– సెస్ జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయని, 15 రోజుల్లోనే అనుమతులు వచ్చే అత్యుత్తమ ఇండస్ట్రియల్ పాలసీని తమ ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు. సెస్ ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరుగనున్న జాతీయ సదస్సును శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15రోజుల్లో అనుమతులు ఇచ్చే సింగిల్‌విండో విధానమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటుచేసినట్లు వివరించారు. సమావేశంలో మంత్రితో పాటు సెస్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.