్నామన్నారు. బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భోజనం చేసి గురువారం అసెంబ్లీ మాట్లాడడం సరికాదని టీడీపీ సభ్యులనుద్దేశించి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ పింఛన్లే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకమని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ప్రస్తుతం 32 లక్షల మేర ఉన్న పింఛన్లలో నలుబైశాతం కోత పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆసరా పథకానికి దరఖాస్తు చేసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారని, దీనిపై ప్రజల్లో ప్రచారం చేసి వారికి ఆత్మైస్థెర్యం కల్పించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు.
ఆదాయ పరిమితిని పెంచడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారి జాబితా తెచ్చి తనకివ్వాలని, వారికి పింఛన్ ఇప్పిస్తానని సీఎం ప్రకటించడం సంతోషకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆసరా పథకం కింద పింఛన్ రావడం లేదన్న ఆందోళనతో ఇప్పటివరకు 18 మంది మరణించారని బీజేపీ శాసనసభాపక్ష నేత కే లక్ష్మణ్ అన్నారు. వెంటనే ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తాము ఎప్పుడూ కూడా పింఛన్లు, రేషన్ ఇవ్వబోమని చెప్పలేదని, కానీ విపక్షాలు విషప్రచారం చేస్తూ వారి హత్యలకు కారణం అవుతున్నాయన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య స్పందిస్తూ ప్రజల ఆయుఃప్రమాణాలు పెరిగాయని, గిరిజన ప్రాంతాల్లో ఇంకా సమస్యలున్నాయని అక్కడ 50 ఏండ్లకే పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీడీ కార్మికులకు కూడా ఆసరాతోపాటే భృతి చెల్లించాలని కోరారు. ఆసరా పథకానికి వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 60ఏండ్లకు కుదించాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పింఛన్లు ఖరారు చేసే సమయంలో సరైన విచారణ జరిపి ఇవ్వాలని వైఎస్సార్సీపీఎల్పీ నేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ పథకం పెట్టినందుకు ప్రజలు హర్షిస్తున్నారని, అయితే ప్రభుత్వం చెబుతున్నదానికి ఆచరణకు తేడా ఉందని సీపీఎం నేత రాజయ్య అన్నారు.