Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పెట్టుబడుల వెల్లువ , పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన థామ్సన్

– పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన థామ్సన్ – 300 కోట్లతో టీవీ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు – ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి – సైబర్ సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం – సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో మంత్రి

KCR inaugurating Thomson company in Taj krishna

ఐటీతోపాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా తెలంగాణకు పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కరణ నేపథ్యంలో సుప్రసిద్ధ విదేశీ కంపెనీ థామ్సన్ ఇక్కడ టీవీల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మంగళవారం తాజ్ డెక్కన్‌లో థామ్సన్ ఎల్‌ఈడీ టీవీ ఉత్పత్తి శ్రేణిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీప భవిష్యత్తులోనే తెలంగాణ పరిశ్రమలకు పెద్ద కేంద్రంగా మారనుందని చెప్పారు. సత్వర పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారని, భారీ ఎత్తున పరిశ్రమల స్థాపనతో ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాలని భావిస్తున్నారని తెలిపారు. మరోవైపు సైబర్ నేరస్తులు విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటామని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ (ఎస్‌సీఎస్‌సీ)లో కేటీఆర్ చెప్పారు.

రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మేక్ ఇన్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా విధానాన్ని మన రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుపర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తాజ్ డెక్కన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చెప్పారు. అధికమొత్తంలో ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపన చేపట్టే రాష్ర్టాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వనుందని, ఆ ప్రక్రియకు మన రాష్ట్రం అర్హత పొందే విధంగా పరిశ్రమల స్థాపనను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 300 కోట్లతో థామ్సన్ పరిశ్రమ థామ్సన్‌వంటి సుప్రసిద్ధ విదేశీసంస్థ హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న రెజల్యూట్ సంస్థ ద్వారా రూ.300 కోట్లతో ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువుల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. ఈ పరిశ్రమద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 300 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని, రూ.350 కోట్లతో సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు మైక్రోమాక్స్ సంస్థ పూజా కార్యక్రమాలు కూడా చేసిందని తెలిపారు. గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు వాటి కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఐటీరంగంలో దేశవ్యాప్తంగా 13% వృద్ధి కనబరుస్తుండగా.. తెలంగాణలో 16% పురోగతి ఉందన్నారు. కొత్తగా పరిశ్రమల స్థాపనకు వచ్చేవారికి ఏకగవాక్ష పద్ధతిలో భారీ పరిశ్రమలైతే 30 రోజులు, చిన్న తరహా పరిశ్రమలైతే 15రోజుల్లో అనుమతులిస్తున్నామని వివరించారు. రాష్ట్ర జనాభాలో 40% జనాభా హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉందని, దీని పరిధిలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయని చెప్పిన కేటీఆర్.. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర జిల్లాలకు కూడా పరిశ్రమలను విస్తరించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. థాంప్సన్ సంస్థ టెక్నికల్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షురాలు మాన్యుయల్ వాహ్ల్ మాట్లాడుతూ 12.5 బిలియన్ డాలర్ల వార్షిక మార్కెట్ విలువతో భారతదేశం తమకు అతి పెద్ద మార్కెట్ అన్నారు. భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా, హైదరాబాద్‌లో పరిశ్రమను నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. థాంప్సన్ భారతదేశ ప్రతినిధి బిరెన్ గోష్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, రెజల్యూట్ ఎలక్ట్రానిక్స్ సంస్థ సీఈవో ఏ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సైబర్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం సైబర్ నేరస్తులు విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. భవిష్యత్ తరాలు ఎదుర్కొనే సమస్యల్లో సైబర్ సెక్యూరిటీయే ప్రధానమైందని అన్నారు. ఈ క్రమంలో ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణులను తయారు చేస్తుందని ప్రకటించారు. ఈ దిశగా ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరంనుంచి శిక్షణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. సమస్యనుంచే అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో క్రియాశీలంగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని కేటీఆర్ చెప్పారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ (ఎస్‌సీఎస్‌సీ)కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంతో తప్పనిసరి అనుసంధానంగా మారిందని, అదే సమయంలో ఇంటర్నెట్ ఆధారిత నేరాలు, సమస్యలు కూడా పెరిగిపోయాయని చెప్పారు. ప్రపంచంలో పేరెన్నికగన్న సంస్థలు కూడా సైబర్ క్రైమ్ బారినపడడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. భారతదేశంలో కూడా సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయని, అయితే వినియోగదారుల వద్ద ఇమేజ్ కోల్పోతామనే భయంతో హ్యాకింగ్ వివరాలను ఆ కంపెనీలు వెల్లడించడం లేదని తెలిపారు. తాను అమెరికా వెళ్లినపుడు మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్‌బంగా సైతం సైబర్ సెక్యురిటీ విషయంలో ఇబ్బందులపై చర్చించారని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ చొరవను వివరిస్తూ సైబర్ సెక్యూరిటీలో నిపుణులను తయారుచేసేందుకు ప్రఖ్యాత సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం.

ప్రపంచ ప్రఖ్యాత కార్నెగీ మిలన్ యూనివర్సిటీతో సంప్రదింపులు పూర్తయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం లేదా ఆ లోపే కార్నెగీ వర్సిటీ సిబ్బంది ఇక్కడ క్లాసులు చెప్పనున్నారు అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గౌరవ అధ్యక్షుడు, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ వ్యక్తిగత అవగాహన, భద్రతాపరమైన సలహాలు పాటిస్తే సైబర్ నేరాల్లో చిక్కుకుపోకుండా ఉండగలమని అభిప్రాయపడ్డారు. డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో నందకుమార్ సరవాడే మాట్లాడుతూ విశ్వవిఖ్యాత సోనీ కంపెనీ వెబ్‌సైట్‌సైతం హ్యాకింగ్‌కు గురైందని, అమెరికాలో ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్లు కూడా హ్యాకింగ్‌కు గురవుతున్నాయని అన్నారు. సమావేశంలో ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ భరణీ అరోల్, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.