-పారిశ్రామికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కంకణం -ప్రజాకాంక్ష మేరకు అనేక నిర్ణయాలు -దుబాయి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ మీట్‌లో మంత్రి జూపల్లి

పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని.. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పెట్టుబడులకు గ్యారంటీ ఇచ్చే రాష్ట్రమని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పారిశ్రామికాభివృద్ధికి కంకణం కట్టుకున్నారని స్పష్టం చేశారు.
బుధవారం దుబాయిలో మూడో రోజు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ మీట్‌లో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్‌కార్పొరేట్ నినాదంతో తెలంగాణ పారిశ్రామిక పాలసీని అమలు చేస్తున్నామని అన్నారు. అవినీతి, వేధింపులులేని పాలసీని రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అంశాల్లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం-2014ను దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందాయన్నారు. మెగా ప్రాజెక్టులకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ టీ స్విఫ్ట్ ద్వారా సింగిల్‌విండో విధానం కింద అనుమతులు ఇస్తామన్నారు.
లైఫ్ సైన్సెస్, ఐటీ/ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్/ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో మొబైల్స్, టెక్స్‌టైల్/అప్పరెల్, ప్లాస్టిక్/పాలీమర్స్, డొమెస్టిక్ అప్లయెన్సెస్, జెమ్స్ అండ్ జ్యుయెల్లరీ, వేస్ట్ మేనేజ్‌మెంట్/గ్రీన్ టెక్నాలజీస్, సోలార్ పార్కులు/రెన్యువబుల్ ఎనర్సీ తదితర రంగాలను ప్రాధాన్యత సెక్టార్లుగా ఎంపిక చేసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా లులూ, దుబాయి ఇంటర్‌నెట్ సిటీ, దుబాయి మీడియా సిటీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దుబాయిలోని ఒయాసిస్ సిలికాన్‌ను సందర్శించారు. అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.