Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పెట్టుబడులొచ్చాయ్‌!

-రూ.3,500 కోట్లతో తెలంగాణలో పరిశ్రమల స్థాపన -ముందుకొచ్చిన యూఏఈ సంస్థలు -ఆహారశుద్ధి, వైద్యపరికరాల తయారీ, ఔషధ పరిశ్రమలు -హైదరాబాద్‌లో భారీ దుకాణ సముదాయం -మంత్రి కేటీఆర్‌ సమక్షంలో దుబాయ్‌లో ఒప్పందాలు

యూఏఈలోని రెండు ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థలు లులు గ్రూపు, బీఆర్‌ శెట్టి గ్రూపులు తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి. ఆదివారం అబుదాబీ, దుబాయ్‌ల్లో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దావోస్‌ పర్యటన ముగించుకొని యూఏఈకి వచ్చిన మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ సంస్థలతో సమావేశమయింది. తొలుత అబుదాబీలో లులు గ్రూపుతో మూడు ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. వీటిపై తెలగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, లులు గ్రూపు సీఈవో సైఫీ రూపవాలా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రిటైల్‌, ఆహారశుద్ధి రంగాల్లో పేరొందిన లులు గ్రూపు రూ.2,500 కోట్లతో మెదక్‌ జిల్లాలో కూరగాయల శుద్ధి పరిశ్రమను, రంగారెడ్డి జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమను, హైదరాబాద్‌లో 1.8 మిలియన్‌ చదరపు అడుగుల్లో భారీ దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. వీటి ద్వారా ఆరు వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులకు పేరొందిన తెలంగాణలో మరిన్ని ప్రాజెక్టు రావాలని ఆశిస్తున్నామన్నారు. సంస్థ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ విధానాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో భారత్‌లో తమ వ్యాపార విస్తరణ కోసం ఈ రాష్ట్రాన్నే ఎంచుకున్నామని చెప్పారు. తమకు భూములు కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మూడు నెలల్లోనే పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.

బీఆర్‌ శెట్టి గ్రూపుతో.. అనంతరం దుబాయ్‌లో బీఆర్‌ శెట్టి గ్రూపు సంస్థతోనూ అవగాహన ఒప్పందం కుదిరింది. జయేశ్‌రంజన్‌, బీఆర్‌ఎస్‌ సంస్థ ప్రతినిధి సంతకాలు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ శెట్టి పాల్గొన్నారు. తాము తెలంగాణలో రూ.వేయి కోట్ల పెట్టుబడులతో మూడు నుంచి అయిదేళ్లలో మూడు ప్రాజెక్టులను నిర్మిస్తామన్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ధి కేంద్రం, సుల్తాన్‌పూర్‌లోని పార్కులో మరో 20 ఎకరాలతో వైద్యపరికరాల తయారీ సంస్థ, మరో 50 ఎకరాల్లో 500 పడకలతో గ్రీన్‌ఫీల్డ్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పుతామన్నారు. వీటి ద్వారా నాలుగువేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కేటీఆర్‌ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, ఔషధ, ఆర్థిక సేవల రంగాల్లో పేరొందిన బీఆర్‌ఎస్‌ సంస్థ తెలంగాణలో పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనందదాయకమన్నారు. వాటిని స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు.

కేటీఆర్‌కు భారత రాయబారి ప్రశంసలు అనంతరం కేటీఆర్‌ యూఏఈలోని భారత రాయబారి నవదీప్‌ సూరితో దుబాయ్‌లో భేటీ అయ్యారు. రెండు సంస్థలతో ఒప్పందాల సమాచారం ఇచ్చారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడుల సాధనకు చేస్తున్న కృషిని వివరించారు. సూరి మాట్లాడుతూ.. పెట్టుబడుల సాధనకు మంత్రి చొరవ అభినందనీయమన్నారు. తెలంగాణకు యూఏఈ నుంచి పలు సంస్థలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ 15 రోజుల విదేశీ పర్యటనను పూర్తి చేసుకొని సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం టీహబ్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.